Abn logo
May 10 2021 @ 23:33PM

కరోనాపై యోగాస్త్రం!

బాధితులకు యోగసాధన ఎంతో ఉపయుక్తం

ధ్యానంతో రోగనిరోధక శక్తి పెంపు

కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో నిర్వహణ.. ఇప్పుడేదీ!?


ఆత్మకూరు(నెల్లూరు): మంచి ఆరోగ్యానికి, ప్రశాంతతకు, ఆత్మవిశ్వాసానికి మన పూర్వీకుల నుంచి సక్రమించినవే యోగా, ధ్యానం. శరీరం, శ్వాస, మనసు, భావోద్వేగం, శక్తి కలిపితేనే యోగా. శరీరంతో ప్రారంభమయ్యే యోగా ప్రక్రియల ద్వారా శరీరాన్ని పటిష్టంగా చేసి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ప్రస్తుతం కరోనా మహ్మమరి విజృంభిస్తున్న సమయంలో వైరస్‌ ప్రభావం ఊపిరితిత్తుల మీద తీవ్రంగా పడుతోంది. ఆక్సిజన్‌ సరిగ్గా అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో శ్వాస వ్యవస్థను చక్కగా పనిచేసేలా తీర్చిదిద్దుకోవడం అవసరం. దీనికి సులువైన మార్గాలు యోగసాధనాలు, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం. 


ఆసనాలు.. ప్రాణయామం.. ధ్యానం.. వీటన్నింటిని కలిపితేనే యోగ. ఓ గంట సమయం కేటాయిస్తే అరగంట ఆసనాలకు, పదినిమిషాలు ప్రాణయామం, 20 నిమిషాలు ధ్యానానికి కేటాయిస్తేనే యోగా తాలూకు పరిపూర్ణమైన ఫలాన్ని పొందగలం.


ఎప్పుడు చేయాలి?

ఎప్పుడైనా.. ఏ సమయంలోనైనా చేసే ముందు అరగంట ముందు వెనుక ఏ ఆహారం, ద్రవపదార్థం తీసుకోకుండా యోగా చేయడం ఉత్తమం. కానీ ఉదయం బ్రహ్మ మూహూర్తాన చాలా మంచిది. ఉదయం 5.30 నుంచి 6.30  గంటల వరకు యోగా చేయడం శ్రేయస్కరం. ఒకవేళ ఆ సమయం కుదరకపోతే సాయంత్రం 5.30 నుంచి 6.30   గంటల వరకు చేయవచ్చు. ప్రాచీన యోగ ప్రక్రియలు శరీరానికి, మనసుకు, మనలోని శక్తికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని పేరు పొందాయి. 


ఇప్పటి పరిస్థితుల్లో..

ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వైరస్‌ ప్రభావం ఊపిరితిత్తుల మీద తీవ్రంగా పడుతుంది. ఆక్సిజన్‌ సరిగ్గా అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకెందరో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోక ముందే శ్వాస వ్యవస్థను చక్కగా పనిచేసేలా తీర్చిదిద్దుకోవడం అవసరం. ఇందుకు అష్టాంగయోగాలలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానము ఎంతో ముఖ్యమైనవి. 


ఆసనాలు :  ఆసనాల వల్ల శక్తి విడుదలై నాడీ వ్యవస్థ, హర్మోన్‌ వ్యవస్థ పటిష్టమవుతుంది. శ్వాసకోశ వ్యవస్థను చక్కగా పనిచేసేలా తీర్చిదిద్దుకోడానికి ప్రాణాయామంతో పాటు సింహగర్జన ఆసనం (సింహక్రియ) ఎంతో ఉపయోగపడుతాయని యోగా గురువులు చెబుతున్నారు.

ప్రాణయామం : శ్వాసను బంధించడం, క్రమబద్ధీకరించడమే ప్రాణాయామం. అలా శ్వాసను నియంత్రించడం ద్వారా చెడు వాయువు బయటకు వెళ్లి ప్రాణవాయువు చేరుతుంది. ప్రాణయామమువల్ల రక్తం శుభ్రపడి నరానికి బలం చేకూరుతుంది. 


సింహ క్రియ ఇలా...

గత ఏడాది నుంచి ఎంతో మంది సింహక్రియను సాధన చేసి గొప్ప ఫలితాలు పొందుతున్నారు. ఈ శక్తివంతమైన సింహక్రియను ఇలా చేయాలి. నోరు పూర్తిగా తెరవాలి. నాలుకను పూర్తిగా బయటకు చాపాలి. వీలైనంత శక్తితో ఊపిరి గట్టిగా తీసుకుని నెమ్మదిగా బయటకు వదలాలి. అదేక్రమంలో ఊపిరి లోపలికి తీసుకోవడం, బయటకు వదలడం.. ఇలా 21 సార్లు చేయాలి. ఇది పూర్తయ్యాక నాలుకను పైకి మడచి వీలైనంత వరకు వెనక్కి లాగండి. ఈ ప్రక్రియలో మన చేతులను ఉపయోగించకుండా వీలైనంత వరకు పూర్తిగా నాలుకను మడవాలి. నోరు తెరిచే ఉంచాలి. ఊపిరిని అదేవిధంగా తీసుకుంటూ ఉండాలి. వీలైనంత శక్తితో ఊపిరి తీసుకుని బయటకు వదలాలి. గొంతులో నుంచి ఊపిరి తీసుకుంటున్నట్లు, బయటకు వదులుతున్నట్లు శబ్దం చేస్తూ నిమిషంపాటు చేయాలి.  ఆరు నుంచి  70 ఏళ్ల మధ్య వయసున్న వారందరూ ఈ అభ్యాసం చేయవచ్చు.


ప్రాణయామం, సింహక్రియ సాధన చేస్తే వారి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ముఖ్యంగా కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారు చేయడం ద్వారా వైరస్‌ ప్రభావాన్ని గణనీయంగా  తగ్గించుకోవచ్చు. కరోనా వచ్చి కోలుకున్న వారు సైతం ఈ సాధనలు చేస్తే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ టీకాలు తీసుకున్న వారు కూడా ఈ ప్రక్రియలను ఆచరించవచ్చు.  


ధ్యానంతో రోగనిరోధక శక్తిపెంపు   

రోగనిరోధక శక్తిని పెంచడంలో సులువైన సాధనం ధ్యానమనే చెప్పాలి. ధ్యానం చేయడం ద్వారా వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే వ్యాధినిరోధక శక్తి పెరిగి ఏ వ్యాధులు దరిచేరవని ధ్యాన సాధకులు చెబుతుండటం గమనార్హం. ధ్యానం మనసుకు విశ్రాంతినిచ్చే ఒక ప్రక్రియ. కండరాల ఉద్రిక్తతను, స్వయంగా పనిచేసే నాడీ మండల వ్యవస్థను ఉపశమింపజేయడానికి ధ్యానం సహాయపడి, మానసిక ఒత్తిడి నుంచి స్వేచ్ఛను కలుగజేస్తుంది.  


గతేడాది ఇలా..

గతేడాది జిల్లాలోని కొన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో కరోనా బాధితులకు యోగా తరగతులు నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఆ దిశగా అధికారులు దృష్టి కేంద్రీకరించిన దాఖలాలు లేవు. గత ఏడాది ఆత్మకూరు పట్టణ సమీపంలో టిడ్కో భవనాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ కరోనా బాధితులకు ఆహ్లాదం కలిగించి, ఉల్లాసంగా అనారోగ్యం నుంచి బయట పడేలా ప్రతిరోజు ఉదయాన్నే యోగా, ధ్యానం చేయించే వారు. కరోనా మహమ్మారి బలికొంటుందేమోననే భయం వీడే విధంగా రాత్రిపూట స్ర్కీన్‌ ఏర్పాటు చేయించి సినిమాలు వేసేవారు. అలాంటిది ఈ ఏడాది  అలాంటి వాతావరణం కనిపించకపోవడం గమనార్హం. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉండే కరోనా బాధితులకు వైద్యంతో పాటు యోగా, ధ్యానం కూడా అవసరమని గుర్తించి తదనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది.


ధ్యానంతో మహోన్నత జీవనం

కరోనా మహమ్మరి కట్టడిలో ధ్యానం ఒక భాగంగా ప్రజలు అలవర్చుకోవాలి. ధ్యానంతో రోగాలు దరిచేరవు. ఆనందకరమైన మహోన్నత జీవనం సాధ్యపడుతుంది. ధ్యాన సాధకులు సాత్విక ఆహారంతో ఆరోగ్యంగా మహోన్నత జీవనం గడుపుతారు.  ధ్యానం చేసే వారు ఆత్మవిజ్ఞానపుస్తకాలను చదవడం, ధ్యానంలో కలిగే అనుభవాలను సహచరులతో పంచుకోవడం, వీలైనంత వరకు మౌనాన్ని పాటించడం, శాఖాహారాన్ని భుజించడం, తదితర 18 అంశాలను అలవర్చుకోవాలి. 

-  డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, సీనియర్‌ పిరమిడ్‌ మాస్టర్‌, ఆత్మకూరు

Advertisement
Advertisement
Advertisement