కంచె వేసి... కాపలా కాసి...

ABN , First Publish Date - 2020-04-01T05:49:58+05:30 IST

ఊరిలోకి కరోనా రాకుండా యువ మహిళా సర్పంచ్‌ ఉడుతల అఖిల యాదవ్‌ నడుంబిగించారు. గ్రామ సరిహద్ధుల్లో కంచె వేసి తానే స్వయంగా కాపలా కాస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా...

కంచె వేసి... కాపలా కాసి...

ఊరిలోకి కరోనా రాకుండా యువ మహిళా సర్పంచ్‌ ఉడుతల అఖిల యాదవ్‌ నడుంబిగించారు. గ్రామ సరిహద్ధుల్లో కంచె వేసి తానే స్వయంగా కాపలా కాస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన వాటన్నింటినీ తు.చ తప్పకుండా ఆచరణలో పెడుతూ ఆదర్శంగా నిలిచారు. గ్రామాల్లోకి కరోనా అడుగుపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆమె మాటల్లోనే...


‘మనలో ఎవరికైనా కరోనా వైరస్‌ సోకుతుందనే జ్ఞానం నిరక్షరాస్యులు అధికంగా ఉండే పల్లె ప్రజలకు తెలియదు. మాది నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో 807 మంది జనాభా ఉన్న చిన్నపాటి గ్రామం  మదనాపురం. హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ హైవేకి కూతవేటు దూరంలో ఉంటుంది. ఒకవైపు కరోనా విస్తరిస్తున్న తరుణంలో ఏవేవో కారణాలతో ఇతర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో మా ఊరికి వస్తుండటం గమనించా. వారిని మా గ్రామంలోకి రాకుండా ఆపాలంటే ముళ్లకంచె వేయడమే మార్గమని భావించాను. అందుకే గ్రామంలో యువతను సమీకరించి కంచె వేసి మొదటి మూడు గంటలు నేనే స్వయంగా గస్తీ కాశా. ఆ తర్వాత షిఫ్టుల వారీగా మా గ్రామస్థులు, బయటివారు మా గ్రామంలోకి రాకుండా గట్టి నిఘా పెట్టారు. ఆ విధంగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రధాన మార్గాన్ని ఊరి బయటే మూసివేశాం. ఆ తర్వాత ‘కరోనా ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు మనం వైద్యులను సంప్రదించాలి’ అనే అంశాలను ఇంటింటికి తిరిగి వివరించాను. ముఖానికి మాస్క్‌లు కట్టుకోవడం, మనిషికి మనిషికి మధ్య మూడడుగుల దూరం పాటించడం, కిరాణ దుకాణంలో సైతం ఒకరి తర్వాత ఒకరు ప్రవేశించాలని నిబంధనలను పెట్టుకొని ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. గ్రామంలో పారిశుద్ధ్యం చేపట్టి ఊరంతా బ్లీచింగ్‌ పౌడర్‌, ద్రావకాలను చల్లించాను. అయితే ఊరిలోకి ఎవర్నీ రానీయకుండా కంచె వేసే విషయంలో బయటి నుంచి కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి. అర్థరాత్రి అంబులెన్స్‌ వంటివి రావాల్సి వస్తే ఎలా, ఆపద వచ్చిన గ్రామస్థులు రాత్రివేళ బయటకి వెళ్లాలంటే ఇబ్బందే కదా వంటి అంశాలు నా దృష్టికి వచ్చాయి. వీటికి పరిష్కారంగా మొదటి నుంచే రాత్రివేళ సైతం ముళ్లకంచ వద్ద గస్తీ పెట్టాం. అత్యవసరంతో ఎవరు వచ్చినా, వెళ్లినా మేమే కంచె తొలగించి సహకరిస్తున్నాం. పగటి వేళ ఎవరైనా మా గ్రామానికి రావాలనుకుంటే వారిని పూర్తిగా విచారించి సరైన కారణమే అని భావిస్తే అనుమతిస్తున్నాం. ప్రధాన రహదారిని కంచెతో మూసివేసినా మరో పిల్ల రహదారిని ఎప్పటికి తెరిచే ఉంచాం. ఈ బాట మా గ్రామస్థులకే తెలుసు. మరో ఊరికి వెళ్లాలన్నా, పెద్ద మొత్తంలో కిరాణా సరుకు తెచ్చుకోవాలన్నా ఆ దారి గుండా వెళ్తున్నారు. దీంతో ఇబ్బందులు లేకుండా పోయాయి.




అవగాహన దిశగా అడుగులు...

కరోనా నేపథ్యంలో పల్లె జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. ఊళ్లో అంతా వ్యవసాయదారులు కావడంతో పొద్దున లేస్తే ఎవరి పొలాల్లోకి వారు వెళ్లిపోతున్నారు. అక్కడ సామాజిక దూరం సహజంగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. అయితే రోజు వారి కూలీలకు ఇబ్బంది వచ్చింది. వారిని పనిలో పెట్టుకునేందుకు రైతులు ఇష్టపడటం లేదు. మరోవైపు వ్యవసాయ సీజన్‌ ముగియడంతో కూలీలకు డిమాండ్‌ లేకుండా పోయింది. అయితే వారి నిత్యవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం నగదు సాయం, బియ్యం అందిస్తున్నాయి. అవికూడా సరిపోని వారిని గుర్తించి ఆదుకునేందుకు కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఆ మేరకు వారికి హామీ ఇచ్చాను. పనిలేని వారు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మొదట అవగాహన లేకపోయినా క్రమంగా అందరిలో ఆరోగ్యస్పృహ పెరిగింది. టీవీల్లో, పేపర్లల్లో వచ్చిన దానికంటే ప్రజాప్రతినిథులు గడపగడపకు తిరిగి అవగాహన కల్పిస్తే ఫలితం బాగుంటుందనేది నా భావన. ఆ దిశగానే అడుగులు వేస్తున్నా. 


మారబోయిన మధుసూదన్‌, నల్లగొండ

ఫొటోలు: పీఠం వెంకటేష్‌

Updated Date - 2020-04-01T05:49:58+05:30 IST