కరోనా ఎఫెక్ట్: ప్రపంచ బ్యాంకు సంచలన నివేదిక

ABN , First Publish Date - 2020-03-31T21:35:35+05:30 IST

కరోనా కల్లోలం కారణంగా తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో 1.1 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లే అవకాశం

కరోనా ఎఫెక్ట్: ప్రపంచ బ్యాంకు సంచలన నివేదిక

వాషింగ్టన్: కరోనా కల్లోలం కారణంగా తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో 1.1 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. కరోనా వైరస్ సృష్టించిన విలయానికి చైనాలో అభివృద్ధి నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నట్టు పేర్కొంది. ‘‘కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీనికారణంగా అభివృద్ధి నిలిచిపోవడంతో పాటు ఈ ప్రాంతంలో పేదరికం భారీగా పెరుగుతుంది...’’ అని ప్రపంచ బ్యాంకు తూర్పు ఆసియా, పసిఫిక్ వ్యవహారాల చీఫ్ ఆదిత్య మట్టూ పేర్కొన్నారు. 2019లో 6.1 శాతంగా ఉన్న చైనా వృద్ధి రేటు 2.3 శాతం మేర క్షీణించడం వల్ల ప్రాంతీయ వృద్ధిరేటు భారీగా పతనమవుతుందని వెల్లడించారు.


కాగా రెండు నెలల క్రితమే చైనా ఈ సంవత్సరంలో 5.9 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 1990 తర్వాత చైనాలో ఇంత తక్కువ వృద్ధి రేటు నమోదు కావడం ఇదే తొలిసారి అని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. కోవిడ్-19 కారణంగా ఇప్పటికే సగానికి పైగా ప్రపంచ దేశాల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడంతో.. అనేక వ్యాపారాలు నష్టాల బాట పట్టాయి. దీనికి తోడు ఎక్కడికక్కడ రవాణా కూడా స్తంభించిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 7.8 లక్షల మంది కోవిడ్-19 మహమ్మారి బారిన పడగా.. 37 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-03-31T21:35:35+05:30 IST