రేపటి నుంచే రేషన్‌ సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2020-03-29T09:47:33+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్న దృష్ట్యా ఏప్రిల్‌ నెల రేషన్‌ సరుకులు ఆదివారం నుంచి ప్రభుత్వం పంపిణీ చేయబోతోన్నది.

రేపటి నుంచే రేషన్‌ సరుకుల పంపిణీ

షాపులకు చేరుతున్న బియ్యం, కందిపప్పు. చక్కెర 

ఈ-పోస్‌ ద్వారానే సరఫరా

బియ్యం, కందిపప్పు ఉచితం... చక్కెర మాత్రం నగదుకే


గుంటూరు,మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్న దృష్ట్యా ఏప్రిల్‌ నెల రేషన్‌ సరుకులు ఆదివారం నుంచి ప్రభుత్వం పంపిణీ చేయబోతోన్నది. ఆదివారం ఉదయం నుంచి ఈ-పోస్‌ విధానంలో సరుకుల పంపిణీని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాయి. బియ్యం, కందిపప్పు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. చక్కెరకు మాత్రం నగదు చెల్లించాలని పౌరసరఫరాల అధికారులు స్పష్టం చేస్తోన్నారు. 


జిల్లాలో గత నెల వరకు 14 లక్షల 89 వేల 446 కుటుంబాలకు తెల్లరేషన్‌కార్డులు ఉన్నాయి. వీరికి 2,801 షాపుల నుంచి ప్రతీ నెలా బియ్యం, చక్కెర, కందిపప్పు పంపిణీ జరుగుతోన్నది. అయితే వైఎస్‌ఆర్‌ నవశకం సర్వే జరిగిన తర్వాత దాదాపుగా 70 వేల కార్డులు అనర్హులజాబితాలోకి వెళ్లిపోయాయి. ఈ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలకు రేపటి నుంచి ప్రారంభమయ్యే రేషన్‌ పంపిణీలో సరుకులు ఇస్తారో, లేదోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏప్రిల్‌ నెల కోటాకు సంబంధించి 22వేల టన్నుల బియ్యం, 1,400 టన్నుల కందిపప్పు, 700 టన్నుల చక్కెర నిల్వలను ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి షాపులకు చేరుస్తున్నారు.


శుక్రవారం సాయంత్రానికి 70శాతం షాపులకు సరుకులు చేరాయని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ లక్ష్మీరెడ్డి తెలిపారు. మిగతా 30శాతం షాపులకు కూడా శనివారం అర్ధరాత్రి అయినా సరే చేర్చి ఆదివారం ఉదయం పంపిణీకి ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామన్నారు. ఇదిలావుంటే రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు  తమకు మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు ఇవ్వాలని షాపుల వద్ద రద్దీని నియంత్రించేందుకు పోలీసు/వలంటీర్లను ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డీలర్లకు ప్రత్యేకంగా ఐడీకార్డులు ఇవ్వాలని కోరారు.


ఈ విషయంపై డీఎస్‌వో శివరాంప్రసాద్‌ని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా తమకు కమిషనరేట్‌ నుంచి శుక్రవారం సాయంత్రం ఆదేశాలు వెలువడ్డాయన్నారు. ఏ రేషన్‌ షాపు ఇరుకుగా ఉంటుందో ఆ దుకాణాన్ని సమీపంలోని ఖాళీ మైదానంలోకి మార్చి తాత్కాలిక కూరగాయల మార్కెట్లలోవలే సరుకులు తీసుకొనేందుకు భౌతికదూరం పాటించేలా చూస్తామన్నారు. ప్రతీ చోట డీలర్ల ద్వారా శానిటైజర్లు ఏర్పాటుచేయిస్తామని తెలిపారు. 


Updated Date - 2020-03-29T09:47:33+05:30 IST