గోవా సూపర్‌మ్యాన్‌!

ABN , First Publish Date - 2020-07-06T05:30:00+05:30 IST

కరోనా పోరులో వైద్యులు ముందు వరుసలో ఉంటున్నారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కరోనా రోగులకు వైద్యం అందిస్తూ అందరి చేత మన్ననలు అందుకుంటున్నారు...

గోవా సూపర్‌మ్యాన్‌!

కరోనా పోరులో వైద్యులు ముందు వరుసలో ఉంటున్నారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కరోనా రోగులకు వైద్యం అందిస్తూ అందరి చేత మన్ననలు అందుకుంటున్నారు. ఇంకొందరు వైద్యులు ఇంటికి సైతం వెళ్లకుండా 24 గంటలు విధుల్లోనే గడుపుతున్నారు. ఆ కోవకు చెందిన వారే గోవాకు చెందిన డాక్టర్‌ ఎడ్విన్‌ గోమ్స్‌. గోవాలోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో కొవిడ్‌ రోగులకు చికిత్స చేస్తూ 98 రోజుల పాటు ఆసుపత్రిలోనే గడిపారు డాక్టర్‌ ఎడ్విన్‌. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఈఎస్‌ఐ అసుపత్రి నోడల్‌ డాక్టర్‌గా ఎడ్విన్‌ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఇంటి ముఖం చూడలేదు. మూడు నెలల తరువాత ఆయన విధుల నుంచి బ్రేక్‌ తీసుకున్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆయనకు కుటుంబసభ్యులు, అపార్టుమెంటు వాసులు పూలతో స్వాగతం పలికారు. ‘కరోనా వారియర్‌కు వెలకమ్‌’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బాల్కనీల్లో నిలుచుని చప్పట్లతో ‘గోవా సూపర్‌మ్యాన్‌’ అంటూ స్వాగతం పలికారు. మీ సేవలు వెలకట్టలేనివి, గోవాను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ పూలు అందించి కృతజ్ఞతలు తెలిపారు.


రోగుల్లో ధైర్యం నింపి...

మూడు నెలల్లో సుమారు 300కు పైగా కొవిడ్‌ రోగులకు షిప్టుల వారిగా పనిచేస్తూ డాక్టర్‌ ఎడ్విన్‌ చికిత్స అందించారు. మూడు నెలల తరువాత ఇంట్లో అడుగుపెడుతున్నారు... ఇంటికి వెళ్లగానే ఏం చేస్తారు? అని డాక్టర్‌ ఎడ్విన్‌ను ప్రశ్నిస్తే ‘‘పిల్లలతో కలిసి మ్యూజిక్‌ ప్లే చేస్తాను. ఇష్టమైన భోజనం చేస్తాను. ఆసుపత్రిలో ఎలా ఉందో కొలీగ్స్‌కు ఫోన్‌ చేసి తెలుసుకుంటాను. నా భార్యకు ప్రేమపూర్వక కౌగిలి ఇస్తాను’’ అని చెప్పుకొచ్చారు. 98 రోజుల పాటు నిరంతరాయంగా వైద్యసేవలు అందిస్తూ ఉండటం ఎలా సాధ్యమయింది అని అడిగితే సమిష్టి కృషి అంటారు ఎడ్విన్‌. ‘‘నా టీం మెంబర్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ల సహాయసహకారాల వల్లే ఇన్ని రోజులు పనిచేయగలిగాను.  రోజులో ఐదు గంటలు మాత్రమే పడుకునే వాళ్లం. కొవిడ్‌ రోగులనే చేర్చుకోవడం రాత్రిపూటే ఎక్కువగా జరిగేది. ఆసుపత్రిలో చేరిన వారికి మందులతో కాకుండా, మానవత్వంతో చికిత్స అందించాం. కొవిడ్‌ బారినపడ్డ వారు కోలుకోవడానికి మానసిక  తోడ్పాటు అందించాం’’ అని తన అనుభవాలను పంచుకున్నారు ఎడ్విన్‌. డాక్టర్‌ ఎడ్విన్‌కు ఇద్దరు కూతుళ్లు. మూడు నెలల తరువాత ఇంటికి చేరుకున్న తండ్రిని చూడగానే కూతుళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. 


Updated Date - 2020-07-06T05:30:00+05:30 IST