బయోవార్‌పై ముందస్తు ప్లాన్‌

ABN , First Publish Date - 2020-04-10T06:14:31+05:30 IST

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దేశమంతటా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు...

బయోవార్‌పై ముందస్తు ప్లాన్‌

  • 12 ఏళ్ల క్రితమే ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రతిపాదనలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దేశమంతటా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కావాల్సిన మందులు, వైద్య పరికరాలను సిద్ధం చేసే పనిలో ప్రభుత్వం తలమునకలైంది. కానీ.. 12 ఏళ్ల  క్రితమే అంటే 2008లోనే భారత ప్రభుత్వం.. అంటువ్యాధులు, జీవవిపత్తుల వంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు, సామూహిక ప్రాణనష్టాన్ని అరికట్టేందుకు ఇదే తరహా ముందస్తు ప్రణాళికను రూపొందించింది. కానీ.. అప్పటి ప్రభుత్వాధికారులు వాటిని అమలు కానీయకుండా అడ్డుకున్నారని ఆ ప్రణాళికలో భాగస్వామి అయిన ఒక సీనియర్‌ అధికారి వెల్లడించారు. సాయుధ దళాల మెడికల్‌ సర్వీసెస్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ జేఆర్‌ భరద్వాజ్‌ నేతృత్వంలోని జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) నిపుణులు ఈ ప్రణాళికను రూపొందించారు. లాక్‌డౌన్‌లు ప్రకటించడం, అందుకోసం ప్రజలను సిద్ధం చేయడం, భౌతిక దూరాన్ని పాటించడం,  ఆస్పత్రులను మందులు, వైద్య పరికరాలతో పూర్తిగా సన్నద్ధం చేయడం, వ్యక్తిగత రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచడం వంటివి ఎన్డీఆర్‌ఎఫ్‌ నివేదికలో నిపుణులు సూచించారు. 


తద్వారా సామూహిక మరణాలను అడ్డుకోవచ్చని సూచించారు. అయితే అప్పటి ప్రభుత్వాధికారులు దీనిని ప్రతిఘటించడంతో ఈ నివేదిక అమలుకాలేదని ఆ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం కూడా వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కుల కొరత వంటి సమస్యలు ఉన్నాయి. అప్పట్లో నివేదికను రూపొందించిన సభ్యుల్లో ఒకరైన అధికారి ఇప్పటి పరిస్థితులపై స్పందిస్తూ.. ‘మనకు  ఉన్న వనరులపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ నివేదిక కనుక అమల్లోకి వచ్చి ఉంటే చాలా కష్టాలను నివారించే అవకాశం ఉండేది’ అని చెప్పారు. 2005లో ఎన్డీఆర్‌ఎఫ్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ ఎన్‌సీ విజ్‌ కూడా అధికార్ల వైఖరిని తప్పుబట్టారు. 2004లో వ్యాపించిన హెచ్‌1ఎన్‌1 ఫ్లూ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవించినపుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ అప్పట్లో ఈ ప్రణాళికను సిద్ధం చేసింది.

Updated Date - 2020-04-10T06:14:31+05:30 IST