పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయండి

ABN , First Publish Date - 2020-03-27T09:49:18+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని పోలీసులు, ఇతర శాఖల అధికారులను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశించారు.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయండి

జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు... నగరంలో పర్యటన


అనంతపురం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని పోలీసులు, ఇతర శాఖల అధికారులను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశించారు. నగరంలో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. సప్తగిరి సర్కిల్‌, శ్రీకంఠం సర్కిల్‌, కమలానగర్‌, టవర్‌క్లాక్‌, నడిమివంక, బైపాస్‌ ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి పరిస్థితుల గురించి ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో ఆరా తీశారు. ఆ సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండడంతో లాక్‌డౌన్‌ అమలు తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న కమలానగర్‌లోని ఎస్‌ఆర్‌ఈడీ స్వచ్ఛంద సేవా సంస్థను ఆయన సం దర్శించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారి వసతి సౌకర్యాలపై ఆరా తీశారు.


బుధవారం రాత్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది సాయి స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రత్యేక వాహనంలో నగరంలోని 63 మంది వరకు యాచకులు, నిరాశ్రయులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. వారందరికీ పట్టణ మహిళానిరాశ్రయుల వసతి గృహంలో ఆశ్రయం కల్పించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ దాన్ని సందర్శించారు. వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటున్న దృష్ట్యా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ వారికి భరోసా ఇచ్చారు. వసతిగృహంలో ఉన్నంత కాలం సాయిసంస్థ ఆధ్వర్యంలో మూడుపూటలా భోజన వసతితో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తారన్నారు. వసతిగృహం చుట్టుపక్కల ఫాగింగ్‌ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆదేశించారు. కాగా, నగర పర్యటనలో భాగంగా ఆయన పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రతినిధులతో పాటు విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులను గుర్తింపు కార్డు చూపించిన వెంటనే వదలాలని ఆయన సూచించారు. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి, డీఎ్‌సఓ శివశంకర్‌రెడ్డి, వసతిగృహం మేనేజర్‌ బాషా, సాయి స్వచ్ఛందసంస్థ ప్రతినిధి విజయసాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-27T09:49:18+05:30 IST