కరోనా బాధితుల పట్ల.. కొందరి ప్రవర్తన ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2020-08-07T17:18:36+05:30 IST

‘మద్దిలపాలేనికి చెందిన మెరైన్‌ ఇంజనీర్‌ ఒకరు నెల క్రితం విదేశాల..

కరోనా బాధితుల పట్ల.. కొందరి ప్రవర్తన ఎలా ఉందంటే..

సామాజిక శిక్ష!

కరోనా బాధితులపట్ల కొందరి అమానవీయ ప్రవర్తన

బాధిత కుటుంబ సభ్యులను వెలివేసేలా చర్యలు

కనిపిస్తే మొహం చాటేయడం.... దూరంగా జరగడం

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక కూడా అదే తీరు

వైరస్‌కన్నా.... ఇరుగుపొరుగు వారి ప్రవర్తనే కుందీస్తున్నదని ఆవేదన

మనోవ్యధతో ఇల్లు ఖాళీ చేస్తున్న వైనం

ప్రజాచైతన్యంతోనే పరిష్కారం అంటున్న వైద్యులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ‘మద్దిలపాలేనికి చెందిన మెరైన్‌ ఇంజనీర్‌  ఒకరు నెల క్రితం విదేశాల నుంచి వచ్చారు. కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఇంట్లో చిన్నపిల్లలు  ఉండడంతో రిస్క్‌గా భావించి ఆస్పత్రి ఐసోలేషన్‌లో చేరారు. అపార్ట్‌మెంట్‌లోని ఇతర నివాసితులు ఆ కుటుంబాన్ని వెలివేసినటట్టు చూసేవారు. ఎవరైనా కనిపిస్తే ముఖం చాటేయడం, దూరంగా జరగడం చేసేవారు. అతను డిశ్చార్జి అయ్యాక కూడా అదే పరిస్థితి ఉండడంతో అవమానంగా భావించిన ఆ కుటుంబం ఫ్లాట్‌ ఖాళీచేసి ద్వారకానగర్‌లో  ఉన్న మరో ఇంటికి వెళ్లిపోయింది’


శివాజీపాలేనికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కుటుంబం పరిస్థితి కూడా దాదాపు ఇంతే.... అతనికి పాజిటివ్‌ రాగా, ఇరుగుపొరుగు వారంతా ఆ కుటుంబ సభ్యులందరినీ వెలేసినట్టుగా చూస్తున్నారు. వారు కనిపిస్తేనే తలుపులు వేసుకుంటున్నారు. దీంతో వారు ఇంట్లోనే జైలు జీవితంలా గడుపుతున్నారు.


కరోనా బాధితులకు ఎదురవుతున్న సామాజిక వివక్షకు ఇవి ఉదాహరణలు మాత్రమే. ‘పోరాడాల్సింది వ్యాధితోగాని, రోగితో కాదు‘ అని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా ప్రయోజనం అంతంతే. మానసిక ఆందోళనతో వున్న కరోనా బాధితులకు తామున్నామంటూ సహకారం అందించి, మనోధైర్యాన్ని నింపాల్సిన వారే.... దూరంగా జరగడం, వెలివేస్తుండడం అత్యంత శోచనీయం. జిల్లాలో కొద్ది రోజుల నుంచి నిత్యం సగటున వెయ్యి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే... ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో చాలా మంది కొవిడ్‌ పరీక్షలు చేయించుకుంటున్నారు. పాజిటివ్‌ అని రిపోర్ట్‌ వస్తే చాలు... ఆ కుటుంబ సభ్యులకు అగ్నిపరీక్ష మొదలైనట్టే. బాధితులను అంబులెన్స్‌లో కొవిడ్‌ ఆస్పత్రికి తరలించడాన్ని ఇగురుపొరుగు వారితోపాటు ఆ వీధిలోని వారంతా ఏదో వింతలా చూస్తున్నారు. ఆ తరువాత మిగిలిన కుటుంబ సభ్యులను దాదాపు వెలివేసినంత పనిచేస్తున్నారు. మంచినీటి కోసం కుళాయి వద్దకు వెళితే... అక్కడున్నవారంతా వెళ్లిపోతున్నారు.


కొన్నిచోట్ల అయితే ‘‘కుళాయి వద్దకు మీరు రాకండి. మీ గుమ్మం బయట బిందె పెడితే మేమే నీరు తెచ్చి దానిలో పోస్తాం’’అని చెబుతూ అంటరానివారిగా చూస్తున్నారు. కుటుంబ సభ్యులు వైరస్‌బారిన పడ్డారన్న బాధకంటే, చుట్టుపక్కల వారి చూపులు, వ్యవహరిస్తున్న తీరు, చూపుతున్న వివక్ష... ఎక్కువ బాధిస్తున్నాయని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. వైరస్‌బారిన పడినవారు చికిత్స పొంది, కోలుకుని ఇంటికి చేరిన తరువాత కూడా ఇరుగుపొరుగు వారిలో మార్పురావడంలేదు. దీంతో చాలామంది ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. కొంతమంది బాధితులు నివాసాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.


 ‘‘ఎవరు, ఎప్పుడు కరోనా వైరస్‌బారిన పడతారో తెలియదు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఎవరికైనా వైరస్‌ సోకవచ్చు. ఈ విషయం తెలిసినప్పటికీ.... వైరస్‌బారిన పడినవారు చేయకూడని తప్పు ఏదో చేశారన్నట్టు ఇరుగుపొరుగు వారు వ్యవహరించడం తగదు’’ అని ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రిలో పల్మనాలజీలో పీజీ చేస్తున్న ఓ విద్యార్థి హితవు చెబుతున్నారు.


విస్తృత అవగాహన కల్పించాలి

కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులను తాకితేనే వైరస్‌ వ్యాప్తి చెందుతుందని, భౌతికదూరం పాటిస్తూ మాస్కు ధరించి వారితో మాట్లాడితే వైరస్‌ బారిన పడరనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు, మేధావులు పేర్కొంటున్నారు. బాధితులతో మాట్లాడడం ద్వారా వారిలో ధైర్యాన్ని నింపాలని, తద్వారా ఆత్మస్థైర్యం ఏర్పడుతుందని వివరిస్తున్నారు. 


వైరస్‌బారిన ఎవరైనా పడొచ్చు: డాక్టర్‌ పీవీ సుధాకర్‌, ఏఎంసీ ప్రిన్సిపాల్‌
కరోనా బాధితుల పట్ల కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు అమానుషం. వైరస్‌బారిన ఎవరైనా పడొచ్చు. ఈ రోజు వివక్ష చూపిన వారే... రేపు వైరస్‌బారిన పడితే పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోండి. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తూ... బాధితులతో ఎప్పటిమాదిరిగానే మాట్లాడాలి. వారు పూర్తిగా కొలుకునే వరకు ఇంట్లోకి అవసరమైన నిత్యావసర సరుకులను అందజేసి సహకరించాలి.

మానవత్వం ప్రధానం: డాక్టర్‌ శాస్త్రి, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి.
సాటివారు ఆపదలో వుంటే... ఆర్థికంగా మనం సాయం చేయకపోయినా పెద్దగా పట్టించుకోరు. కానీ హేళనచేయడం, వివక్ష చూపడం, అంటరానివారుగా చూడడం, సహాయ నిరాకరణ చేయడం వంటి మానవతానికి మచ్చతెచ్చే పనులు చేయకూడదు. వైరస్‌ సోకిన వ్యక్తిని పట్టుకోకుండా, దూరంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటిస్తూ మాట్లాడడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనిపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంతమంది తీరు మారడం లేదు.

Updated Date - 2020-08-07T17:18:36+05:30 IST