రద్దయితే నష్టం రూ.10వేల కోట్లు?

ABN , First Publish Date - 2020-03-15T10:17:52+05:30 IST

కరోనా ప్రభావంతో క్రికెట్‌ కార్యకలాపాలు ఆగిపోవడమే కాదు.. ఐపీఎల్‌తో ముడివడిన సంస్థల ఆర్థిక మూలాలకు కూడా గట్టిగానే దెబ్బ తగలనుంది.

రద్దయితే నష్టం రూ.10వేల కోట్లు?

ఐపీఎల్‌ అంటేనే కాసుల వర్షం కురిపించే క్రికెట్‌ పండగ.. ఆదాయంలో ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ లీగ్‌లతోనే పోటీ పడుతుంది. ఇప్పుడు కొవిడ్‌-19 పంజాకు ఈ లీగ్‌ విలవిల్లాడుతోంది. ప్రస్తుతానికి వాయిదా వేసినా.. ఆ తర్వాత కూడా టోర్నీ జరగపోతే పరిస్థితి ఏమిటనే ఆందోళన నిర్వాహకులను వెంటాడుతోంది. అదే జరిగితే ఐపీఎల్‌ స్టేక్‌హోల్డర్లు, ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు తదితరులకు నష్టం వేల కోట్లలో ఉండబోతోంది.


కోల్‌కతా: కరోనా ప్రభావంతో క్రికెట్‌ కార్యకలాపాలు ఆగిపోవడమే కాదు.. ఐపీఎల్‌తో ముడివడిన సంస్థల ఆర్థిక మూలాలకు కూడా గట్టిగానే దెబ్బ తగలనుంది. అందుకే ఖాళీ స్టేడియాల్లోనైనా మ్యాచ్‌లు జరగాలని జట్ల యజమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఉన్నపళంగా లీగ్‌ రద్దయితే స్పాన్సర్‌షిప్స్‌, మీడియా రైట్స్‌, ఫ్రాంచైజీల ఆదాయం, ఆటగాళ్ల ఫీజుల రూపంలో ఐపీఎల్‌ నష్టం రూ.10వేల కోట్లుగా ఉంటుందని అంచనా. అందుకే విదేశీ ఆటగాళ్లు రాకపోయినా కూడా లీగ్‌ జరిగితేనే గౌరవంగా ఉంటుందని ఓ ఫ్రాంచైజీ అధికారి అభిప్రాయపడ్డాడు. ‘లీగ్‌ను నిర్వహించలేకపోతే ప్రతీ జట్టు కూడా బీసీసీఐ, బ్రాడ్‌కాస్టర్‌, స్పాన్సర్ల నుంచి వచ్చే రూ. వంద కోట్లకు పైగా రాబడిని కోల్పోతుంది’ అని బీసీసీఐ అధికారి వివరించాడు. 


జరగడం అనుమానమే

ఐపీఎల్‌ను కుదించడంపై ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ సమావేశం ఎలాగున్నా.. ఏప్రిల్‌లో జరగడం కూడా సందేహమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పట్లో సాధారణ పరిస్థితి నెలకొనడం అసాధ్యంగా కనిపిస్తోంది. ‘ఐపీఎల్‌ జరిపేందుకు ఏప్రిల్‌ 21 నుంచి మే 31 వరకు ఆరు వారాల విండో ఉంటుంది. ఒకవేళ అంతా మెరుగై ఏప్రిల్‌ 20న ఆరంభించాలనుకున్నా.. ఆ నిర్ణయం 10 లోపే తీసుకోవాలి. ఎక్కువ డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తే ఆరు వారాల సమయం సరిపోతుంది. కానీ ఏప్రిల్‌ తొలి వారంలో కరోనా ప్రభావం తీవ్రతపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. లేకపోతే వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టే’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 


పదేపదే శానిటైజ్‌ చేసుకున్నాం 

సమావేశంలో అన్ని జట్ల యజమానులను కలవడం సంతోషంగా ఉంది. ఇప్పుడు లీగ్‌ను జరపడం కన్నా అందరి భద్రత ముఖ్యమని మేం అభిప్రాయపడ్డాం. కేంద్రం సూచించిన మార్గదర్శకాలు అంతా పాటించాల్సిందే. మేమైతే పదేపదే శానిటైజ్‌ చేసుకున్నాం. 

-కోల్‌కతా జట్టు సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ 



బీసీసీఐకి  రూ.2000 కోట్లు

ఐపీఎల్‌ రద్దయితే బీసీసీఐ రూ. 2 వేల కోట్ల రెవెన్యూను కోల్పోతుంది. ప్రసారకర్త స్టార్‌ స్పోర్ట్స్‌ నుంచి ప్రతీ ఏడాది బోర్డు రూ.3 వేల కోట్లు పొందుతుంది. దీన్ని ఫ్రాంచైజీలతో 50:50గా పంచుకుంటుంది. టైటిల్‌ స్పాన్సరర్‌ వీవో నుంచి ఏడాదికి రూ.500 కోట్లు అందుతుంది. ఇక ఆయా ఫ్రాంచైజీలు తమకున్న స్పాన్సరర్ల సంఖ్యను బట్టి 35 నుంచి 75 కోట్ల రూపాయల మేర నష్టపోతాయి. స్టేడియం గేట్‌ మనీ నష్టం ఆయా జట్లకు 20 నుంచి 45 కోట్ల వరకు ఉంటుంది.


బ్రాడ్‌కాస్టర్‌కు పెద్ద దెబ్బే..

లీగ్‌ రద్దు ప్రభావం ముఖ్యంగా ప్రసారకర్త స్టార్‌ గ్రూప్‌పై అధికంగా పడుతుంది. భారత క్రికెట్‌ మ్యాచ్‌లు, ఐపీఎల్‌ కోసం ఐదేళ్ల కాలానికి ఈ సంస్థ ఏకంగా రూ.16 వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా ఏటా 20శాతం రాబడిని ఆశిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో సిరీస్‌ రద్దయింది. ఇక లీగ్‌ కూడా అదే బాటన పడితే స్టార్‌  గ్రూప్‌ రూ. 3200 కోట్లను నష్టపోవాల్సిందే.


హోటళ్ల రాబడిపైనా..

ఐపీఎల్‌పై స్టార్‌ హోటళ్లు, విమానయానంతో పాటు ఇతర సిబ్బంది కూడా ఆధారపడి ఉన్నారు. అన్ని జట్లు తమ ఆటగాళ్ల రవాణా, వసతి కోసం రూ.5 కోట్లు ఖర్చు చేస్తుంది. అలాగే అన్ని జట్లు కలిపి కనీసం 600 మందిని వివిధ పనుల కోసం నియమించుకుంటాయి. దీనికి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తాయి. ఇప్పుడు వారి ఆదాయం కూడా ప్రమాదంలో పడినట్టే.

Updated Date - 2020-03-15T10:17:52+05:30 IST