ఇక సహించేది లేదు

ABN , First Publish Date - 2020-04-04T11:49:20+05:30 IST

ఇక సహించేది లేదు

ఇక సహించేది లేదు

నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

 సీఎం ఎడప్పాడి హెచ్చరిక

ఇతర రాష్ట్రాల కార్మికులకు పరామర్శ


చెన్నై, (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించి ప్రజలను కాపాడేందుకే రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నామని, అయితే ఆ ఉత్తర్వులను ఉల్లఘించి ప్రజలు రహదారుల్లో సంచరిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. నిషేధాజ్ఞలు విధించింది ప్రజలను చిత్రహింసలకు గురిచేయడానికి కాదని, కరోనా మహమ్మారి నుంచి కాపాడటానికేనని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు వారాలు 144 నిషేధాజ్ఞలు ఉల్లఘించి వీధుల్లోకి వచ్చి సంచరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి జైలు శిక్ష విధించడానికి కూడా వీలుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం చెన్నై ఆర్‌ఏపురంలోని కార్పొరేషన్‌ సామాజిక సంక్షేమ భవనంలో  ఉంటున్న పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులను ఆయన పరామర్శించారు. ఆ కార్మికులకు అధికారులు కల్పిస్తున్న సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వేళచ్చేరిలో బసచేస్తున్న పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులను కూడా ఎడప్పాడి పరామర్శించారు. మంత్రులు డి.జయకుమార్‌, ఎస్పీ వేలుమణి, కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రకాష్‌ తదితరులు ముఖ్యమంత్రితోపాటు పర్యటించారు.  అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలలో భాగంగా విధించిన నిషేధాజ్ఞల కారణంగా సొంతూళ్లకు వెళ్ళలేని పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులకు కార్పొరేషన్‌ సామాజిక సంక్షేమ భవనాల్లో ఆశ్రయం కల్పించి, వారికి ఆహారం, బట్టలు కూడా అందిస్తున్నామని చెప్పారు. స్వరాష్ట్రాలకు వెళ్ళలేక రాష్ట్రంలో ఉండిపోయిన 1.34 లక్షల మంది కార్మికులందరికీ బస, ఆహార, వస్త్ర సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తినిరోధించడానికే మరో రెండు వారాలపాటు 144 నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయని, కరోనా మహమ్మారి నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలంటే భౌతిక దూరం పాటించాలని, దాని కోసమే నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నామనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను చిత్రహింసలు పెట్టేందుకో, వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకో ఈ నిషేధాజ్ఞలు విధించలేదని, వారి ప్రాణాలను కాపాడాలనే సత్సంకల్పంతోనే నిషేధాజ్ఞలను అమలు చేయదలిచామని ఎడప్పాడి తెలిపారు.


ఈ నెల 14 వరకూ రాష్ట్రంలో ప్రజలంతా గృహనిర్బంధాన్ని నూటికి నూరుశాతం పాటించాలని, నిషేధాజ్ఞలు ఉల్లఘించి బయటికొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.  అత్యవసరాలకు తప్ప ప్రజలకు రహదారులపై సంచరించకూడదని, ఈ రెండు వారాలు పోలీసులు రహదారులలో పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తారని, వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటారని ఆయన వెల్లడించారు. గురువారం నుంచి రేషన్‌దుకాణాల్లో వెయ్యి రూపాయల నగదు, ఉచితంగా ఏప్రిల్‌ కోటా సరకుల పంపిణీ ప్రారంభమైందని, వీటి కోసం కార్డుదారులు దుకాణాల వద్ద గుంపులుగా వెళ్ళకుండా భౌతిక దూరాన్ని పాటించాలని చెప్పారు. రేషన్‌షాపుల్లో టోకెన్లు ఇచ్చేటప్పుడే వెయ్యి రూపాయలు అందజేస్తారని ఆయన తెలిపారు. ఈ నగదు, సరకుల పంపిణీ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని తెలిపారు. కరోనా వైరస్‌ సృష్టించనున్న ఆర్ధిక సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలో కోత విధించే ప్రసక్తే లేదని ఎడప్పాడి స్పష్టం చేశారు.

Updated Date - 2020-04-04T11:49:20+05:30 IST