నెల్లూరులో వైరాగ్యంలోకి వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2020-07-07T13:42:14+05:30 IST

సింహపురి రాజకీయ పార్టీలపై కరోనా వైరస్‌ ఎలాంటి ప్రభావం చూపింది? కరోనా కాలంలో వైసీపీ నేతలు పన్నిన ఏ వ్యూహం బెడిసికొట్టింది? తెలుగుదేశం పార్టీకి ఎలాంటి తిప్పలు వచ్చాయి? భవిష్యత్తులో ఆ పార్టీ ఏ పంథాలో ముందుకెళ్లబోతోంది?

నెల్లూరులో వైరాగ్యంలోకి వైసీపీ నేతలు

సింహపురి రాజకీయ పార్టీలపై కరోనా వైరస్‌ ఎలాంటి ప్రభావం చూపింది? కరోనా కాలంలో వైసీపీ నేతలు పన్నిన ఏ వ్యూహం బెడిసికొట్టింది? తెలుగుదేశం పార్టీకి ఎలాంటి తిప్పలు వచ్చాయి? భవిష్యత్తులో ఆ పార్టీ ఏ పంథాలో ముందుకెళ్లబోతోంది? కొవిడ్‌ సందర్భంలో బీజేపీ నేతల ధీమాకి కారణమేంటి? ప్రస్తుత సీజన్‌లో నెల్లూరు జిల్లాలో సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీల పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం.


"కరోనా!'' ఈ పేరు వింటే చాలు- పేద, గొప్ప అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఆ రంగం- ఈ రంగం అన్న భేదం లేకుండా అన్ని రంగాలను అతలాకుతలం చేసింది కరోనా. చివరికి రాజకీయ పార్టీలపైనా తన ప్రతాపం చూపించింది. ఉదాహరణకి ఏపీలో అధికారంలో ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌పార్టీ విషయానికే వద్దాం. కరోనాకి ముందు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీకే అడ్వాంటేజ్‌ ఉంటుంది కనుక వైసీపీ పెద్దలు ఆ ఎన్నికలపై చాలా ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల్లోని వార్డు మెంబర్లు మొదలు జడ్పీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకూ అన్ని పీఠాలు సొంతం చేసుకోవచ్చునని ఆ పార్టీ భావించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే నయానో, భయానో చాలా స్థానాల్లో తమవారికి ఏకగ్రీవాలు కూడా చేసేసుకుంది. ఇలా ఇంకా ఎన్నెన్నో..!


సరిగ్గా అప్పుడే ఇండియాలో కరోనా కోరలు చాచింది. ఈ నేపథ్యంలో నాటి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంతో అధికారంలో ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు షాక్‌ తిన్నారు. ఈ పరిణామంపై ఆగ్రహించిన సీఎం జగన్ ఎన్నికల కమిషనర్‌ని తొలగించడం, ఆ స్థానంలో రిటైర్డ్‌ న్యాయమూర్తి కనగరాజ్‌ని ఎస్‌ఈసీగా నియమించడం, ఈ వ్యవహారం కోర్టుకి చేరడం.. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టడం వంటి వరుస ఘటనలు అందరికీ తెలిసినవే! 


ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే.. కరోనాని కూడా అడ్డంగా వాడేసుకోవాలని లోకల్‌ లీడర్స్‌ భావించారట. లాక్‌డౌన్‌ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి పెద్దఎత్తున చందాలు వసూలుచేశారట. బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు కొని పేదలకి పంపిణీ చేపట్టారట. కేంద్రం అందించిన సాయాన్ని కూడా కొందరు ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగిన నేతలు తమ ఖాతాలో వేసేసుకున్నారట. ఈ నేపథ్యంలో భౌతికదూరం సంగతిని విస్మరించి జనాన్ని పోగేసిన సందర్భాలూ ఉన్నాయట. ఈ కారణంగానే కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన అనుచరులపై కేసు కూడా నమోదైందట. 


సింహపురి వైసీపీ నేతల్లో ఇప్పుడు ఒకటే ఆలోచన. కరోనా కాలంలో పేదలకి ఎంతో చేశాం. ఇందుకు కృతజ్ఞతగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపిస్తారా లేదా అన్నదే వారి సందేహం! ఇప్పట్లో ఎన్నికలు జరిగే సూచనలు మాత్రం కనిపించడం లేదు. దీంతో ఏకగ్రీవాలు అయిన నేతల్లోనూ దుడుకు మొదలైంది. తమ పోస్టులు ఉంటాయా? లేక కొత్త నోటిఫికేషన్‌ ఇస్తారా? అన్న సందిగ్ధం కూడా వారిని వెంటాడుతోంది. దీనికితోడు స్థానిక ఎన్నికల సంబరంపై ఆశతో పలువురు నేతలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీలో చేరారట. ఫలితంగా "మంది ఎక్కువ- పదవులు పలుచన'' అన్నట్టు తయారైందట జిల్లాలో పార్టీ పరిస్థితి! అందువల్ల హతవిథి అనే బదులు "కరోనా విథి'' అనుకుని వైసీపీ నేతలు వైరాగ్యంలోకి జారుకుంటున్నారట! 


తెలుగుదేశం పార్టీకి మే నెల ఎంతో ప్రతిష్టాత్మక సందర్భం. ఆ నెలలోనే మహానాడు జరుగుతుంది. కొత్తగా జిల్లా, మండల, గ్రామ, వార్డు, బూత్ కమిటీలు వేయడం కూడా ఆనవాయితీ. అయితే కరోనా వల్ల మహానాడు సంబరమే జూమ్‌ మీటింగ్‌కి పరిమితమైంది. దీంతో నెల్లూరు జిల్లాలోని టీడీపీ క్యాడర్‌లో సహజంగానే ఉత్సాహం ఆవిరైంది. కొత్త కమిటీల నియామకం జరగకపోవడంతో ఎవరికి వారే నాయకుల్లా బిల్డప్‌ ఇస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన టీడీపీ పెద్దలు ఎక్కువ మందికి రాజకీయ ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నారట. ఇప్పటివరకూ జిల్లా పార్టీ కమిటీలు మాత్రమే ఏర్పాటయ్యాయట. ఇకపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయబోతున్నారట. ఈ తరుణంలో సింహపురి టీడీపీ నేతలంతా ప్రస్తుతం పదవీయోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకుని నిరీక్షిస్తున్నారు. కరోనా వల్ల తెలుగుదేశం అధిష్టానానికి ఎదురైన కొత్త ఛాలెంజ్‌ ఇది!


కరోనా కాలంలోనూ నెల్లూరు జిల్లాలో బీజేపీ కొంత జోష్‌ మీదే ఉందట. దీనికి కారణం జనవరిలోనే ఆ పార్టీ జిల్లాలవారీగా, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించడం. ఈ కారణంగా ఎక్కువ మందికి పదవులు లభించాయి. ఇప్పుడా కమిటీలు యాక్టివ్‌గా ఉన్నాయి. టీడీపీని వ్యతిరేకించి వైసీపీలోకి వెళ్లినవారు... అక్కడ ఇమడలేకపోతే ఇప్పుడు బీజేపీ గూటికే వస్తున్నారు. అలాగే టీడీపీ భవితవ్యంపై సందేహాలున్న నేతలు కూడా కమలం పార్టవైపు చూస్తున్నారట. అందువల్ల కరోనా కాలంలోనూ తమకొచ్చిన లోటు ఏమీలేదని సింహపురి బీజేపీ నేతలు భావిస్తున్నారట!


ఇక నెల్లూరుజిల్లాలో జనసేన, వామపక్షాల నేతలు అంత హ్యాపీగా లేరు. కరోనాకి ముందు వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఒక రేంజ్‌లో గళమెత్తారు. ఆ సమయంలో టీడీపీకి ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఎదుగుతుందని జనసేన క్యాడర్‌ ఆశపడింది. కానీ కరోనా తర్వాత పవన్‌ పెద్దగా చప్పుడు చేయలేదు. దీంతో తమ భవిష్యత్తుపై వారిలో పలు సందేహాలు నెలకొన్నాయి. లాక్‌డౌన్‌కి ముందు ప్రజాపోరాటాల్లో అస్తిత్వం చాటుకున్న వామపక్షాలు ఇప్పుడు స్టేట్‌మెంట్లకే పరిమితం అవుతున్నాయి. ఈ తరుణంలో క్యాడర్‌ని పెంచుకునే అవకాశం కూడా లేదని ఆ పార్టీ పెద్దలు ఒకింత నిరాశ చెందుతున్నారు. ఇది కూడా కరోనా మహిమే అని చెప్పక తప్పదు. ఇలా నెల్లూరు జిల్లాలో అన్ని రాజకీయపక్షాలపై ఏదో ఒక రూపంలో కరోనా తన ప్రభావాన్ని చూపించింది. వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు!

Updated Date - 2020-07-07T13:42:14+05:30 IST