పిల్లి నుంచి మనిషికి కరోనా? కొట్టిపారేయలేమంటున్న శాస్త్రవేత్తలు !

ABN , First Publish Date - 2020-04-03T14:06:31+05:30 IST

కరోనా.. పిల్లుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందా? అంటే చెప్పలేం అంటున్నారు పరిశోధకులు.

పిల్లి నుంచి మనిషికి కరోనా? కొట్టిపారేయలేమంటున్న శాస్త్రవేత్తలు !

న్యూఢిల్లీ: కరోనా.. పిల్లుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందా? అంటే చెప్పలేం అంటున్నారు పరిశోధకులు. ఇటీవల బెల్జియంలో ఓ పిల్లికి దాని యజమాని నుంచి కరోనా సంక్రమించిన నేపథ్యంలో.. శాస్తవేత్తలు ఈ దిశగా పరిశోధనలు చేపట్టారు. ఇందులో భాగంగా పిల్లుల్లో ఒకదాని నుంచి మరొకదానికి ఈ వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఓ మూడు పిల్లులకు కరోనా వైర్‌సను ఇంజెక్ట్‌ చేసి, వాటితో ఆరోగ్యవంతమైన మరో రెండు పిల్లులను కలిపి ఒకే బోనులో ఉంచారు. బయటకు తీసుకొచ్చాక పరీక్షించగా.. ఓ పిల్లిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే.. కుక్కలు, పందులు, కోళ్లు లాంటి వాటికి ఈ వైరస్‌ సోకే అవకాశాలు లేవని అంటున్నారు. కాగా.. పిల్లుల నుంచి మనుషులకు సోకదు అని నిర్ధారణకు వచ్చే వరకు  జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. 


చైనాలో పిల్లి, కుక్క మాంసంపై నిషేధం

కరోనా విధ్వంసంతో చైనా.. పాఠం నేర్చుకున్నట్లే కనిపిస్తోంది. అక్కడి షెన్‌జేన్‌ నగరం.. పిల్లి, కుక్క మాంసం వినియోగంపై పూర్తిగా నిషేధం విధించింది. ప్రస్తుతానికిది ఒక్క నగరానికే పరిమితమైనా.. మిగిలిన నగరాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి. అన్ని జంతువుల కన్నా కుక్కలు, పిల్లులు మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉంటాయని, వీటిని తినడం మానవత్వం కాదనే ఉద్దేశంతోనే నిషేధం విధించామని వారు చెబుతున్నప్పటికీ.. కరోనాయే దీనికి కారణమన్నది బహిరంగ రహస్యం. 

Updated Date - 2020-04-03T14:06:31+05:30 IST