మహాయుద్ధంలో మానవుడే విజేత

ABN , First Publish Date - 2020-04-04T05:56:28+05:30 IST

సమకాలీన ప్రపంచంలో ‘శక్తిమంతులయిన’ నాయకులకు కొదవేమీ లేదు. అయితే వారిలో ఏ ఒక్కరూ కరోనా వైరస్ వ్యాప్తిని ఎందుకు అరికట్ట లేకపోతున్నారు? కరోనా మహమ్మారిపై మానవాళి అంతిమంగా విజయం సాధిస్తుందా? మానవాళి జయించి...

మహాయుద్ధంలో మానవుడే విజేత

సమకాలీన ప్రపంచంలో ‘శక్తిమంతులయిన’ నాయకులకు కొదవేమీ లేదు. అయితే వారిలో ఏ ఒక్కరూ కరోనా వైరస్ వ్యాప్తిని ఎందుకు అరికట్ట లేకపోతున్నారు? కరోనా మహమ్మారిపై మానవాళి అంతిమంగా విజయం సాధిస్తుందా? మానవాళి జయించి తీరుతుంది. నియంతలు, క్రూర పాలకుల నుంచేగాక అలా రాజ్యాధికారాలను చెలాయించాలని ఆరాటపడుతున్న వారినుంచి కూడా మానవాళి తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంరక్షించుకుంటుంది. ఇది తథ్యం.


రోనా వైరస్ లేదా కొవిడ్ -19 ప్రతాపానికి 205 దేశాలు అల్లకల్లోలమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల డించింది. సృష్టిలోని అతి సూక్ష్మ జీవి వైరస్. జీవి జీవ కణాల్లో మాత్రమే అది తనను తాను పునరుత్పత్తి చేసుకొంటుంది. బాక్టీరీయాతోసహా సృష్టిలోని ప్రతిజీవిని వైరస్‌లు సోకుతాయి


కొత్త కరోనా వైరస్‌ కారణంగా ప్రబలిన ఒక మహా అంటువ్యాధికి కొవిడ్ -19 అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నామకరణం చేసింది. ఈ ‘కొత్త’ వైరస్ జాడను తొలుత గుర్తించింది లీ వెన్లియాంగ్ అనే ఒక చైనీస్ డాక్టర్. గత డిసెంబర్‌లో ఆయన ప్రప్రథమంగా కరోనా వైరస్ గురించి ప్రపంచానికి వెల్లడించాడు. అయితే చైనా ప్రభుత్వం ఆయన్ని నానా వేధింపులకు గురిచేసింది! దురదృష్టవశాత్తు డాక్టర్ లీ సైతం కొవిడ్ -19 బారిన పడ్డాడు. 2020 ఫిబ్రవరి 7న మరణించాడు. అప్పుడు ఆయన వయస్సు 33 సంవత్సరాలు (డాక్టర్ లీ మరణానంతరం ఆయన పట్ల తాము వ్యవహరించిన తీరుకు చైనా అధికారులు క్షమాపణలు చెప్పారు). ఈ కీర్తిశేషుడు గుర్తించిన కొత్త వైరస్ 100 రోజులలోగానే భయంకర దావానలంలా ధరిత్రి నలుమూలలకీ వ్యాపించింది. ఏ దేశ సరిహద్దులనూ ఎంత శక్తిమంతమైన సైన్య మూ కొవిడ్ -19ని నిలువరించలేదు. జాతీయ సరిహద్దులను ఈ సూక్ష్మ క్రిమి గుర్తించదు గాక గుర్తించదు. కుల మతాలు, జాతి, జెండర్, పుట్టిన ప్రదేశం, సామాజిక వర్గం ప్రాతిపదికన ఏ స్త్రీ, పురుషుడి పట్ల అది ఎలాంటి వివక్ష చూపదు. భారత రాజ్యాంగంలోని 14, 15 అధికరణలను కరోనా వైరస్ పరిపూర్ణంగా గౌరవిస్తుంది, కాకపోతే ఒక అహేతుక రీతిలో!


ఈ భూమిపై అత్యంత శక్తిమంతమైన వ్యక్తి (అని ఎంతో మంది అంటున్న) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం తన ప్రజలను కరోనా మహమ్మారి బారిన పడకుండా రక్షించడంలో నిస్సహాయుడైపోయారు. ఏప్రిల్ 3న ఈ వ్యాసం రాస్తున్న సమయానికి అమెరికాలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 2,13,600కి మించిపోయింది. కరోనా వైరస్ కారణంగా అమెరికాలో సంభవించే మరణాలసంఖ్య హీనపక్షం 1,00,000 నుంచి 2,40,000 మధ్య వుండగలదని అంచనా. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం సైతం కరోనాను ఏమీ చేయలేకపోతోంది. అమెరికా కూడబెట్టుకున్న అపార సిరిసంపదలు కొవిడ్ -19 నెదుర్కొనే విషయంలో నిష్ప్రయోజనమైపోతున్నాయి. డాలర్ విలువ పెరిగింది. అయితే ‘బలహీన’ యూరో లేదా యువాన్ వలే ‘బలమైన’ డాలర్ కూడా కరోనా ముందు శక్తిహీనమైపోయింది.


ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రభుత్వాధినేతలు (ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికైనవారు, ప్రజాస్వామ్యేతర మార్గాలలో అధికారాన్ని కైవశం చేసుకున్నవారు) ప్రజల సమ్మతితో పాలించాలని కాకుండా, అధికారాన్ని చెలాయించేందుకు ఆరాటపడుతున్నారు. ‘ప్రతి ఒక్కరిపైన, ప్రతి దానిపైన అధికారాన్ని చెలాయించేంతవరకు ఒక రాజు సంతృప్తి చెందడని’ సమకాలీన పాశ్చాత్య విజ్ఞుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇది నిండు సత్యం. దురదృష్టవశాత్తు సమకాలీన ప్రభుత్వాధినేతల విషయంలో కూడా ఇదొక పరిపూర్ణ సత్యం. రబ్బర్ స్టాంప్ పార్లమెంటులు, ఆశ్రిత న్యాయ స్థానాలు, సానుకూలంగా వ్యవహరించే ప్రభుత్వ సంస్థలు, మాట జవదాటని అధికార గణం, గూఢచారులు, రాజకీయ ప్రత్యర్థులను ఎటువంటి ఆరోపణలు లేకుండానే నెలలు, సంవత్సరాలు తరబడి జైళ్ళలో నిర్బంధించడం మొదలైనవన్నీ బోలు చర్యలే. 


యావత్ప్రంచమూ ఒక బందీఖానాగా మారిపోవడమూ, తాము ఒకే కారాగారంలోవున్నట్టు పీడకులు, పీడితులూ తెలు సుకోవడం విచిత్రంగా లేదూ? పీడకులైన పాలకులకు మీరీ విషయాన్ని గుర్తు చేయండి. మీరు లాక్‌డౌన్‌లో వున్నారు గనుక మీరు ఆడగల ఒక ఆటను సూచిస్తాను. ప్రపంచ భౌగోళిక పటంనొకదాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులలో ఎవరినైనా ఒకో దేశాన్ని గుర్తించమని అడగండి. వారిని ఒక ప్రశ్న అడగండి: నీవు గుర్తించిన దేశం ఎటువంటి అభియోగాలు మోప కుండా ప్రజలను జైళ్ళలో నిర్బంధించిందా? ఇవిగో మీకు లభించే సమాధానాలు. దక్షిణ అమెరికా ఖండంతో ప్రారంభమవుతాం. 


వెనిజువెలా: దేశాధ్యక్షుడు నికోలస్ మదురోకు విధేయంగా వ్యవహరించే ఈ దేశ న్యాయవ్యవస్థ 30మంది ప్రతిపక్ష నాయ కులకు పార్లమెంటరీ సభ్యత్వ హక్కులను రద్దు చేసింది. మరి కొంతమంది ప్రవాసానికి వెళ్ళిపోయారు లేదా జైలులో మగ్గిపోతున్నారు. 

ఆఫ్రికాలో పరిస్థితులు మరింత ఘోరంగా వున్నాయి.


ఇథియోపియా: 2018లో అబియి అహ్మద్ ప్రధానమంత్రి అయ్యాడు. పొరుగుదేశం ఎరిట్రియాతో సుస్థిర శాంతిని నెలకొల్పాడు. నోబెల్ శాంతి పురస్కారాన్ని పొందాడు. 2019లో ఇంటర్నెట్‌పై సంపూర్ణంగా ఆంక్షలు విధించాడు. చట్ట విరుద్ధంగా 64మంది హత్యకు గురయ్యారని, కనీసం 1400మంది ఎటువంటి అభియోగాలు లేకుండా జైలుపాలయ్యారని ఒక ఎన్‌జిఓ వెల్లడించింది. 


టాంజనియా: ప్రతిపక్ష ఎంపీలు, ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులను దేశాధ్యక్షుడు జాన్ మగుఫలి ఆదేశాలపై అరెస్ట్ చేశారు. వివిధ మీడియా సంస్థలను మూసివేయించారు. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేవారిని అణచివేసేందుకు జాన్‌ మగుఫలి చట్టాలను తీసుకు వచ్చాడు.

ఐరోపాలో మిశ్రమ పరిస్థితులు కన్పిస్తాయి. ఆ ఖండంలో దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు వర్ధిల్లుతున్నాయి. అయితే అక్కడ ఇటువంటి దేశాలు కూడా వున్నాయి:

 

హంగరీ: కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థల అధికారాలన్నిటినీ ప్రధానమంత్రి విక్టర్ అర్బాన్ తన చేతుల్లో కేంద్రీ కరించుకున్నాడు. ఆయన ప్రభుత్వం సెంట్రల్ యూరోపియన్ యూనివర్శిటీని మూసివేసింది. ఇంటర్నెట్‌పై పన్ను విధించింది. తలుచుకున్న విధంగా డిక్రీల జారీ ద్వారా పాలించే అధికారాలను సైతం నాలుగురోజుల క్రితం విక్టర్ సాధించుకున్నాడు. 


రష్యా: తాను మళ్ళీ దేశాధ్యక్షుడుగా ఎన్నికయ్యేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సవరణకు ఆమోదం పొందడంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజయవంతమయ్యారు. దీనిపై మాస్కోలో వేలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపగా పోలీసులు రెండువేలమందికి పైగా నిరసనకారులను నిర్బంధంలోకి తీసుకున్నారు. పలువురిపై క్రిమినల్ కేసులు మోపారు. రాజకీయ ప్రత్యర్థుల అరెస్ట్, పోలీస్‌ అధికారుల హింసాకాండ, బాలల నిర్బంధం, తల్లిదండులకు బెదిరింపులు రష్యాలో నేడు నిత్యకృత్యాలైపోయాయి. రష్యాలో 200మందికి పైగా రాజకీయ ఖైదీలువున్నారు. ఆసియా ఖండంలో కొన్ని దేశాలను ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పే పరిస్థితి లేదు. 


థాయిలాండ్: ప్రధానమంత్రి ప్రయుత్ చాన్ ఓ చా ప్రభుత్వం 2019లో అధికారానికి వచ్చింది. దరిమిలా రాజకీయ కార్యకర్తలపై భౌతికదాడులు ముమ్మరమయ్యాయి. మానవ హక్కుల కార్యకర్తలు అదృశ్యమవ్వడం ప్రారంభమయింది. పౌర హక్కుల అణచివేత తీవ్రమయింది. 


కంబోడియా: 2018 పార్లమెంటరీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరగలేదు. ప్రధాన ప్రతిపక్షాన్ని నిషేధించారు. పలు వురు ప్రతిపక్ష నాయకులను జైళ్ళకు పంపించారు లేదా నిర్బంధ ప్రవాసానికి పంపించారు. మీడియా, పౌర సమాజ సంస్థలపై ఆంక్షలు విధించారు. అన్ని స్థానాలలోనూ పాలకపక్షమే విజయం సాధించింది. 


ఈ పరిస్థితులు మీకు నిరాశానిస్పృహలను కలిగిస్తున్నాయి కదూ? అయినా మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. సమకాలీన ప్రపంచంలో ‘శక్తిమంతులైన’ నాయకులకు కొదవేమీ లేదు. అయితేవారిలో ఏ ఒక్కరూ కరోనా వైరస్ వ్యాప్తిని ఎందుకు అరికట్ట లేకపోతున్నారు? కరోనా మహమ్మారిపై మానవాళి అంతిమంగా విజయం సాధిస్తుందా? ఇటువంటి సందేహానికి తావులేదని, మానవాళి ఈ సంక్షోభాన్ని సంపూర్ణంగా అధిగమిస్తుందని ప్రముఖ తమిళకవి వైరముత్తు విశ్వసిస్తున్నారు. కరోనా వైరస్ పై ఆయన ఒక అందమైన కవిత రాశారు. దాని స్వేచ్ఛానువాదమిది: ‘అణువు కంటే చిన్నది/ అణు బాంబు కంటే భయంకరమైనది/ నిశ్శబ్దంగా ప్రవేశిస్తుంది/ యుద్ధం లేకుండా సమస్తాన్ని వినాశనం చేస్తుంది.... మానవుడు కరోనా వైరస్‌ను నిర్మూలిస్తాడు/ ఆ మహమ్మారిని జయిస్తాడు’. అవును, కరోనా వైరస్‌పై యుద్ధంలో మానవాళి జయించితీరుతుంది. నియంతలు, క్రూర పాలకుల నుంచేగాక అలా రాజ్యాధికారాలను చెలాయిం చాలని ఆరాటపడుతున్న వారినుంచి కూడా మానవాళి తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంరక్షించుకుంటుంది. ఇది తథ్యం.





పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-04-04T05:56:28+05:30 IST