సిటీ టు విలేజ్.. పట్టణాల నుంచి గ్రామాలకు పాకుతున్న కరోనా

ABN , First Publish Date - 2020-05-28T20:17:37+05:30 IST

కరోనా విజృంభణ రోజురోజుకూ తీవ్రమవుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా చాపకింద నీరులా వైరస్‌ విస్తరిస్తోంది. రెండు నెలలు లాక్‌డౌన్‌లో ఉండటంతో కొంత తగ్గుముఖం పట్టిన మహమ్మారి.. సడలింపులతో మళ్లీ తన పంజా విసురుతోంది.

సిటీ టు విలేజ్.. పట్టణాల నుంచి గ్రామాలకు పాకుతున్న కరోనా

లాక్‌డౌన్‌ సడలింపులతో విజృంభణ

అనూహ్యంగా పెరుగుతున్న కేసులు

కరోనా కట్టడిలో విఫలమవుతున్న అధికార యంత్రాంగం

విచ్చల విడిగా జన సంచారం, మాస్క్‌లు వాడకంపై నిర్లక్ష్యం


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనా విజృంభణ రోజురోజుకూ తీవ్రమవుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా చాపకింద నీరులా వైరస్‌ విస్తరిస్తోంది. రెండు నెలలు లాక్‌డౌన్‌లో ఉండటంతో కొంత తగ్గుముఖం పట్టిన మహమ్మారి.. సడలింపులతో మళ్లీ తన పంజా విసురుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నిన్న మొన్న ఒకటి రెండు కేసులు ఉన్నవి.. ప్రస్తుతం పదుల సంఖ్యలో వస్తున్నాయి.


దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పట్టి పీడిస్తోంది. పట్టణాలకే పరిమితమైన కరోనా.. ప్రస్తుతం పల్లెలకూ విస్తరించింది. రెండు నెలలపాటు దేశంలో, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగింది. ప్రజలు స్వీయ నిర్బంధం పాటించారు. ఎవరూ బయటకు రాలేదు. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. అన్నిరంగాలు కుదేలయ్యాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ విధించడంతో కరోనా వైరస్‌ కట్టడి అయ్యింది. దీంతో తెలంగాణ సర్కార్‌ లాక్‌డౌన్‌ సడలించింది. దీంతో అసలు సమస్య మొదలైంది. మొదటగా ఆటోరిక్షాలు, క్యాబ్‌లకు అనుమతిచ్చారు. తర్వాత స్టీలు, సిమెంట్‌, ఎలక్ర్టికల్‌, హార్డ్‌వేర్‌ దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం షాపులు ఓపెన్‌ అయ్యాయి. మద్యం ప్రియులు లిక్కర్‌ కోసం బారులు తీరారు. కరోనా వ్యాప్తి నివారణకు మున్సిపాలిటీలో సరి, బేసి విధానాన్ని అమలు చేశారు. సొంతూళ్లకు వెళ్లిన ఉద్యోగ, కార్మికులంతా మళ్లీ తిరుగు ప్రయాణమయ్యారు. తర్వాత ఆర్టీసీ రథచక్రాలు రోడ్లపైకి వచ్చాయి. విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యకలాపాలు మొదలయ్యాయి రెండు నెలలకు పైగా ఇంటిగడప దాటని జనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు.


కరోనా సోకుతుందనే భయం లేకుండా పోయింది. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మళ్లీ మండల కేంద్రాలు, పట్టణాల్లో ట్రాఫిక్‌ పెరిగిపోయింది. భౌతికదూరం పాటించడం లేదు. మాస్క్‌లు ధరించడం లేదు. జీహెచ్‌ఎంసీ వరకే పరిమితమైన కరోనా కేసులు నేడు గ్రామీణ ప్రాంతాలకూ పాకాయి. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత వైరస్‌ తన ప్రభావాన్ని చూపుతోంది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. లాక్‌డౌన్‌ సడలింపునకు ముందురోజుకు ఒకటి రెండు కేసులు వచ్చేవి.. ఇప్పుడు ఏకంగా ఐదు నుంచి పది వరకు వస్తున్నాయి. ఈనెల 26వ తేదీన ఒక్క రోజే 24 కేసులు నమోదు కావడం చూస్తే వైరస్‌ ఉధృతి ఎలా ఉందో తెలిసిపోతోంది. వికారాబాద్‌ జిల్లాలో 36 రోజుల తర్వాత ఒక్కరోజే 5 కేసులు నమోద య్యాయి. లాక్‌డౌన్‌ ఉంటే ఒక సమస్య.. లేకుంటే మరో సమస్యలా ఉంది. ప్రస్తుత పరిస్థితి. వైరస్‌ను కట్టడి చేస్తున్నామని పాలకులు చెబుతున్నప్పటికీ కరోనా మాత్రం తన పంజా విసురుతూనే ఉంది. వైరస్‌ ప్రభావం ఏమాత్రం తగ్గటం లేదు. దీంతో కరోనా ఉమ్మడి జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 


నమూనాలు తీస్తే..

ప్రస్తుతం రక్త నమూనాలు తీయడం లేదు. ఒకవేళ తీస్తే పెద్దసంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా సోకిన వ్యక్తి కుటుంబసభ్యులకు, సంబంధిత వ్యక్తులకు మాత్రమే రక్తనమూనాలు తీసి కరోనా టెస్టులు చేస్తున్నారు.  


రంగారెడ్డి జిల్లాలో పది కేసులు 

రంగారెడ్డి జిల్లాలో బుధవారం మరో పది కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. షాద్‌నగర్‌లోని ఈశ్వర్‌కాలనీకి చెందిన 10 నెలల బాబుతోపాటు 23 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. సైబరాబాద్‌ మియాపూర్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విఽధులు నిర్వహిస్తున్న శంకర్‌పల్లి మండలంలోని పర్వేత గ్రామానికి చెందిన వ్యక్తికి వైరస్‌ ఉన్నట్లు తేలింది. అలాగే చందానగర్‌లో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారించగా.. అందులో ఇద్దరు కానిస్టేబుల్స్‌ ఉన్నారు. మొయినాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ముషిరాబాద్‌లోని తన మామ ద్వారా వ్యాధి వచ్చింది. నార్సింగ్‌, మణికొండ, మియాపూర్‌లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 184కి చేరింది.


చేవెళ్ల నియోజకవర్గంలో ఇద్దరికి..

చేవెళ్ల నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ సైబరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మూడురోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకోగా.. బుధవారం అతనికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో కానిస్టేబుల్‌ కుటుంబసభ్యులు నలుగురితోపాటు ఇంటి చుట్టుపక్కల ఉన్న 15మందిని హోంక్వారంటైన్‌లో ఉండాలని శంకర్‌పల్లి సీఐ గోపీనాథ్‌ ఆదేశించారు. ప్రసుత్తం పాజిట్‌ వచ్చిన కానిస్టేబుల్‌ గాంధీలో చికిత్స పొందుతున్నాడు. అలాగే మొయినాబాద్‌ మండల కేంద్రానికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ ముషిరాబాద్‌లోని తన మామకు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరితే చూసిరావడానికి వెళ్లాడు. ఇంటికి వచ్చిన అతనికి కరోనా లక్షణాలు కన్పించడంతో వైద్యులు పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది.


షాద్‌నగర్‌లో మరో రెండు..

షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఈనెల 22న పట్టణంలోని విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన ఓ 23 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఇతడితో ఈశ్వర్‌కాలనీకి చెందిన 23 ఏళ్ల మరో యువకుడు సన్నిహితంగా మెలిగినట్లు తెలుసుకున్న వైద్య సిబ్బంది.. అతన్ని కట్టడి కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ ఇద్దరు యువకులకు చెందిన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులైన 33మందిని కట్టడి కేంద్రానికి తరలించారు. వారిలో ఈశ్వర్‌కాలనీకి చెందిన యువకుని తల్లి, తండ్రి, అన్నకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే మంగళవారం డీఎంహెచ్‌వో డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి షాద్‌నగర్‌ పట్టణానికి చేరుకుని వివరాలు సేకరించి స్థానిక వినాయక్‌ గంజ్‌లో కరోనా పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి పాజిటివ్‌ వచ్చిన వారిని కలిసిన సుమారు 40 మందికి పరీక్షలు నిర్వహించారు. శాంపిల్స్‌ను హైదరాబాద్‌ పంపించారు. బుధవారం వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రాగా, 38 మందికి నెగెటివ్‌ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. ఈశ్వర్‌కాలనీకి చెందిన యువకుడి అన్న కుమారుడైన 10 నెలల బాబుతోపాటు 23 ఏళ్ల అతని అన్న స్నేహితునికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందూనాయక్‌ తెలిపారు. ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా వైరస్‌ సోకింది. 

Updated Date - 2020-05-28T20:17:37+05:30 IST