కరోనాను జయించిన వ్యక్తి.. డిశ్చార్జ్ అవుతూ కిటికీ అద్దంపై.. !

ABN , First Publish Date - 2020-04-05T00:48:50+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు కొన్ని వేల మంది కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. బాధితులకు డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తున్నారు

కరోనాను జయించిన వ్యక్తి.. డిశ్చార్జ్ అవుతూ కిటికీ అద్దంపై.. !

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు కొన్ని వేల మంది కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. బాధితులకు డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ల శ్రమ ఫలించి చాలా మంది కరోనాను జయిస్తున్నారు. చిరునవ్వుతో ఇంటికి చేరుకుంటున్నారు. బాధితులు కరోనాను జయించడంలో కేవలం డాక్టర్లు ఇచ్చే మందులు మాత్రమే ముఖ్య భూమిక పోషించడం లేదు. డాక్టర్ల మాటలు, వారిచ్చే మనోధైర్యం కూడా బాధితులకు కరోనాను జయించే శక్తిని ఇస్తున్నాయి. అమెరికాలోని ఒహియోలోని ఘటనే ఇందుకు సాక్ష్యం. 


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఒహియోకు చెందిన 38ఏళ్ల నిక్ బ్రాన్ కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. కుటుంబ సభ్యులు అతడ్ని స్థానికంగా ఉన్న హాస్పిటల్‌ చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో   డాక్టర్లు అతడ్ని ఐసీయూలో పెట్టి చికిత్స ప్రారంభించారు. రోజురోజుకీ అతని పరిస్థతి మరీ దారుణంగా మారుతుండటంతో.. చికిత్స కొనసాగిస్తూనే, బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని డాక్టర్లు అతని భార్యకు చెప్పారు. ఆరోగ్య పరిస్థతి క్షీణిస్తుండటంతో నిక్ బ్రాన్ కూడా మనోవేదనకు గురయ్యాడు.



ఈ నేపథ్యంలో డాక్టర్లు ఓ అద్భుతమైన పని చేశారు. చికిత్స చేస్తూనే.. ‘మేము నిన్ను ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తాము’ అంటూ అతను ఉన్న గదిలోని కిటికీ అద్దానికి కొటేషన్లు రాశారు. డాక్టర్లు రాసిన కొటేషన్లు.. అతనిలో మనోధైర్యాన్ని నింపాయి. దానికి వైద్యుల చికిత్స కూడా తోడవటంతో.. అతను కరోనాను జయించాడు. కాగా.. అతను డిశ్చార్జ్ అవుతూ.. అదే కిటికీ అద్దంపై రాసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అందులో అతను డాక్టర్లను రాక్‌స్టార్‌లుగా అభివర్ణించాడు. ‘మీ శ్రమ ఫలించడం వల్లే నేను చిరునవ్వుతో ఇంటికి వెళ్తున్నాను. మీకు సేవ చేసే అవకాశం నాకు రాకపోవచ్చు. మీకు దేవుడి అశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి’ అని నిక్ బ్రాన్ పేర్కొన్నాడు. కాగా.. నిక్ బ్రాన్ వ్యాఖ్యలపట్ల అతనికి చికిత్స అందించిన డాక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-04-05T00:48:50+05:30 IST