స్థానికులకు ‘కరోనా’ లక్షణాలు లేవు

ABN , First Publish Date - 2020-04-05T13:42:18+05:30 IST

స్థానికులకు ‘కరోనా’ లక్షణాలు లేవు

స్థానికులకు ‘కరోనా’ లక్షణాలు లేవు

రాష్ట్రంలో కరోనా మృతులు ముగ్గురు

చెన్నై: ‘కరోనా’ మృతుల సంఖ్య రాష్ట్రంలో మూడుకు పెరిగింది. గతంలో మదురై రాజాజీ ప్రభుత్వాస్పత్రిలో 54 ఏళ్ల వ్యక్తి మృతిచెందిన నేపథ్యంలో శనివారం విల్లుపురం ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్సలు అందుకుంటున్న 51 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. ఆరోగ్య, పోలీసు శాఖల విచారణ మేరకు మరణించిన వ్యక్తి విల్లుపురం సింగారతోపు ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ రెహ్మాన్‌ (51) ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతను ఇటీవల ఢిల్లీలో జరిగిన జమాత్‌ మహానాడుకు వెళ్లి తిరిగొచ్చాడు. రెండ్రోజుల క్రితం తీవ్రమైన దగ్గు, జలుబు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు పడుతూ విల్లుపురం మొండియంబాక్కంలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు వెళ్లాడు. ఆయనను పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలున్నట్టు నిర్ధారించి ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్సలు అందించారు. చికిత్సలు ఫలించక శనివారం ఉదయం 7.44 గంటలకు అబ్దుల్‌ రెహ్మాన్‌ మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే జిల్లాకు చెందిన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం హుటా హుటిన ఆస్పత్రికి చేరుకొని మృతుడికి డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు..
కరోనా సోకడంతో తేని వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న 53 ఏళ్ల మహిళ శనివారం మరణించింది. ఆమెకు శ్వాససంబంధమైన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆమె భర్తకి కొవిడ్‌-19 పాజిటివ్‌ రావడంతో ఆయన ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్నారు.

స్థానికంగా వుండే వారికి కరోనా లక్షణాలు లేవని, పొరుగు దేశాల నుంచి వచ్చిన వారు ఈ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.సి.విజయభాస్కర్‌ తెలిపారు. స్థానిక రాయపేట లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాలు, పోలీస్‌స్టేషన్‌, ప్రభుత్వాస్పత్రి, పీఎఫ్‌ కార్యాలయాల్లో శనివారం అగ్ని మాపక శాఖకు చెందిన భారీ వాహనాలతో క్రిమినాశిని మందుల పిచికారీ జరిగింది. ఈ పనులను పరిశీలించిన మంత్రి విజయభాస్కర్‌ విలేఖరులతో మాట్లాడుతూ, కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేలా రాష్ట్రప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టినందువల్ల, స్థానికంగా ఉన్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని తెలిపారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తులు పలు దేశాల నుంచి తిరిగొచ్చిన ప్రవాస తమిళులేనని అన్నారు. ఇటీవల మదురైలో మరణించిన వ్యక్తి రక్తపోటు, మధుమేహం అధికంగా ఉన్నందువల్ల మృతిచెందాడని, అయినా అతనికి కరోనా లక్షణాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం తెలిపిందన్నారు. ప్రస్తుతం మృతిచెందిన ప్రధానోపాధ్యాయుడు ఢిల్లీ మహా నాడుకు వెళ్లి వచ్చినట్టు తెలిసింద న్నారు. ప్రస్తుతం విల్లుపురం జిల్లాలో 67 మందికి రక్తపరీక్షలు నిర్వహించగా, వారిలో ఎక్కువ మంది కరోనా లక్షణాలు లేవని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్‌ డౌన్‌ను ప్రజలు సక్రమంగా పాటిస్తే కరోనా కేసులు తగ్గుతాయన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు జలుబు, దగ్గుతో బాధప డుతూ వస్తున్న రోగులకు కరోనా చికిత్సలంటూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వచ్చాయని, ఈ ఘటనలపై విచారించి సంబంధిత ఆస్పత్రులపై కఠినచర్యలు చేపట్టాలని కలెక్టర్‌లకు ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి తెలిపారు.

Updated Date - 2020-04-05T13:42:18+05:30 IST