కరోనా నేపథ్యంలో అనుమానాలు.. ప్రజలు కనిపించని ప్రపంచం!

ABN , First Publish Date - 2020-03-21T23:22:26+05:30 IST

కరోనా కలకలం రేపుతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలను బెంబేలెత్తిస్తోంది...

కరోనా నేపథ్యంలో అనుమానాలు.. ప్రజలు కనిపించని ప్రపంచం!

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి : కరోనా కలకలం రేపుతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఎక్కడ వైరస్‌ ఉందో, ఏ ప్రాంతంలో అనుమానితులున్నారో అన్న ఆలోచనే వణుకు పుట్టిస్తోంది. దీంతో.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనసమ్మర్థ ప్రాంతాలన్నీ వెలవెలబోతున్నాయి. ఇక్కడా, అక్కడా అని కాదు.. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.


స్థానికంగా రోడ్లు, గల్లీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లో ప్రధాన రహదారులు, కూడళ్లు బోసిపోయి దర్శనమిస్తున్నాయి. మైదానాల్లోనూ జనం కనిపించడం లేదు. బస్టాండులు, రైల్వే స్టేషన్లు భూతద్దం పెట్టి వెతికినా ప్రయాణీకుల జాడ దొరకడం లేదు. ఇక.. విమానాశ్రయాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్‌ అయ్యాయి. ఆయా దేశాల్లో దేశీయ విమాన సర్వీసులు నడుస్తున్నా.. ప్రయాణీకులు మాత్రం జడుసుకుంటున్నారు.


ఎప్పుడూ సందడిగా ఉండే కాలిఫోర్నియా లోని హాలీవుడ్‌ బర్‌బ్యాంక్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణీకులు లేక వెలవెలబోతోంది. అందరూ  ఇంటికే పరిమితం కావాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో..  కాలిఫోర్నియాలోని దాదాపు 40 మిలియన్ల మంది జనాభా శుక్రవారం నుంచి ఇంటికే పరిమితమయ్యారు.


కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. జనం ఇంటికే పరిమితం కావడం ద్వారా గొలుసుకట్టు ద్వారా వ్యాపిస్తున్న కరోనాను మరింత విస్తృతం కాకుండా అడ్డుకోవచ్చని ఈ నిర్ణయం తీసుకుంది. ఇక.. ప్రజలకు ఆహారాన్ని పంపిణీ చేయడానికి నేషనల్‌ గార్డ్‌ దళాలను రంగంలోకి దించారు. గురువారం నుంచే ఈ దళాలు ప్రభుత్వం ఆదేశించిన పనిలో నిమగ్నమయ్యాయి. ఇక, అత్యవసర పనులు ఉంటే తప్ప అక్కడి జనాలు బయటకు రావడం లేదు.


అటు.. కరోనా వైరస్‌ భయంతో ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌ను మూసేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సిడ్నీలోని బోండీ బీచ్‌కు శనివారం వేలాది మంది ప్రజలు బీచ్‌కు తరలివచ్చారు. అయితే.. అధికారులు 500 మందిని మాత్రమే బీచ్‌ లోపలికి అనుమతించి ఆ తర్వాత ప్రజలను అనుమతించలేదు.


అలాగే.. న్యూ సౌత్ వేల్స్‌లో ఉన్న  ఇతర బీచ్‌లలోనూ ఇదేరకమైన కఠినమైన నిబంధనలు అమలవుతాయని ఆస్ట్రేలియా ఆరోగ్యమంత్రి డేవిడ్‌ ఇలియట్‌ ప్రకటించారు. ఆ దేశంలో ఇప్పటికే కరోనా వైరస్‌ బారిన పడ్డవాల్ల సంఖ్య వెయ్యి దాటింది. పలు మరణాలు కూడా నమోదయ్యాయి. దీంతో.. ఆస్ట్రేలియా ప్రభుత్వం జన సమ్మర్థ ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తోంది.

సప్తగిరి గోపగోని (ఏబీఎన్‌ రెడ్‌ అలర్ట్‌ డెస్క్‌.. ఇంచార్జ్‌)


Updated Date - 2020-03-21T23:22:26+05:30 IST