హిజ్రాలకు ఉచితంగా కిరాణా సరుకులు

ABN , First Publish Date - 2020-04-05T13:23:25+05:30 IST

హిజ్రాలకు ఉచితంగా కిరాణా సరుకులు

హిజ్రాలకు ఉచితంగా కిరాణా సరుకులు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి గాను ఆదివారం నుంచి రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాల పనిగంటలను తగ్గిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. ఆ మేరకు మందుల దుకాణాలు, కిరాణా సరకులు దుకాణాలు, హోటళ్లు (పార్శిల్స్‌ విక్రయం) ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే తెరచి ఉంచాలని ఆయన ఆదేశించారు. గత వారం రోజులకు పైగా 144 నిషేధాజ్ఞలు అమలు చేస్తుండటంతో నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలను ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 2.30 గంటల దాకా తెరచివుంచేవారని, ఇకపై మధ్యాహ్నం ఒంటి గంటకే ఆ దుకాణాలు మూతపడతాయని తెలిపారు.ఇకపై రాష్ట్రంలో మత సంబంధిత సమావేశాలను, కార్యక్రమా లను మానుకోవాలని, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసు కుంటామని ఆయన హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కారకు లంటూ ఓ మతానికి చెందినవారిపై విమర్శలు చేయడాన్ని మానుకో వాలని ఆయన హితవుచెప్పారు. కరోనా బాధితులను కులమతాలకు అతీతంగా కాపాడటమే అందరి కర్తవ్యమని ఆయన చెప్పారు. 


కేరళ ప్రజలకు అండగా ఉంటాం

 కేరళ ప్రజల కష్టనష్టాల్లో పాలుపంచుకుంటూ సోదరభావంతో వారికి అండగా నిలబడతామని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రబలుతుండటంతో తమిళనాడు నుంచి కేరళకు ఉన్న అన్ని వాహన రహదారులను కేరళ ప్రభుత్వం పూర్తిగా మూసివేయనున్నట్ట్లు వార్తలు వెలువడ్డాయి. కేరళ ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌ వెంటనే స్పందిస్తూ తమిళనాడు నుంచి కేరళకు చేరే రహదారులను మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమిళనాట కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రబలుతున్న కారణంగా రహదారులను మూసివేయాలని తాము నిర్ణయించలేదని, తమిళులంతా తమకు తోబుట్టువులని, వారిని సోదరభావంతోనే చూస్తామని ఆయన తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు వీడియోగా గత రెండు రోజులుగా సామాజిక ప్రసారమాధ్యమాల్లో ప్రసారమైంది. ఆ వీడియోను చూసి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆనందించారు. అలాగే, కేరళ ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌కు ట్విట్టర్‌ ద్వారా ఓ సందేశం పంపారు. తమిళ ప్రజలను తోబుట్టువుల్లా పరిగణిస్తామని కేరళ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌ ప్రకటించడం తమకెంతో ఆనందాన్ని కలుగజేస్తున్నదని అన్నారు. కేరళ ప్రజలను తాము కూడా సోదర భావంతోనే ఆదరిస్తామని ఆ సందేశంలో పేర్కొన్నారు.


అన్నాడీఎంకే విరాళం రూ.1కోటి

రాష్ట్రంలో కరోనా నిరోధక చర్యలు, కరోనా బాధితులకు చికిత్సలు చేపట్టే నిమిత్తం అధికార అన్నాడీఎంకే కోటి రూపాయల మేరకు విరాళం అంద జేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఉప సమన్వయ కర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌ సెల్వం శనివారం ఓ సంయుక్త ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు, కరోనా వైరస్‌ సోకినవారికి చికిత్సలందించటంలో అన్నాడీఎంకే ప్రభుత్వం సమర్థవం తంగానే పనిచేస్తోందని, అన్నాడీఎంకే పార్టీకూడా తన వంతు ఆర్థిక సహాయంగా రూ.1కోటిని విరాళంగా అందజేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఖాతాలో జమ చేయనున్నట్టు ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం ఆ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అన్నాడీఎంకే ఎంపీలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధులనుంచి తలా కోటి రూపాయలు, శాసనసభ్యులు తమ నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచి తలా రూ.25 లక్షలను అందజేయనున్నారని తెలిపారు. 


ప్రైవేటు ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేస్తాం

రాష్ట్రంలో మాతా శిశు సంక్షేమ సేవలు, పురుడు, డయాలసిస్‌, కిమో థెరఫీ వంటి అత్యవసర వైద్యసేవలందించని ప్రైవేటు ఆస్పత్రుల లైసెన్సులను రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలలో భాగంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న సందర్భంగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ప్రసవాలకోసం వచ్చే గర్బిణీలను తిప్పి పంపుతున్నాయని, డయాలసిస్‌, కిమోథెరఫీ అవంటి అత్యవసర వైద్యసేవలు కూడా చేయడంలేదని ప్రభుత్వ దృష్టికి వచ్చిందని, రాబోవు రోజులలో ప్రైవేటు ఆస్పత్రులు ఈ వైఖరిని కొనసాగిస్తే వాటి లైసెన్సులను రద్దు చేస్తుందని ఆ ప్రకటనలో హెచ్చరించారు.


హిజ్రాలకు ఉచితంగా కిరాణా సరుకులు

రాష్ట్రంలో రేషన్‌కార్డులు లేని హిజ్రాలకు ప్రభుత్వం తరఫున ఉచితంగా కిరాణా సరుకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు సామాజిక సంక్షేమ శాఖ గుర్తించిన 4,022 మంది హిజ్రాలకు 12 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు వంట నూనె ఉచితంగా పంపిణీ చేయనున్నారు. దీనిపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఆర్‌.కామరాజ్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం లాక్‌డౌన్‌ సమయంలో ప్రకటించిన కరువు నివారణ పొందేందుకు ప్రజలు గుంపులుగుంపులుగా రావడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించడం లేదని మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. దీనిపై స్పందించిన సీఎం పళనిస్వామి టోకెన్‌ ఇచ్చే సమయంలోనే నగదు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారని, ఆ ప్రకారం ఆదివారం రేషన్‌ దుకాణాలు మూసివేస్తారని, అయితే రేషన్‌ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రేషన్‌ సరుకులతో పాటు రూ.1,000 నగదును అందజేస్తారని తెలిపారు. 

Updated Date - 2020-04-05T13:23:25+05:30 IST