పేల పీడ వదిలించే మందుతో కరోనా ఖతం! అదీ 48 గంటల్లో..

ABN , First Publish Date - 2020-04-06T21:52:22+05:30 IST

పేల మందుతో కరోనా పనిపట్టే అవకాశం ఉందంటున్న శాస్త్రవేత్తలు

పేల పీడ వదిలించే మందుతో కరోనా ఖతం! అదీ 48 గంటల్లో..

కాన్‌బెర్రా: కరోనా వైరస్‌ను ఖతం చేసే ఆయుధాల కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు వ్యాక్సిన్ రూపకల్పనపై పనిచేస్తుంటే మరికొందరు వేగవంతమైన కరోనా నిర్థారణ పరీక్షల అభివృద్ధిలో తలమునకలై ఉన్నారు. దీర్ఘకాలిక రక్షణ నిచ్చే వ్యాక్సిన్‌తో పాటూ తక్షణం కరోనాకు చెక్ పెట్టే మందులు సిద్ధం చేసేందుకు కూడా శాస్త్రప్రపంచం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మన ముందుకు వచ్చిందే హైడ్రాక్సీ క్లోరోక్విన్. అయితే తాజాగా మరో మందు కూడా తెరపైకి వచ్చింది. దీని పేరు ఇవర్‌మెక్టిన్.


1970ల్లో కనిపెట్టిన ఈ మందుకు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఉంది. ఇదో క్రిమిసంహారక ఔషధం. తల్లోని పేల సమస్య వదిలించటానికి, స్కేబీస్ లాంటీ చర్మ సమస్యలకు ఇది వాడతారు. అయితే ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్శిటీ జరిపిన పరిశోధనలో ఇవర్‌మెక్టిన్ కరోనా వైరస్ పనిపట్టగలదని తేలింది. ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన కణాల సమూహంపై ఈ ఔషధాన్ని ప్రయోగించగా కేవలం 48 గంటల్లో ఆ కాణాల్లోని కరోనా వైరస్ మటుమాయమైందని పరిశోధకులు తెలిపారు. కేవలం ఒక్క డోసుతో ఇది సాధ్యమైందని వారన్నారు. అయితే ఇది ఇన్‌విట్రోలో(లాబొరేటరీలో) జరిగిన పరిశోధన కావడంతో.. క్లీనికల్ ట్రైల్స్ కూడా జరగాతే గానీ కచ్చితమైన అంచనాకు రాలేమని పరిశోధకులు చెబుతున్నారు. 

Updated Date - 2020-04-06T21:52:22+05:30 IST