కడచూపునకు పరిమితి

ABN , First Publish Date - 2020-04-10T06:37:20+05:30 IST

ఒక వ్యక్తి గొప్పతనాన్ని, మంచితనాన్ని ఆ వ్యక్తి చనిపోయినప్పుడు కడసారి చూసేందుకు వచ్చిన వారు, రాలేకపోయినా ఆ వ్యక్తిని తలుచుకుని...

కడచూపునకు పరిమితి

మార్చురీలో మృతదేహం వద్దకు ముగ్గురే

శ్మశాన వాటికలోకి ఐదుగురికే అనుమతి

కరోనా మృతుల అంత్యక్రియలకు మార్గదర్శకాలు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ఒక వ్యక్తి గొప్పతనాన్ని, మంచితనాన్ని ఆ వ్యక్తి చనిపోయినప్పుడు కడసారి చూసేందుకు వచ్చిన వారు, రాలేకపోయినా ఆ వ్యక్తిని తలుచుకుని బాధపడేవారితో ముడిపెడతారు. చనిపోయాక పాడె మోసేందుకు కనీసం నలుగురితోనైనా మంచిగా ఉండాలని పెద్దలు చెబుతారు. కానీ, కరోనా వైరస్‌ బారిన పడి చనిపోయిన వారిని చూసేందుకు ఎవరూ రారు! ఎవరికైనా రావాలని ఉన్నా రానివ్వరు. నలుగురు కాదు... కేవలం ముగ్గురు కుటుంబ సభ్యులు/బంధువులను మాత్రమే ఆస్పత్రి మార్చురీలోని మృతదేహం వద్దకు వెళ్లనిస్తారు. మార్చురీలోని మృతదేహాన్ని అద్దాల కిటికీ నుంచే వారు చూడాలి. ఈ మేరకు తెలంగాణ  ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. 


మరికొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలివీ..

సంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని శుభ్రపరిచి, తెల్లటి వస్త్రాలు కప్పుతారు. ముఖం కనిపించేలా చేసి, మిగతా భాగాన్ని ప్లాస్టిక్‌ కవర్‌తో చుట్టేస్తారు.

మృతదేహాల రవాణాతోపాటు కరోనా నివారణ చర్యలు చేపట్టగల ఏజెన్సీలకే ఈ పని అప్పగిస్తారు. 

మృతదేహాన్ని తరలించే వాహనంలో మృతుడి కుటుంబ సభ్యులు/బంధువులెవర్నీ అనుమతించరు. 

ఆ వాహనంలో డ్రైవర్‌ను, శవాన్ని వాహనంలోకి ఎక్కించేందుకు/దించేందుకు నలుగురు, మరో సహాయకుడిని మాత్రమే అనుమతిస్తారు. వారందరికీ పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్వి్‌పమెంట్‌ పూర్తిస్థాయిలో ఉంటుంది 

దహన సంస్కారాలు జరిగే చోటకు ఐదుగురు కుటుంబ సభ్యులనే అనుమతిస్తారు. 

అంత్యక్రియల స్థలం వద్దకు శవాన్ని మోసుకొచ్చే నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. చుట్టూ మూడు మీటర్ల వరకు కర్రలతో బారికేడ్‌ నిర్మించి, ఇతరులు ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 

ఈ మొత్తం ప్రక్రియలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది. 

Updated Date - 2020-04-10T06:37:20+05:30 IST