ఈ 29 రాష్ట్రాల్లో భారీగా పెరిగిపోతున్న కేసులు

ABN , First Publish Date - 2020-06-26T03:19:17+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే.

ఈ 29 రాష్ట్రాల్లో భారీగా పెరిగిపోతున్న కేసులు

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటివరకు 24,62,958 కరోనా కేసులు నమోదు కాగా.. కరోనా కారణంగా 1,24,294 మంది మృత్యువాతపడ్డారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో అయితే అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలే కరోనాకు కేంద్రంగా మారిపోయాయి. న్యూయార్క్‌‌లో మృతదేహాలను పూడ్చడానికి కూడా స్థలాలు సరిపోలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఇప్పుడు అమెరికాలో పరిస్థితి మొత్తంగా మారిపోయింది. మార్చి, ఏప్రిల్‌లో ఏ రాష్ట్రాల్లో అయితే తక్కువ కేసులు నమోదయ్యాయో.. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. న్యూయార్క్, న్యూజెర్సీలలో ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పడితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం కారణంగానే కేసులు భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికాలోని 29 రాష్ట్రాల్లో గత వారం నమోదైన కేసులతో పోల్చితే ఈ వారం నమోదైన కేసులు భారీగా ఉన్నట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే అమెరికాలో 34,700 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలాఖరు నుంచి ఇప్పటివరకు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 


కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 29 రాష్ట్రాలు ఇవే:

  • అలబామా
  • అలాస్కా
  • అరిజోనా
  • అర్కన్సాస్
  • కాలిఫోర్నియా
  • కొలరాడో
  • డెలవేర్
  • ఫ్లోరిడా
  • జార్జియా
  • హవాయ్
  • ఇదాహో
  • కాన్సాస్
  • లూజియానా
  • మిస్సిసిప్పి
  • మిస్సౌరి
  • మోంటానా
  • నెవాడా
  • నార్త్ కెరొలినా
  • ఓక్లహామా
  • ఒహాయో
  • ఆరెగాన్
  • సౌత్ కెరోలినా
  • టెన్నస్సీ
  • టెక్సాస్
  • ఊతా
  • వాషింగ్టన్
  • వెస్ట్ వర్జీనియా
  • విస్కాన్సిన్
  • వ్యోమింగ్


ఈ 29 రాష్ట్రాల్లో ముఖ్యంగా కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడాలో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోపక్క కనీసం 13 రాష్ట్రాల్లో గత వారం నమోదైన కేసుల కంటే ఈ వారం నమోదైన కేసులు 50 శాతం ఎక్కువగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా ఒక్క కనెక్టికట్ రాష్ట్రంలోనే కేసుల్లో 50 శాతం తగ్గుముఖం కనపడుతోంది.

Updated Date - 2020-06-26T03:19:17+05:30 IST