సామాజిక దూరం పాటించాలి

ABN , First Publish Date - 2020-03-27T09:27:04+05:30 IST

కరోనా వైరస్‌ గుంటూరు నగరానికి వ్యాపించిన నేపథ్యంలో ప్రజలంతా పూర్తి అప్రమత్తంగా ఉంటూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ రామకృష్ణ తెలిపారు.

సామాజిక దూరం పాటించాలి

మీటరు దూరంలో బాక్సుల మార్కింగ్‌ ఇవ్వాలి

సాయంత్రం 6 తరువాత అన్ని దుకాణాలు మూయాల్సిందే

నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలు, దుకాణాలపై కేసులు


గుంటూరు, మార్చి 26: కరోనా వైరస్‌ గుంటూరు నగరానికి వ్యాపించిన నేపథ్యంలో ప్రజలంతా పూర్తి అప్రమత్తంగా ఉంటూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ రామకృష్ణ తెలిపారు. కూరగాయల స్టాల్స్‌ ఏర్పాటులో  నెలకున్న సందిగ్ధత నేపథ్యంలో గురువారం ఆయన వివిధ శాఖలతో పోలీసు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కరోనా పాజిటివ్‌ కేసుతో పోలీసు యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలన్నారు. నగరంలో 16 తాత్కాలిక కూరగాయల మార్కెట్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా సెంటర్లలో ఒక్కొక్క దుకాణం ఎదురుగా సామాజిక దూరం పాటించేలా కనీసం మీటరు దూరంలో మార్కింగ్‌ చేసి బాక్సులు ఏర్పాటు చేయాలన్నారు. వినియోగదారుల మధ్య తొక్కిసలాట వంటివి చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బందిని బందోబస్తు నియమించనున్నట్లు తెలిపారు.


  బీఆర్‌ స్టేడియం, యాదవ హై స్కూల్‌, గుంటగ్రౌండ్‌, ఉల్ఫ్‌ హాల్‌ గ్రౌండ్స్‌, స్టాల్‌గల్స్‌ హై స్కూల్‌, రెడ్డికాలేజీ, ఏటీ అగ్రహారంలోని ఎస్‌కేబీఎం మున్సిపల్‌ హై స్కూల్‌, లాడ్జి సెంటర్‌ లూథరన్‌ హైస్కూల్‌, గార్డెన్స్‌లోని సీతారామయ్య స్కూల్‌, అమరావతి రోడ్డులోని మెడికల్‌ కళాశాల బాయ్స్‌ హాస్టల్‌, పిచ్చికలగుంట, రింగురోడ్డులోని డాన్‌బాస్కో గ్రౌండ్‌, నగరాల్లోని నవీన స్కూల్‌ గ్రౌండ్‌, ఎస్‌వీఎన్‌ కాలనీలోని చిన్మయా హై స్కూల్‌, కాకాని రోడ్డులోని వాసవీ కాంప్లెక్స్‌, పొన్నూరు రోడ్డులోని ముస్లిం కళాశాలలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూరగాయల దుకాణాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇంటికి ఒకరు మాత్రమే రావాలన్నారు. ప్రభుత్వం సూచించిన ధరలకే విక్రయించాలని అధిక ధరలకు విక్రయించకుండా మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొల్లిశారదా హోల్‌సేల్‌ మార్కెట్‌ను బుడంపాడు బైపాస్‌ సమీపంలోని బొంతపాడు డొంకలోకి తరలించామన్నారు. పెదమార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. నిత్యవసర సరుకులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 1902కు కాల్‌ చేయాలన్నారు.


కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగాని, దూర ప్రాంతం నుంచిగాని, విదేశీ ప్రాంతాల నుంచి గాని ఎవరైనా వస్తే 104కు గాని, డయల్‌ 100కు గాని, పోలీసు కంట్రోల్‌ రూమ్‌ వాట్సాప్‌ నెంబర్‌ 8688831568లో సమాచారం ఇవ్వాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న వాహనాలు, తెరిచిన దుకాణాలపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం 17 దుకాణాలు, 16 వాహనాలపై కేసులు నమోదు చేశామన్నారు. 107 ఆటోలను కూడా సీజ్‌ చేశామన్నారు. సుమారు 110 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు గంగాధరం, మనోహర్‌రావు, కార్పొరేషన్‌ రెవెన్యూ అధికారులు ఎస్‌ఎన్‌ ప్రసాద్‌, డి.వేణుబాబు, కె.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-27T09:27:04+05:30 IST