Abn logo
Aug 2 2020 @ 02:59AM

ఆర్టీసీలో కరోనా కుదుపు

  • ఇప్పటివరకు 12 మంది మృతి...
  • వైరస్‌బారిన 200 మందిపైగా సిబ్బంది
  • రాష్ట్రంలో ఒక్క రోజులో 2,083 కేసులు
  • కొవిడ్‌కు మరో 11 మంది బలి
  • పరీక్షలతో పాటు పెరుగుతున్న బాధితులు

హైదరాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో కరోనా కలకలం రేపుతోంది. అధికారులు, సిబ్బందిలో ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరు వైరస్‌ బారినపడుతున్నారో తెలియడం లేదు. ఇప్పటికే పలువురిని పొట్టనపెట్టుకున్న మహమ్మారి.. మరింతగా విస్తరిస్తోంది. బస్సు డ్రైవర్లు, కండక్టర్లతో పాటు డిపోల్లో పనిచేసే అధికారులకూ కొవిడ్‌ సోకుతోంది.  లాక్‌డౌన్‌ మినహాయింపులతో సర్వీసులు ప్రారంభం కాగానే ఆర్టీసీలో కరోనా వ్యాప్తి మొదలైంది. ఇప్పుడది తీవ్రమైంది. అధికారిక లెక్కల ప్రకారం 200 మంద్జిపైగా పాజిటివ్‌ అని తేలగా 12 మంది మృతి చెందారు. ప్రజల మధ్య విధులు నిర్వహించే డ్రైవర్లు, కండక్టర్లకు పీపీఈ కిట్లనైనా సరఫరా చేయడం లేదని, మృతుల కుటుంబాలను యాజమాన్యం ఆదుకోవడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. వైరస్‌ సోకితే ఎక్కడికి వెళ్లాలో సిబ్బందికి తెలియడం లేదు.


సంస్థకు తార్నాకలో సొంతంగా ఆస్పత్రి ఉన్నా.. పరీక్షలు చేయడం లేదు.  ఒకపక్క ప్రభుత్వం పీహెచ్‌సీల్లోనూ పరీక్షలు చేస్తామని చెబుతోంది. కానీ, 50 వేల మంది సిబ్బంది, అధికారులకు సేవలందించే తార్నాక ఆస్పత్రిలో మాత్రం పరీక్షలకు దిక్కు లేదు. ఇక్కడ కొవిడ్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సంఘాలు కోరుతున్నా యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించి ఉద్యోగులను కరోనా నుంచి రక్షించాలని టీఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు.


రాష్ట్రంలో ఒక్కరోజులో 2 వేలపైగా కేసులు

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం రికార్డు స్థాయిలో 2,083 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం. దీంతో బాధితుల సంఖ్య 64,786కు చేరుకుంది. మరో 11 మంది చనిపోయారు. మరణాల సంఖ్య 530కు చేరింది. శుక్రవారం అత్యధికంగా 21,011 పరీక్షలు చేశారు. 1,114 మంది డిశ్చార్జి కాగా వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 46,505కు చేరింది. 17,754 యాక్టివ్‌ కేసులున్నాయి. 


పాలమూరు పల్లెలపై కొవిడ్‌ పంజా

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక్క రోజే 185 కేసులు నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 72 కేసులు వచ్చాయి. మారుమూల పల్లెల్లో సైతం బాధితుల సంఖ్య పెరుగుతుడటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీవే 578 ఉన్నాయి. రంగారెడ్డిలో 228, మేడ్చల్‌లో 197, కరీంనగర్‌లో 108,  సంగారెడ్డిలో 101 కేసులు నమోదయ్యాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో వారం  నుంచి వంద మందిపైగా కొవిడ్‌ బారినపడుతున్నారు.


కుమారుడికి కరోనా.. షాక్‌తో తల్లి మృతి

కుమారుడికి కరోనా సోకిందని తెలిసి.. షాక్‌తో తల్లి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగింది. పట్టణానికి చెందిన ఓ మహిళకు ముగ్గురు కుమారులు. వారిలో చిన్నవాడికి  శనివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సంగతి తెలిసి మహిళ కుప్పకూలింది. ఆమె కుమారుడు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాడు. కరోనాకు చికిత్స పొందుతూ మణుగూరు మండలానికి చెందిన వృద్ధురాలు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చనిపోయింది. వైద్యాధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేసినా.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించారు. 

 

ఆస్పత్రి నుంచి వెళ్లి.. రైల్వే స్టేషన్‌లో విగత జీవిగా

కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన కరోనా బాధితుడు.. రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో శనివారం విగత జీవిగా కనిపించాడు. గత నెల 28వ తేదీన దమ్మపేట మండలానికి చెందిన వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. సరైన వైద్యం అందడం లేదంటూ శుక్రవారం వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు గాలిస్తుండగా.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలోని ఆటోస్టాండ్‌ వద్ద ఓ వ్యక్తి మృతిచెందాడని తెలిసింది. కాగా, మృతుడి సోదరుడు ఆస్పత్రి వైద్య సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
Advertisement
Advertisement