కశ్మీరులో 4జీ ఎందుకు పునరుద్ధరించరు?

ABN , First Publish Date - 2020-04-10T07:25:22+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి మూలంగా నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో జమ్మూకశ్మీరులో 4జీ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని ..

కశ్మీరులో 4జీ ఎందుకు పునరుద్ధరించరు?

  • వారంలో బదులివ్వండి: జస్టిస్‌ రమణ
  • కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
  • వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి మూలంగా నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో జమ్మూకశ్మీరులో 4జీ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన  వ్యాజ్యంపై సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి నోటీసులిచ్చింది. ఈ విషయంలో వారం రోజుల్లో జవాబివ్వాల్సిందిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.  జమ్మూకశ్మీరులో ఇంటర్నెట్‌ స్పీడ్‌ను 2జీకి మాత్రమే పరిమితం చేస్తూ మార్చి 26న జమ్మూకశ్మీరు పాలనా యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలపై ఫౌండేషన్‌ ఫర్‌ మీడి యా ప్రొఫెషనల్స్‌ అనే సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.


జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఇదే ధర్మాసనం జనవరి 10న జారీ చేసిన ఆదేశాల మేరకే ప్రభుత్వం అక్కడ 2జీ ఇంటర్నెట్‌ సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండ డం భావప్రకటనా స్వేచ్ఛకు, వ్యాపారం సాఫీగా జరుపుకొనేందుకు అవసరమని జస్టిస్‌ ఎన్వీ రమణ సంచలనాత్మక తీర్పు ఇచ్చారు. ఆర్టికల్‌ 19(1)ఏ, ఆర్టికల్‌ 19(1)జీ కింద ఇంటర్నెట్‌ ప్రాథమిక హక్కులో భాగమనీ ఆయన స్పష్టం చేశారు. ఒక రివ్యూ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. దీనితో కేంద్రం జమ్మూకశ్మీరులో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని క్రమంగా పునరుద్ధరి స్తూ వచ్చింది. మార్చి 4 నుంచి వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా సాధనాలను అనుమతిస్తూ వచ్చింది. అయితే పరిమిత డేటా సౌకర్యాన్ని అందించే 2జీ స్పీడ్‌ను మాత్రమే ప్రభుత్వం పునరుద్ధరించింది. దీనివల్ల వీడియోలు, చిత్రాలు, ఇతర డేటా  పొందడం సాధ్యం కావడంలేదని, కరోనా మూలంగా ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ ఫౌండేషన్‌ ఫర్‌ మీడియా ప్రొఫెషనల్స్‌ సంస్థ మరోసారి కోర్టుకెళ్లింది. 


లాక్‌డౌన్‌ రీత్యా జమ్మూకశ్మీర్‌లో టెక్నాలజీని, అనుసంధానాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నదని, ముఖ్యంగా డాక్టర్లకు, రోగులకు సమాచారం అందడం లేదని పిటిషనర్‌ తరఫున న్యాయవాది హుజేఫా అహ్మదీ వాదించారు. స్కూళ్లు మూసివేసినందువల్ల విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలు నే ర్చుకోవాలంటే టెక్నాలజీని పెంచడం అవసరమని  పేర్కొన్నారు. టెక్నాలజీని కుదించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం సమానత్వ హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగకరమని వాదించారు. 2జీ సర్వీసు కు కాలం చెల్లిందనీ, కరోనా వైరస్‌ వ్యాప్తి రీత్యా సమాచారం సాఫీగా అందుబాటులో ఉండాలంటే 4జీ ఇంటర్నెట్‌ స్పీడ్‌ అవసరమని న్యాయవాది పేర్కొన్నారు. కోవిడ్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి అని, దీన్ని ఎదుర్కొనే మార్గాల గురించి తెలుసుకోవాలంటే నిరంతరం సమాచారం అందుబాటులో ఉండాలని వాదించారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనావల్ల ఇద్దరు మరణించారని, 33 మంది కి వ్యాఽధి సోకిందని కోర్టుకు తెలిపారు. ఈ పరిస్థితుల్లో పౌరులకు సమాచారం స్వేచ్ఛగా, సాఫీగా లభించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. 

Updated Date - 2020-04-10T07:25:22+05:30 IST