లాక్‌డౌన్‌లో సడలింపులు.. సౌదీ, యూఏఈలో పెరుగుతున్న కేసులు

ABN , First Publish Date - 2020-07-06T05:25:04+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో గల్ఫ్ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి.

లాక్‌డౌన్‌లో సడలింపులు.. సౌదీ, యూఏఈలో పెరుగుతున్న కేసులు

దుబాయి: కరోనా లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో గల్ఫ్ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. సౌదీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య రెండు లక్షలు దాటగా.. యూఏఈలో 50 వేలు దాటింది. మార్చి నెలలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించిన ఈ దేశాలు గత నెలలో లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేశాయి. దీంతో కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనపడుతోంది. గల్ఫ్ దేశాలన్నిటిలో అత్యధిక కేసులు సౌదీ అరేబియాలోనే నమోదయ్యాయి. శుక్ర, శనివారాల్లో ఈ దేశంలో నాలుగు వేలకు పైగా కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. మరోపక్క సౌదీలో ఇప్పటివరకు కరోనా కారణంగా 1,858 మంది మరణించారు. ఇక యూఏఈలో గత కొద్ది రోజుల నుంచి 300 నుంచి 400 కేసులు నమోదవుతూ రాగా.. శుక్రవారం 600కు పైగా.. శనివారం 700కు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో యూఏఈలో కేసుల సంఖ్య 50,857కు చేరింది. యూఏఈలో ఇప్పటివరకు కరోనా కారణంగా 321 మంది మరణించారు. ఈ రెండు దేశాలతో పాటు ఖతర్, ఒమన్‌లో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఖతర్‌లో మొత్తం కేసుల సంఖ్య దాదాపు లక్షకు చేరుకుంది. మరోపక్క గత ఆరు వారాల నుంచి ఒమన్‌లో కేసుల్లో పెరుగుదల కనిపించినట్టు అక్కడి ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

Updated Date - 2020-07-06T05:25:04+05:30 IST