చేతులెలా కడుక్కోవాలి?

ABN , First Publish Date - 2020-03-20T05:54:00+05:30 IST

కరోనా వైరస్‌ హడలెత్తిస్తోంది. ఈ దశలో ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎక్కువ సార్లు చేతులు శుభ్రం చేసుకోవడం అవసరం. అయితే...

చేతులెలా కడుక్కోవాలి?

కరోనా వైరస్‌ హడలెత్తిస్తోంది. ఈ దశలో ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎక్కువ సార్లు చేతులు శుభ్రం చేసుకోవడం అవసరం. అయితే చాలామందికి చేతులు శుభ్రం చేసుకొనే విధానంపై అవగాహన ఉండదు. ఇంతకీ చేతులెలా కడుక్కోవాలి? నిపుణులు ఏమంటున్నారంటే...


కొన్ని వేల బ్యాక్టీరియాలు, వైరస్‌లు చేతుల్లో దాగుంటాయి. షేక్‌హ్యాండ్‌ ద్వారా ఇవి ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంటాయి. ‘కరోనా’ వైరస్‌ ఇందుకు పెద్ద ఉదాహరణ. దగ్గడం, తుమ్మడం వల్ల కూడా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది.


సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడానికి 20 సెకన్లకు మించి సమయం పట్టదు. ఇంత తక్కువ సమయంలోనే చేతులను పక్కాగా శుభ్రం చేసుకోవచ్చని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌కు చెందిన వైద్యులు అంటున్నారు. అయితే చాలామంది 5 సెకన్లకు మించి చేతులు కడగడం లేదట!


రెస్ట్‌రూమ్‌ను ఉపయోగించిన తరువాత 5 శాతం మంది 15 సెకన్ల కన్నా ఎక్కువ సమయాన్ని చేతులు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. 10 శాతం మంది చేతులు శుభ్రం చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదట!


చేతులు శుభ్రం చేసుకునే సమయంలో పైపైన కాకుండా చేతి వేళ్ల మధ్య కూడా శుభ్రం చేసుకోవాలని, అప్పుడే వైరస్‌ పూర్తిగా తొలగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.


కొందరు వేడి నీళ్లతో శుభ్రం చేసుకుంటే అన్ని క్రిములు చనిపోతాయని అనుకుంటున్నారు. కానీ వేడి నీళ్లు క్రిములపై ప్రభావం చూపించవని అంటున్నారు నిపుణులు.


చేతులు శుభ్రం చేసుకోగానే సరిపోదు. పొడి తువ్వాలుతో తుడుచుకోవాలి. చేతులు తడిగా ఉంటే వైరస్‌ మళ్లీ వ్యాపించే అవకాశం ఉంటుంది. చేతులు ఆరబెట్టుకోవడానికి బ్లోయర్స్‌ను ఉపయోగిస్తే మరీ మంచిది.


చేతులు శుభ్రం చేసుకున్న తరువాత కుళాయిని ఆపు చేయడానికి నేరుగా చేతులను కాకుండా, టిష్యూ పేపర్‌ను ఉపయోగించాలి.


చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం మేలు. ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్స్‌ను కూడా ఉపయోగించవచ్చు. 60 శాతం ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్లు కరోనా వైరస్‌ను నిర్మూలిస్తాయని నిపుణులు చెబుతున్నారు.


ఇలా చేయండి!


ముందుగా చేతులను నీళ్లతో కడగండి. తరువాత శానిటైజర్‌, లేదా సబ్బు తీసుకోండి.


అరచేతిపై మరో అరచేతితో రుద్దండి.


చేతిని తిరగేసి వేళ్లపై, మణికట్టుపై రాయండి.


రెండు చేతి వేళ్లనూ ముడివేసినట్టుగా చేసి, వేళ్లతో చేతి మధ్య రుద్దండి.


ఒక చేతి వేళ్ల మధ్య మరో చేతి వేళ్లతో రుద్దండి.

Updated Date - 2020-03-20T05:54:00+05:30 IST