వారికి కరోనా భయం లేదు.. రాత్రయితే చాలు.. గుంపులు గుంపులుగా చేరి..

ABN , First Publish Date - 2020-03-26T17:31:08+05:30 IST

గ్రామాల్లో సారా ఏరులై..

వారికి కరోనా భయం లేదు.. రాత్రయితే చాలు.. గుంపులు గుంపులుగా చేరి..

గ్రామాల్లో సారా ఏరులు

అధికారులు పట్టించుకోకపోవడంతో రెచ్చిపోతున్న అక్రమార్కులు

మందుబాబులకు దేహశుద్ధి చేస్తున్న స్థానికులు 


పెద్దాపురం(తూర్పు గోదావరి): గ్రామాల్లో సారా ఏరులై పారుతోంది.  ఎక్సైజ్‌ అధికారులు ఉదాశీనంగా వ్యవహరించడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సారా కాసి విక్రయాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇటీవల మద్యం దుకాణాలను మూసివేశారు. దీంతో ముందు బాబులకు మందు దొరకడం లేదు. ఈ పరిస్థితిని సారా విక్రయదారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎక్కడికక్కడ సారా కాస్తూ అడ్డదారిలో గ్రామాల్లోకి తరలిస్తున్నారు. ఈ రెండు మూడు రోజుల నుంచి సారా విక్రయాలు అధికమయ్యాయి. ప్రస్తుతం మద్యం అందుబాటులో లేకపోవడంతో మందుబాబులు సారాపై పడ్డారు. గుంపులు గుంపులు చేరి తెగ తాగేస్తున్నారు.


అసలే కరోనా భయంతో ప్రజలు వణికిపోతుంటే మందుబాబులకు అవేమి పట్టనట్టు గుంపులుగా వెళ్లి మద్యం తాగి ఊర్లపై పడుతున్నారు. రాత్రయితే చాలు తిరునాళ్లను తలపిస్తున్నట్టు ఉంటోందని గ్రామస్థులు వాపోతున్నారు. మండలంలోని జె.తిమ్మాపురం, కట్టమూరు, ఆర్‌బీ కొత్తూరు, మర్లావ, కాండ్రకోట తదితర గామాల్లో సారా ఏరులై పారుతోంది. పట్టించుకోవాల్సిన ఎక్సైజ్‌ అధికారులు మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆర్‌బీ కొత్తూరులో కొందరు గ్రామస్థులు విసుగుచెంది కర్రలు చేతబట్టి మందుబాబులకు బడిత పూజ చేస్తున్నారు. తమ గ్రామంలో మళ్లీ కనిపిస్తే సహించేది లేదని గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 


గ్రామాల్లో సారా బట్టీలు

ఇటీవల కాలంలో గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో సారా బట్టీలు ఎక్కువయ్యాయి. తెల్లవారుజామున, అర్ధరాత్రి సమయాల్లో కొంతమంది అక్కడ సారా కాస్తున్నారు. కాసిన సారాను లీటర్లుగా ప్యాకింగ్‌ చేసి తరలిస్తున్నారు. తర్వాత చిన్నచిన్న ప్యాకెట్లలో మందుబాబులకు విక్రయిస్తున్నారు. ఈ తంతు చాలా గుట్టుగా సాగిపోతోంది. ఎక్సైజ్‌ అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. 

Updated Date - 2020-03-26T17:31:08+05:30 IST