Abn logo
Apr 3 2020 @ 03:29AM

కరోనా హాట్‌ స్పాట్‌గా నిర్మల్‌, భైంసా

నిర్మల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని జోహార్‌నగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందిన వ్యవహారం జిల్లా అంతటా కలకలం రేపింది. జోహార్‌నగర్‌కు చెందిన మృతుడు ఢిల్లీలో జరిగిన జమాత్‌కు హాజరై ఈ నెల 18న నిర్మల్‌కు వచ్చాడు. అయితే మూడు, నాలుగు రోజుల నుంచి ఆయన తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో భాధపడుతుండగా స్థానికులు అనుమానించి అధికారులకు సమాచారం అందిం చారు. దీంతో అధికారులు ఆయనలో కరోనా లక్షణాలు గమనించి మార్చి 30న హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా గాంధీ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మరణించాడు. రాత్రి వరకు ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించకపోయినప్పటికీ ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఈ ఉదంతం నిర్మల్‌ పట్టణంతో పాటు జిల్లా అంతటా కలకలం రేపింది. కాగా గురువారం ఉదయమే జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీతో పాటు పోలీసు అధికారులు మృతుని నివాస ప్రాంతమైన జోహార్‌ నగర్‌కు చేరుకొని ఆ ప్రాంతాన్ని దిగ్బంఽదించారు. ప్రియదర్శినినగర్‌, జోహార్‌ నగర్‌, ఎన్‌టిఆర్‌ మార్గ్‌ తదితర అన్ని ప్రాంతాలను దిగ్బంధించారు. అలాగే మృతుని బంధువులు, ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న 36 మందిని నిర్మల్‌ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని ఐసోలేషన్‌కు తరలించారు. అలాగే మృతునికి చికిత్స చేసిన స్థానిక ఆర్‌యంపీ డాక్టర్‌ను సైతం ఐసోలేషన్‌లో ఉంచారు. జోహార్‌నగర్‌లో 144 సెక్షన్‌ విధించి జనం ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు కట్టడి చేశారు.


అలాగే వరుసగా నాలుగు రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను మూసి వేసి ఆయాప్రాంతాల్లో మినీ మార్కెట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే ఢిల్లీ జమాత్‌కు హాజరైన నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌, దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 50 మందికి పైగా వ్యక్తులను క్వారంటైన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఇలా కరోనా పరిస్థితి క్రమంగా నిర్మల్‌, భైంసా ప్రాంతాల్లో విజృంభిస్తున్న పరిస్థితులను బేరీజు వేసిన ప్రభుత్వం నిర్మల్‌, భైంసా పట్టణాలను కరోనా హాట్‌స్పాట్‌ సెంటర్‌లుగా ప్రకటించింది. ఢిల్లీ జమాత్‌కు హాజరైన వారు స్వచ్ఛందంగా తమ సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. జోహార్‌నగర్‌కు 1000మీటర్ల దూరంలో ఉన్న అన్ని ప్రాంతాలను అలర్ట్‌ చేశారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం గాను 100 ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేశారు. 


జిల్లాలో మొదటి కరోనా మరణం

జిల్లాలో మొట్టమొదటి కరోనా మరణం చోటు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్‌ ముషారప్‌ ఆలీ ఫారూఖీ వెల్లడించారు. జోహార్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్‌ కారణంగా మరణించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన దాదాపు వెయ్యి మందిని అధికారులు గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. వీరందరిని అబ్జర్వేషన్‌ కొనసాగుతుండగానే డిల్లీ జమాతే ఉదాంతం తెరపైకి వచ్చింది. నిర్మల్‌ జిల్లా నుంచి దాదాపు 50 మందికి పైగా డిల్లీ జమాత్‌కు హాజరైన వారందరినీ గుర్తించిన అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అయితే మరికొంతమంది కోసం ఆరా తీస్తున్న అధికారులకు జోహార్‌నగర్‌లో కరోనా లక్షణాలతో భాధపడుతున్న ఓ వ్యక్తి ఉదంతం బయటపడింది. దీంతో ఆయనను హుటాహుటిన అధికారులు గాంధీ ఆసుపత్రికి గత నెల 30వ తేదీన తరలించారు. అయితే సదరువ్యక్తి బుఽధవారం మధ్యాహ్నం ఆసుపత్రిలోనే మృతి చెందారు. మృతునితో ఇప్పటి వరకు ఎంతమంది కాంటాక్ట్‌లో ఉన్నారోననే అంశం అంతటా భయాందోళనలు రేకేత్తిస్తోంది. మృతుడితో కాంటాక్ట్‌ ఉన్న 36 మందిని అధికారులు గురువారం ఐసోలేషన్‌కు తరలించారు. వీరి రక్తం షాంపిల్స్‌ను నిర్ధారణ కోసం హైదరాబాద్‌కు పంపించారు. మృతునితో వీరంతా దగ్గరగా కాంటాక్ట్‌లో ఉన్నందున హైదరాబాద్‌ నుంచి రాబోయే రక్త పరీక్షల ఫలితాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమవుతోంది. 


కరోనా హాట్‌స్పాట్‌ సెంటర్‌లుగా నిర్మల్‌, భైంసా

ఢిల్లీ జమాత్‌కు హాజరై వివరాలు తెలపని వారు మరికొంతమంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండడం వ్యవహారాలు ఇక్కడి కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను వెల్లడిస్తున్నాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం నిర్మల్‌, భైంసా పట్టణాలను కరోనా హాట్‌స్పాట్‌ సెంటర్‌లుగా ప్రకటించింది. అలాగే కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టబోతోంది.


నాలుగు రోజుల పాటు లాక్‌డౌన్‌ .. మళ్ళీ ఇంటింటా సర్వే..

జిల్లాలో శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ప్రకటించారు. కరోనామృతుని ప్రాంతమైన జోహార్‌నగర్‌లో పూర్తి స్థాయి 144 సెక్షన్‌ విధించారు. అలాగే ఈ జోహార్‌నగర్‌కు చుట్టూరా ఉన్న వెయ్యి మీటర్ల దూరంలో గల అన్ని వార్డుల్లో ఇంటింటా సర్వే చేపట్టబోతున్నారు. దాదాపు 80వేల మందిని సర్వే చేయనున్నారు. ఈ సర్వే కోసం 100 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృం దంలో ఓ ఎఎన్‌యం, ఓ ఆశా కార్యకర్త, ఓ హెల్త్‌ ఇన్స్‌స్పెక్టర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, పోలీసు అధికారులు సభ్యులుగా ఉంటారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇంటింటా సర్వే కొనసాగనుంది. 


ప్రభావిత ప్రాంతంలో కలెక్టర్‌ పర్యటన, స్వయంగా మైకులో ప్రచారం..

కాగా కరోనా మరణం జరిగిన ప్రాంతమైన జోహార్‌ నగర్‌లో జిల్లా కలెక్టర్‌ ముషారప్‌ ఆలీ ఫారూఖీ , రెవెన్యూ , వైద్య , పోలీసు శాఖ అధికారులతో కలిసి గురువారం ఉదయం పర్యటించారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మరణించిన నేపథ్యంలో కలెక్టర్‌ మృతుని కుటుంబ సభ్యులనే కాకుండా ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే జోహార్‌ నగర్‌ను సోడియం హైపోక్లోరైడ్‌తో స్ర్పె చేయించారు. 

Advertisement
Advertisement