రూ.50 లక్షలతో సరి!

ABN , First Publish Date - 2020-03-29T09:58:25+05:30 IST

కరోనా వైరస్‌ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

రూ.50 లక్షలతో సరి!

అరకొర నిధులతో కరోనాను ఎదుర్కోవడం కష్టమే 

కనీసం రూ.2-3 కోట్లు కావాలంటున్న వైద్య శాఖ 

ఐసోలేషన్‌ వార్డుల్లో వేధిస్తున్న పరికరాల కొరత


కర్నూలు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాకు రూ. 3 కోట్లు విడుదల చేస్తామని అంటున్నా.. వైద్య శాఖకు మాత్రం రూ.50 లక్షలే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నిధులతో నిర్వహణ కష్టమేనని వైద్యశాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటికే కరోనా చికిత్స కోసం జిల్లాలో 200 పడకల ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు ప్రైవేటు ఆసుపత్రులతో చర్చలు జరిపామని అధికారులు చెబుతున్నారు. ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందించాలంటే వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ వంటివి అవసరమవుతాయి. ఆ వార్డుల్లో పనిచేసే వైద్యులు బాడీ మాస్కులు, ఎన్‌ 95 మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.


14 నియోజకవర్గాల్లో మొత్తం 1600 క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఉన్నవారికి భోజనం తదితర మౌలిక వసతులు కల్పించాలి. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల మంది వైద్య సిబ్బంది, వలంటీర్లు కరోనా విధుల్లో ఉన్నారు. వీరికి రోజూ శానిటైజర్లు, మాస్కులు కావాలి. ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడానికి రూ. 50 లక్షలు ఏ మాత్రం సరిపోవని, కనీసం రూ.2, 3 కోట్లు అవసరమవుతాయని వైద్యాధికారులు అంటున్నారు. 


అరకొర వసతులతో.. 

ఐసోలేషన్‌ వార్డుల్లో పూర్తిస్థాయి పరికరాలు, మందులు అందుబాటులో లేవని సమాచారం. కర్నూలులో 50, నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో 25, ఆదోని ఏరియా ఆసుపత్రిలో 5 మొత్తం 75 ఐసోలేషన్‌ పడకలను ఏర్పాటు చేశామని, అవసరం మేరకు వీటిని పెంచుతామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో 10 ఐసోలేషన్‌ పడకలు మాత్రమే సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు. ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందించాలంటే వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కావాలి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 6, నంద్యాల జిల్లా ఆసుపత్రిలో 2 మొత్తం 8 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఎనిమిది మందికి మాత్రమే పూర్తిస్థాయి వైద్యం అందించవచ్చు. 


బాడీ మాస్కులు, ఎన్‌ 95 మాస్కుల కొరత

ఐసోలేషన్‌ వార్డులో విధులు నిర్వహించే వైద్యులకు బాడీ మాస్క్‌లు, ఎన్‌ 95 మాస్కులు, శానిటైజర్లు అవసరమవుతాయి. ప్రస్తుతం వైద్యులకు కావాల్సిన బాడీ మాస్క్‌లు 540 వరకు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నా అవి ఇంతకుముందు ఆర్డరు పెట్టినవే. గతంలో కొన్న బాడీ మాస్క్‌లు వేసుకుని ఐసోలేషన్‌ వార్డుల్లో విధులు నిర్వహిస్తే ప్రమాదమని తెలుస్తోంది. బయట మార్కెట్లో సర్జికల్‌ మాస్కుల కొరత ఉంది.


దీంతో కరోనా విధుల నిర్వహణలో ఉన్న అధికారులకు వాటిని పంపిణీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మాస్కులు లేవు. ఇపుడు ఆర్డరు పెడదామన్నా సరైన సమయానికి అందుతాయాన్న గ్యారంటీ లేదు. పైగా మాస్కుల ధరలు పెరిగిపోయాయి. ఇంతకు ముందు బాడీ మాస్కులు రూ.5 వేల నుంచి 6 వేల వరకు ఉండేవి. ఇపుడు వాటి ధర రూ. 10 వేలకు పెరిగింది. ఎన్‌ 95 మాస్కుల ధర రెట్టింపయింది. రూ.2 నుంచి 3 రూపాయలు ఉండే సర్జికల్‌ మాస్కుల ధర రూ. 20 వరకు పలుకుతోంది. 


ఇంకా అందని శానిటైజర్లు, మాస్కులు

‘అందరూ విధిగా మాస్కులు ధరించండి’ అని అధికారులు చెబుతున్నారు. కానీ ఏఎన్‌ఎమ్‌లు, ఆశా వర్కర్లు, ఇంటింటి తిరిగి సర్వే చేసే వలంటీర్లకు ఇంతవరకు శానిటైజర్లు, మాస్కులు అందించలేదు. వీరంతా ఇంటింటికి తిరిగి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరఫరా లేదని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


అన్నీ అందుబాటులో ఉన్నాయి.. జి.రాంప్రసాద్‌, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ ఆసుపత్రి, కర్నూలు

కరోనా అనుమానితులకు చికిత్స అందించడానికి అవసరమయ్యే అన్ని సదుపాయాలు వార్డులో ఉన్నాయి. వెంటిలేటర్లు కొత్తవి 5 అందుబాటులోకి వస్తాయి. కడప నుంచి 5, అనంతపురం నుంచి 5 మొత్తం 10 వెంటిలేటర్లు కూడా రావాల్సి ఉంది. అవసరమైతే జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న  వెంటిలేటర్లను ఉపయోగించుకుంటాం. ఐసోలేషన్‌ వార్డుల్లో విధులు నిర్వహించే వైద్యులకు అవసరమైన బాడీ మాస్కులు, ఎన్‌ 95 మాస్కులు, శానిటైజర్లు  కూడా అందుబాటులో ఉన్నాయి.  


Updated Date - 2020-03-29T09:58:25+05:30 IST