ఫెడ్‌ బాటలో ఆర్‌బీఐ?

ABN , First Publish Date - 2020-03-05T06:14:16+05:30 IST

ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కూడా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఎంచుకున్న బాటనే అనుసరించనుందా..?

ఫెడ్‌ బాటలో ఆర్‌బీఐ?

కరోనాను ఎదుర్కొనేందుకు వడ్డీ రేట్లు మరింత తగ్గింపు 

ద్రవ్య లభ్యత పెంపు.. ఇతర చర్యలనూ చేపట్టే అవకాశం 


ముంబై: ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కూడా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఎంచుకున్న బాటనే అనుసరించనుందా..? అవుననే సంకేతాలొస్తున్నాయి. కరోనాతో సమరంలో అవసరమైతే కీలక వడ్డీ (రెపో) రేట్లను మరింత తగ్గించే వెసులుబాటు తమకుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంపుతోపాటు మరిన్ని చర్యలను చేపట్టే అవకాశం ఉందని   బ్లూంబర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సూచనప్రాయంగా చెప్పారు. అంతకు కొద్ది సమయం క్రితమే, అమెరికా సెంట్రల్‌ బ్యాంకైన ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేటును ఏకంగా 0.50 శాతం తగ్గించింది. కరోనా వైరస్‌ తమ దేశ ఆర్థిక కార్యకలాపాలకు ముప్పుగా పరిణమిస్తోందని వడ్డీ రేట్ల తగ్గింపు సందర్భంగా ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ పేర్కొన్నారు. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, మలేషియా సెంట్రల్‌ బ్యాంకు లు కూడా మంగళవారం వడ్డీ రేట్లను తగ్గించాయి. తమ ఆర్థిక వ్యవస్థకు మరో ఉద్దీపన ప్యాకేజీ కోసం కసరత్తు చేస్తున్నట్లు ఇండోనేషియా ప్రకటించింది. కరోనా కారణంగా తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్న మార్కెట్లను స్థిరీకరించేందుకు తగిన చర్యలు చేపడతామని జపాన్‌, బ్రిటన్‌ సెంట్రల్‌ బ్యాంకులూ హామీ ఇచ్చాయి. కాగా, ఆర్‌బీఐ తదుపరి పరపతి సమీక్ష మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరగనుంది. ఫెడ్‌ తరహాలో ఆర్‌బీఐ సైతం పరపతి సమీక్ష కంటే ముందే వడ్డీ రేట్లను తగ్గించినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 


 వ్యవస్థలోకి మరో రూ.లక్ష కోట్లు 

కరోనా వైరస్‌ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ అసాధారణ నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉందని ముగ్గురు ప్రభుత్వ అధికారులు తెలిపారు. రెండో దఫా లాంగ్‌టర్మ్‌ రెపో ఆపరేషన్స్‌ (ఎల్‌టీఆర్‌ఓ) ద్వారా ఆర్‌బీఐ మరో రూ.లక్ష కోట్ల నగదును మార్కెట్లోకి విడుదల చేసే ఆలోచనలో ఉందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రెండో దఫా ఎల్‌టీఆర్‌ఓ ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కావచ్చన్నారు. ఫిబ్రవరి 6న ప్రకటించిన తొలి దఫా ఎల్‌టీఆర్‌ఓ ద్వారా ఆర్‌బీఐ వ్యవస్థలోకి రూ.లక్ష కోట్లు చొప్పించనుంది. షెడ్యూలులోని నాలుగు విడతల్లో ఇప్పటికే మూడు పూర్తయ్యాయి. ఈ నెల 9న చివరి విడత ఆపరేషన్స్‌కానున్నాయి. ఈ ఆపరేషన్స్‌లో భాగంగా ఆర్‌బీఐ రెపో రేటు(5.15 శాతం)కే నిధులను ఆఫర్‌   చేస్తుంది. తద్వారా ఓపెన్‌ మార్కెట్లో రుణాలు సేకరించేందుకు చెల్లించాల్సిన వడ్డీ రేటు కంటే చా లా చౌకగా నిధులను సేకరించేందుకు బ్యాంకులకు అవకాశం లభిస్తుంది. చౌకగా సేకరించే నిధులతో బ్యాంకులు తమ కస్టమర్లకు విస్తృతంగా, మరింత తక్కువ వడ్డీ రేటుకే రుణాలివ్వగలిగే అవకాశం లభిస్తుంది. మార్కెట్లో వినియోగ డిమాండ్‌ను పునరుద్ధరించేందుకు ఇది దోహదపడుతుంది. 


 పరస్పర సహకారంతో చర్యలు అవసరం

కరోనా వైరస్‌ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యాలన్నీ పరస్పరసహకారంతో విధానపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద మార్కెట్‌ అయిన భారత్‌ కూడా ఇందులో భాగస్వామి కావడం చాలా కీలకమని వారంటున్నారు. 2008 ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యాలు పరస్పర సహకారంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మళ్లీ అదే వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఎగుమతులకు  రూ.3.65 లక్షల కోట్ల గండి

కరోనా వైరస్‌ దెబ్బకు చైనాలో ఉత్పత్తి పూర్తిగా కుదేలైంది. తత్ఫలితంగా మున్ముందు నెలల్లో ప్రపంచ ఎగుమతులకు 5,000 కోట్ల డాలర్ల (రూ.3.65 లక్షల కోట్ల పైమాటే) మేర గండి పడవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. చైనాతో పాటు యూరోపియన్‌ యూని యన్‌,  అమెరికా అధికంగా నష్టపోనున్నాయని పేర్కొంది

Updated Date - 2020-03-05T06:14:16+05:30 IST