కరోనా మహమ్మారిపై డ్రోన్‌ల యుద్ధం

ABN , First Publish Date - 2020-04-03T07:13:13+05:30 IST

కరీంనగర్‌లోని ముకరంపూర్‌ ప్రాంతం. కరోనాకు రెడ్‌ జోన్‌. ఇండొనేషియా నుంచి వచ్చిన పది మందికి.. ఒక స్థానికుడు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం. అక్కడ ఎలాంటి వైరస్‌ లేకుండా చేయటానికి అధికారులు...

కరోనా మహమ్మారిపై డ్రోన్‌ల యుద్ధం

రసాయనాలు స్ర్పే చేయవచ్చు

నిఘా కెమెరాల్ని ప్రయోగించవచ్చు

స్పీకర్ల ద్వారా హెచ్చరికలు చేయవచ్చు

శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు

ముందుగా కరీంనగర్‌లో వినియోగం

త్వరలో అన్ని జిల్లాల్లో..

మారుత్‌ డ్రోన్‌టెక్‌ వినూత్న ప్రయోగం


కరీంనగర్‌లోని ముకరంపూర్‌ ప్రాంతం. కరోనాకు రెడ్‌ జోన్‌. ఇండొనేషియా నుంచి వచ్చిన పది మందికి.. ఒక స్థానికుడు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం. అక్కడ ఎలాంటి వైరస్‌ లేకుండా చేయటానికి అధికారులు అత్యాధునిక డ్రోన్‌లను ఉపయోగించారు. వాటి ద్వారా ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేశారు. ఇప్పటి దాకా చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఉపయోగిస్తున్న డ్రోన్‌ టెక్నాలజీని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉపయోగించటం మొదలుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన మారుత్‌ డ్రోన్‌టెక్‌ అనే కంపెనీ ఈ డ్రోన్‌లను ప్రభుత్వాలకు అందిస్తోంది. గత ఏడాది ప్రపంచంలో మార్పు తీసుకురాగల 30 ఏళ్ల లోపు ఆవిష్కర్తలలో ఒకరిగా ఎంపికైన ప్రేమ్‌ కుమార్‌ విశ్వనాథ్‌ ఈ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు. కరోనా వైర్‌సను ఎదుర్కోవటంలో తాము చేస్తున్న ప్రయోగాలను ‘ఆంధ్రజ్యోతి’కి ఆయన వివరించారు. 


‘‘కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. దీని వల్ల రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిలో కరోనా బాధితులు నివసించిన ప్రాంతాలను డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయటం ఒకటి. చాలా ప్రాంతాల్లో మాస్కులు, బాడీ సూట్స్‌ వేసుకొని కెమికల్స్‌ను స్ర్పే చేస్తున్నారు. అయితే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ఈ వైరస్‌.. స్ర్పే చేస్తున్నవారికి కూడా వ్యాపించే అవకాశముంది. ప్రపంచంలో అనేక దేశాల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఈ వైరస్‌ సోకుతోంది కూడా. దీనిని నివారించాలంటే- డ్రోన్‌ల ద్వారా శుద్ధి చేయటం ఓ మార్గం. చైనా, దక్షిణ కొరియాల్లో ఈ పద్ధతిని విజయవంతంగా అమలుచేస్తున్నారు. మన దగ్గర కూడా కరీంనగర్‌, వరంగల్‌లలో దీనిని విజయవంతంగా చేపట్టాం. కరీంనగర్‌లో అయితే జిల్లా కలెక్టరేట్‌, మునిసిపల్‌ కార్పొరేషన్‌, జిల్లా ఆస్పత్రి, బస్టాండ్‌ మొదలైన ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగించాం. సాధారణంగా ఒక వ్యక్తి చేసే పనికి 50 రెట్ల పనిని ఈ డ్రోన్‌లు చేయగలుగుతాయి. ఉదాహరణకు 20 కిలోమీటర్ల ప్రాంతంలో ఒక రోజులో స్ర్పే చేసేందుకు వీలుంటుంది. 


అన్నీ ఒకటి కావు..

డ్రోన్‌లన్నీ ఒకే రకంగా ఉండవు. రకరకాల అవసరాలకు తగినట్లుగా వీటిని తయారుచేస్తారు. ప్రస్తుతం మేము నాలుగు రకాల డ్రోన్‌లను తయారుచేస్తున్నాం. వీటిలో 17 డ్రోన్‌లను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో.. తిరుచ్చిలలో ఉపయోగిస్తున్నాం. అవసరమైతే వీటి సంఖ్యను ఇంకా పెంచగలం. మా వద్ద ఉన్న డ్రోన్‌ ద్వారా రసాయనాలను స్ర్పే చేయవచ్చు. నిఘా కెమెరాలను, స్పీకర్లను పెట్టి ప్రయోగించవచ్చు. గుంపులుగా ప్రజలు ఉండే దగ్గర వారి శరీర ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. అత్యవసరమైన సామగ్రిని 12 కిలోమీటర్ల వరకూ తీసుకువెళ్లవచ్చు. వీటిలో రసాయనాలను స్ర్పే చేసే డ్రోన్‌లను అనేక జిల్లాల్లో వాడుతున్నాం. నిఘా కెమెరాలను పెట్టి.. ఎక్కువ జన సమూహం ఉన్న ప్రాంతాల్లో స్పీకర్ల ద్వారా హెచ్చరికలను జారీ చేసే డ్రోన్లను ఇటీవలే కరీంనగర్‌లో పరీక్షించాం. ఇక అత్యవసర సామగ్రిని చేరవేసే డ్రోన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను 8 నిమిషాల్లో చేరుకుంటాయి. వాస్తవానికి మనుషుల కన్నా ఇవి వేగంగా సామగ్రిని చేరవేయగలుగుతాయి. ఈ డ్రోన్‌లు ఎక్కడెక్కడ అవసరమో తెలియజేయమని తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. వారి దగ్గర నుంచి వివరాలు అందిన తర్వాత డ్రోన్‌లను ఆయా ప్రాంతాలకు పంపుతాము.’’


ఒకో డ్రోన్‌ 25 కిలోలు ఉంటుంది. రసాయనాలు స్ర్పే చేసే డ్రోన్‌లో 10 కిలోల ట్యాంకు ఉంటుంది. ఈ డ్రోన్‌ను నియంత్రించటానికి  పైలెట్‌, కోపైలెట్‌లు ఉంటారు. 


శరీర ఉష్ణోగ్రతలను కనిపెట్టే డ్రోన్‌లో థర్మల్‌ స్కానర్స్‌ ఉంటాయి. ఇవి ఒక కిలోమీటరు దూరంలో విస్తరించి ఉన్న సమూహాలలోని ప్రజల శరీర ఉష్ణోగ్రతలను చెబుతాయి. ప్రస్తుతం స్పెయిన్‌లో వీటిని ఉపయోగిస్తున్నారు. వైరస్‌ బాగా వ్యాపిస్తే ప్రయోగించటానికి ఇవి కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. 


10 కిలోల బరువున్న మందులు, ఇతర అత్యవసర సామగ్రిని ఈ డ్రోన్‌లు వేగంగా చేరవేయగలుగుతాయి.


- స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-04-03T07:13:13+05:30 IST