Abn logo
May 13 2021 @ 13:08PM

షాకింగ్.. పెంపుడు జంతువులకు వైరస్‌.. ఇప్పుడు వాళ్ల పరిస్థితేంటి..!?

  • దూరంగా ‘పెట్స’0డి!
  • మనుషుల నుంచి పెంపుడు జంతువులకు వైరస్‌!?
  • ఇంట్లో ఎవరికైనా సోకితే వాటిని దూరంగా పెట్టడమే మంచిది
  • పెట్స్‌లో వైరస్‌ ఉత్పరివర్తనం చెందితే ప్రమాదం అన్న ఆందోళనలు
  • జంతువుల కోసం వ్యాక్సిన్‌ రూపకల్పనలో రష్యా, అమెరికా వంటి దేశాలు

హైదరాబాద్‌ సిటీ : జనాలను బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి.. పాజిటివ్‌ వచ్చిన వారి నుంచి జంతువులకు సోకుతోందా! ఆ అవకాశాలు ఉన్నాయా? అది నిజమే అయితే ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నవారి పరిస్థితి ఏమిటి? ఇప్పుడీ ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. హైదరాబాద్‌ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఎనిమిది సింహాలకు కరోనా సోకడం, అది అక్కడి కేర్‌ టేకర్ల ద్వారానే సోకిందనే విశ్లేషణలు రావడం పెంపుడు పెట్స్‌ ప్రియులను కలవరపరుస్తున్నాయి. దీంతో అవి.. ఏ కాస్త నీరసపడినా, అస్వస్థతకు గురైనా వెటర్నరీ డాక్టర్లకు ఫోన్లు చేస్తున్నారు. పెంపుడు జంతువులను ఇంట్లో పెట్టుకొని తప్పు చేశామా? అని మీమాసంలో కొట్టుమిట్టాడుతున్నవారూ ఉన్నారు. 


పెంపుడు జంతువుల నుంచి కరోనా వ్యాప్తి చెందిందనేందుకు ఇప్పటి వరకూ ఆధారాలు లేవు. అయితే కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల నుంచి పెంపుడు జంతువులకు కరోనా సోకిన ఘటనలు మాత్రం హాంకాంగ్‌ సహా వివిధ దేశాల్లో వెలుగుచూశాయని పరిశోధకులు అంటున్నారు. నిజానికి కెనైన్‌, ఫెలైన్‌ వైర్‌సలు కేవలం జంతువులపై మాత్రమే ప్రభావం చూపుతాయి అదే సమయంలో మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకినప్పుడు ఆ వైరస్‌ రూపుమార్చుకుని తిరిగి మనుషులకు సోకి ప్రమాదకరంగా మారే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమంటున్నారు మైక్రోబయాలజిస్ట్‌ అను. అందుకే వైరస్‌ వచ్చిన వారు సాధ్యమైనంత వరకూ పెంపుడు జంతువులకు దూరంగా ఉండటమే మంచిది అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో మహిళల అభిరుచులు మారాయ్..

వైరస్‌ ఉన్న 15 ఇళ్లల్లోని కుక్కల్లో రెండింటికి  

నగరంలో పెట్స్‌కు కరోనా వచ్చిన ఘటనలు ఇప్పటి వరకూ రిపోర్ట్‌ కాలేదు. అందుకు తగ్గపరీక్షలు చేసేందుకు అవకాశాలు లేకపోవడమూ కారణం కావొచ్చన్నది వైద్యుల భావన. గతంలోని అధ్యయనాల ప్రకారం కొవిడ్‌-పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల ఇళ్లలోని పెంపుడు జంతువులకు కరోనా వచ్చే అవకాశాలు గణనీయంగా ఉన్నాయి. గత ఏడాది మే లో జరిగిన అధ్యయనాల ప్రకారం కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన ఇళ్లలోని ప్రతి 15 కుక్కల్లో రెండింటికీ తప్పనిసరిగా కరోనా సోకింది. అయితే కొవిడ్‌ లక్షణాలతో అవి చనిపోయే అవకాశాలు పెద్దగా లేవని కూడా ఆ నివేదికలు చెప్పాయి. 


ఇదే విషయమై వెటర్నరీ ఫిజీషియన్‌ డాక్టర్‌ అభిషేక్‌ మాట్లాడుతూ ‘నగరంలో కరోనా పరీక్షలు చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు మనుషులకే సరిగా లేవు. ఇక పెట్స్‌కు ఎక్కడ? విదేశాల్లో ఉన్నన్ని సదుపాయాలు మన దగ్గర ఆశించడం తప్పు. అందుకే మన దగ్గర అసలు ఆ తరహా కేసులు రిపోర్ట్‌ కాలేదు. అయినా పెట్స్‌కు ఈ వైరస్‌ అంత ప్రమాదకరమైనదేమీ కాదు. లక్షణాలను బట్టి వాటికి చికిత్స  చేస్తున్నాం. అది కరోనానా? లేదంటే మరేదైనానా? అన్నది నిర్థారణ మాత్రం జరుగడం లేదు’ అని చెప్పారు. పెంపుడు జంతువులకు కరోనా సోకకుండా రష్యాలో  ‘కార్నివాక్‌ కోవ్‌’ అనే వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అమెరికాలో జోయిటిస్‌ సంస్ధ కూడా వ్యాక్సిన్‌లను రూపొందించే పనిలో ఉందని సమాచారం. ఈ వ్యాక్సిన్‌ వచ్చేలోగా కొవిడ్‌- పాజిటివ్‌ వ్యక్తులు పెట్స్‌కు దూరంగా ఉంటే మరిన్ని ఉత్పరివర్తనాలు రాకుండా అడ్డుకోవచ్చని మాత్రం డాక్టర్లు చెబుతున్నారు. 


గ్రూమింగ్‌ ముఖ్యం

పెంచుకునేది కుక్కయినా, పిల్లి అయినా పెట్స్‌ విషయంలో గ్రూమింగ్‌ పట్ల శద్ధ్ర చూపాల్సిందేనంటున్నారు వెటర్నరీ షిజీషియన్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌. కరోనా పరిస్థితుల్లో వాటికి అనారోగ్య సమస్యలు నెలకొని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు రాకుండా ఉండాలంటే చక్కటి గ్రూమింగ్‌ ముఖ్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పెట్‌ చర్మం, జుట్టు, చెవులు, పళ్లు, ముక్కు, పాదాలను పరిశుభ్రంగా ఉంచడం కీలకమన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలను తీసుకుంటే ఇంట్లోనే గ్రూమింగ్‌ చేసుకోవచ్చంటున్నారు పెట్‌ గ్రూమర్‌ సంజన. పెట్స్‌ను నిమిరేటప్పుడు వాటి చర్మంపై మార్పులను గమనించొచ్చన్నారు. బొచ్చు ఎక్కువగా ఉంటే చిక్కుపడకుండా సరిచేయడం, స్నానం చేయించడం ముఖ్యమన్నారు. 


స్నానం చేయించేటప్పుడు వాటి కళ్లు, ముక్కు, చెవులలోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. వారానికి రెండు మూడు సార్లు అయినా వాటి పళ్లు తోమడం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయన్నారు. పెంపుడు జంతువులకు గోళ్లు పెరిగితే తీసేయాలని.. గోళ్లపై గులాబీ రంగు భాగం వరకు తొలగించాలన్నారు.  పెట్స్‌లో టిక్స్‌ ఎక్కువగా చెవుల వెనుక భాగాలను చేరి ఉంటాయని, అందుకే రెగ్యులర్‌గా చెవులను పరిశీలించాలి. అలాగే వ్యాక్స్‌ తొలగించడం కోసం డాక్టర్‌ సూచించిన లిక్విడ్‌ ఇయర్‌ క్లీనర్‌ను వాడాలని సూచించారు.  

Advertisement
Advertisement
Advertisement