కరోనాను జయించిన భార్యాభర్తల మనోగతం.. ఆ 18 రోజులూ...

ABN , First Publish Date - 2021-05-16T17:10:39+05:30 IST

ఆ వార్త వినగానే షాక్‌కు గురయ్యారు. అనంతరం

కరోనాను జయించిన భార్యాభర్తల మనోగతం.. ఆ 18 రోజులూ...

  • మా వల్ల మరో ముగ్గురికి.. చాలా బాధ పడ్డాం
  • తిరుపతి నుంచి రాగానే లక్షణాలు
  • పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాక హోంక్వారంటైన్‌
  • 18 రోజులు ఇంట్లోనే ఉండి కోలుకున్నాం 

హైదరాబాద్/సరూర్‌నగర్‌ : ఆ భార్యా భర్తలు.. గత నెలలో దైవ దర్శనం నిమిత్తం తిరుపతికి వెళ్లి వచ్చారు. రాగానే జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు. అనుమానంతో ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ వార్త వినగానే షాక్‌కు గురయ్యారు. అనంతరం మనో నిబ్బరంతో కరోనాను జయించారు మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లోని నందిహిల్స్‌కు చెందిన రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కొత్తకాపు నాగభూషణ్‌రెడ్డి (64), భార్య విజయలక్ష్మి(55). 


కరోనాను ఎదుర్కొన్న తీరు వారి మాటల్లోనే..

ఏప్రిల్‌లో మేమిద్దరం తిరుపతికి వెళ్లి వచ్చాం. మరుసటి రోజు నుంచి తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు మొదలయ్యాయి. మాకు పరిచయస్తుడైన లాల్‌దర్వాజ పీహెచ్‌సీ వైద్యుడు లక్ష్మణ్‌ను సంప్రదించాం. అక్కడే కరోనా పరీక్ష చేయించారు. ఇద్దరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విషయం తెలియగానే తెలియని భయాందోళన. శరీరమంతా మొద్దుబారినట్టయింది. ఒక దశలో మాకేమీ అర్థం కాలేదు. డాక్టర్‌ లక్ష్మణ్‌ ఎంతో ధైర్యం చెప్పారు. ‘కరోనా’ అనే పదాన్ని మనస్సులో నుంచి తీసేసి, మామూలు జ్వరంలా భావించి మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకొమ్మని చెప్పారు. యూపీహెచ్‌సీలోనే ఇద్దరికీ మందులు ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు విషయం చెప్పి హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాం.


ఆ 18 రోజులూ...

18 రోజుల పాటు మేమిద్దరం హోం క్వారంటైన్‌లో గడిపాం. నందిహిల్స్‌లోని మా పెద్ద కూతురు ఇంట్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని డబుల్‌ బెడ్‌రూమ్‌ పోర్షన్‌లో అద్దెకుంటాం. మాకు క్వారంటైన్‌కు ఇబ్బంది ఏర్పడలేదు. కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రులు ఎంతగానో సహకరించారు. భోజనం వండి ఇంటికి పంపించారు. చికెన్‌, మటన్‌, గుడ్లు, డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకున్నాం. రుచి, వాసన కోల్పోయినందున తినబుద్ది కాలేదు. ఏం తినాలో అర్థం కాలేదు. ఇమ్యూనిటీ పెంచుకోవాలి కాబట్టి ఇష్టం చేసుకుని అన్నీ తినేవాళ్లం. కషాయం, మిరియాల పొడి కలిపిన పాలు తాగేవాళ్లం. పండ్లు బాగా తిన్నాం. యూపీహెచ్‌సీలో ఇచ్చిన మందులు వాడాం. రోజూ పల్స్‌రేట్‌, ఆక్సిజన్‌ లెవెల్స్‌ చెక్‌ చేసుకుంటూ టైం ప్రకారం మందులు వేసుకునేవాళ్లం.


అప్పుడప్పుడు విపరీతమైన తల నొప్పి వచ్చేది. వారం తర్వాత ఆ సమస్య దూరమైంది. బంధువులు, స్నేహితులు రోజూ ఫోన్‌ చేసి ధైర్యం చెప్పేవారు. అందరితో మాట్లాడడం వలన కరోనా భయం పోయింది. మనోధైర్యంతో దానిని జయించాం. కరోనా అనగానే భయం వాస్తవమేగానీ, నిజంగా భయపడాల్సిన అవసరం లేదు. దానిని కూడా మామూలు జ్వరంలానే భావించాలి. రెండు రోజుల తర్వాత మేం అదే నిర్ణయానికి వచ్చి 18 రోజుల్లోనే మళ్లీ మామూలు స్థితికి చేరుకున్నాం. 18 రోజుల తర్వాత టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌ వచ్చింది. అప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ప్రస్తుతం కొంత నీరసంగా ఉన్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలేమీ లేవు. 


ఇద్దరు కూతుళ్లకు, అల్లుడికి కూడా...

మేం తిరుపతి నుంచి వచ్చాక మా చిన్న కూతురు మా ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు సైతం జ్వరం రావడంతో టెస్ట్‌ చేయిస్తే పాజిటివ్‌గా తేలింది. మేం ఉండే ఇంట్లో పై పోర్షన్‌లో నివసించే పెద్ద కూతురికి, అల్లుడికి కూడా జ్వరం రాగా, వారు సైతం పరీక్ష చేయించుకున్నారు. వారికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముగ్గురూ పై పోర్షన్‌లో కలిసి ఉన్నారు. మేం ఇద్దరం కింది పోర్షన్‌లో ఉన్నాం. వారు కూడా 18 రోజుల హోం క్వారంటైన్‌  తర్వాత టెస్ట్‌ చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. మా వల్ల మరో ముగ్గురు కరోనా బారిన పడడంతో చాలా బాధ పడ్డాం. బంధుమిత్రుల ఆశీస్సులు, దేవుడి దయ వల్ల ఆ మహమ్మారి బారి నుంచి కోలుకున్నాం. ఆస్పత్రుల్లో అడ్మిట్‌ అయ్యే పరిస్థితి రానందుకు చాలా సంతోషించాం. ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం. 

Updated Date - 2021-05-16T17:10:39+05:30 IST