థర్డ్ వేవ్ హెచ్చరిక: ముంబైలో జూలై తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదు!

ABN , First Publish Date - 2021-09-09T14:23:54+05:30 IST

దేశంలో కరోనా థర్డ్ వేవ్ దగ్గరపడుతున్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

థర్డ్ వేవ్ హెచ్చరిక: ముంబైలో జూలై తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదు!

ముంబై: దేశంలో కరోనా థర్డ్ వేవ్ దగ్గరపడుతున్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముంబైలో గడచిన 24 గంటల్లో కొత్తగా 532 కరోనా కేసులు నమోదయ్యాయి. గత జూలై తరువాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. జూలై 15న ఒక్కరోజులో 528 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర మొత్తం మీద చూసుకుంటే గడచిన 24 గంటల్లో కొత్తగా 4,174 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 65 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. 


రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 64,97,872క చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,37,962కు చేరింది. ముంబైలో రెండు నెలల వ్యవధిలో కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. పాజిటివిటీ రేటు కూడా 0.9 నుంచి 1.1 శాతానికి చేరింది. ఆగస్టు మూడవ వారంలో దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 0.5 నుంచి 0.7 శాతం మధ్యలో ఉంది. ముంబైలో ఇటీవలే లోకల్ రైళ్ల సేవలు ప్రారంభమయ్యాయి. కొన్ని స్కూళ్లు కూడా తిరిగి తెరుచుకున్నాయి. ఈ కారణంగానే ముంబైలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నదని నిపుణులు భావిస్తున్నారు. అందుకే కరోనా ఆంక్షలను సడలించకూడదని సూచిస్తున్నారు. గణేశ్ ఉత్సవాల సందర్బంగా జనం తాకిడి పెరిగి, కరోనా కేసులు ఉధృతమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-09-09T14:23:54+05:30 IST