కలల దేశంలో.. కల్లోలం

ABN , First Publish Date - 2020-04-03T06:59:50+05:30 IST

కలల దేశంలో.. కల్లోలం

కలల దేశంలో.. కల్లోలం

కరోనా బీభత్సంతో అమెరికా కుదేలు

సామాజిక సమస్యగా మారిన వైరస్‌

వైద్య సామగ్రి కొరత తీవ్రం


శత్రువు ఎటునుంచి దాడి చేసినా భీకరమైన ఆయుధ సంపత్తితో తిప్పికొట్టగల అమెరికా.. కరోనా వంటి వైరస్‌తో నిలువెల్లా వణుకుతోంది. అమేయ ఆర్థిక వనరులున్న అగ్రరాజ్యం.. ఆపదను ముందుగానే ఊహించక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రపంచానికే పెద్దన్న.. పసికూనలా విలవిల్లాడుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత ఎదిగినా.. అవసరమైన సమయంలో కనీస వైద్య సామగ్రి కూడా లేని దైన్యంలో ఉంది. చాలామంది కలల దేశమైన అమెరికా.. కల్లోలంలో చిక్కుకుంది. మహమ్మారి ఉధృతి నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ప్రవాస భారతీయ సామాజిక, సాంకేతిక, వైద్య రంగ ప్రముఖులు ఏం చెబుతున్నారంటే.. 

- హైదరాబాద్‌ సిటీ, ఆంధ్రజ్యోతి


మన వైద్యులు ముందుండి పోరాడుతున్నారు

తెలుగు రాష్ట్రాల డాక్టర్లకూ అవగాహన కల్పిస్తాం 

ప్రతి ఆరుగురు అమెరికా వైద్యుల్లో ఒకరు భారతీయులే. సుమారు ఎనభై వేలమంది ఉంటారు. ఇందులో తెలుగువారు 15 వేల మంది. కరోనాపై మన వైద్యులు ముందుండి పోరాడుతున్నారు. కొంతమంది భారతీయ వైద్యులకూ కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారికేమీ ప్రాణాపాయం లేదు. చైనా మరణాల్లో 65ఏళ్ల పైవాళ్లే ఎక్కువ. అయితే, ఇక్కడ మాత్రం మృతుల్లో 20 నుంచి 30 శాతం నలభై ఏళ్లలోపు వారు. న్యూయార్క్‌లోని ప్రతి దవాఖానాను కరోనా ఆస్పత్రిగా మార్చారు. రెండు యుద్ధ నౌకలను అత్యవసర వైద్య సేవలకు వినియోగిస్తున్నారు. రెసిడెన్సీ రాని భారతీయ వైద్య విద్యార్థులు అమెరికాలో దాదాపు 4 వేలమంది ఉన్నారు. వారిని అసిస్టెంట్‌ డాక్టర్లుగా గుర్తించి, సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా ట్రంప్‌ను కోరాం. చికిత్స విధానంపైనా పరిశోధనలు, యాంటీ వైరల్‌ ట్రీట్‌మెంట్‌లో భాగంగా కొన్ని మందుల తయారీ యత్నాలు జరుగుతున్నాయి. 3 నుంచి 6 నెలలకొకసారి వైరస్‌ రూపం మార్చుకుంటుంది. దాని జెనెటిక్‌ మ్యుటేషన్‌ ఆకారం ఆధారంగా టీకాను వాడాలి కాబట్టి ఆ దిశగానూ పరిశోధనలూ సాగుతున్నాయి. వైద్యుల కుటుంబాల కోసం మేం విరాళాలు సేకరిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని వైద్యులకు అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మరిన్ని వివరాలకు ‘ఏఏపీఐ యూఎ్‌సఏ డాట్‌ ఓఆర్‌జీ’’ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

- డాక్టర్‌ సురేశ్‌రెడ్డి, అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఇండియా


ఆస్పత్రులు సరిపోవడం లేదు..

మేం ఉండేది ఫిలడెల్ఫియాలో. సమీపంలోని న్యూయార్క్‌ సమస్య తీవ్రత కారణంగా మా దగ్గర అందరిలో ఆందోళన కనిపిస్తోంది. నిత్యావసరాలను అమ్మే కొన్ని దుకాణాలను రెండు, మూడు గంటలు మాత్రమే తెరిచి ఉంచుతున్నారు. అమెరికా ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగ్గానే ఉంటాయి. కానీ, ప్రస్తుత పరిస్థితికి సరిపోవడం లేదు. సభా మందిరాలు, పాఠశాల భవనాలనూ వైద్య సేవలకు వినియోగిస్తున్నారు. 30 రోజుల్లో పరిస్థితిని అదుపులోకి తేవాలనే లక్ష్యంతో బుధవారం ఒక ప్రణాళిక విడుదల చేశారు. 

- ఆచార్య అఫ్సర్‌, ప్రముఖ కవి, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా


గేట్స్‌ రెండేళ్ల క్రితమే ట్రంప్‌ను హెచ్చరించారు

కొత్త రకం ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. మనం ముందే మేల్కోవాలని రెండేళ్ల క్రితమే ట్రంప్‌ను కలిసినప్పుడు బిల్‌గేట్స్‌ సూచించారు. అప్పుడెవరూ పట్టించుకోలేదు. నేను అమెరికాలో స్థిరపడి 53 ఏళ్లు. ప్రస్తుతం జార్జియా రాష్ట్రంలో ఉంటున్నాం. మా ప్రాంతంలో వైరస్‌ తీవ్రత అంతగా లేదు. నా వయసు (82) రీత్యా అత్యవసరమైతే మినహా బయటకు వెళ్లడం లేదు. అమెరికా ఏటా 20 దేశాల నుంచి 125 బిలియన్‌ డాలర్ల ఔషధాలు కొనుగోలు చేస్తుంది. అందులో 13 దేశాలు ఇప్పుడు మందుల ఎగుమతులను ఆపేశాయి. దాంతో కొన్ని రకాల మందులూ దొరకడంలేదు. శానిటైజర్లు, మాస్కులు, టిష్యూ పేపర్ల కొరత విపరీతంగా ఉంది.

- డా.వేలూరి వెంకటేశ్వరరావు, విశ్రాంత సైంటిస్టు, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌


చిన్నకంపెనీల్లోనే తొలగింపు 

నేను వర్జీనియాలో ఉంటాను. ప్రతి రాష్ట్రంలోనూ ‘‘స్టే ఎట్‌ హోమ్‌’’ ప్రకటించారు. కొన్నిచోట్ల నిత్యవసరాలు సరిపడా దొరకడం లేదు. వార్తా పత్రికలు నిరాటంకంగా వస్తున్నాయి. తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు, వీసా పొడిగింపు కోసం ఎదురుచూస్తున్నవారు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. వారం నుంచి న్యూజెర్సీలోని భారతీయ స్టోర్లన్నీ మూసేశారు. పెద్ద కంపెనీలేవీ ఉద్యోగులను తొలగించలేదు. చిన్న కంపెనీలు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం మొదలుపెట్టాయి.

- రవి వీరెల్లి, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ మేనేజర్‌ 


యాంటీబాడీ్‌సతో ప్రయోగం

అమెరికా జనాభాలో పదిలక్షల మందిలో 605 మంది కరోనా బారిపడ్డారు. అదే జపాన్‌లో 17 కేసులు మాత్రమే. అందుకు కారణం సాధారణ రోజుల్లోనూ జపనీయులు మాస్క్‌లు తప్పనిసరిగా వాడతారు. జలుబు వంటివి ఉన్నప్పుడు, మాస్కు కట్టుకోకపోతే అవమానకరంగా చూస్తారు. కరోనా తగ్గిన వ్యక్తి శరీరంలోని యాంటీబాడీ్‌సను.. రోగుల శరీరంలోకి పంపడం వంటి ప్రయోగపూర్వక చికిత్సా పద్ధతులు అమలు చేస్తున్నారు.

- డా. లోకేశ్‌ ఈదర, సీనియర్‌ పల్మనాలజిస్టు

Updated Date - 2020-04-03T06:59:50+05:30 IST