కరోనాను జయించిన దంపతుల మనోగతం...

ABN , First Publish Date - 2021-05-15T07:00:06+05:30 IST

నా పేరు నూనె శ్రీనివాస్‌ (36)

కరోనాను జయించిన దంపతుల మనోగతం...
నూనె శ్రీనివాస్‌, రాజ్యలక్ష్మి దంపతులు

  • మంచినీళ్లు కూడా చేదయ్యాయి..
  • మాకేమైనా జరిగితే పిల్లల పరిస్థితేంటన్న ఆలోచనే ఉండేది
  • మృత్యువు దాకా వెళ్లి తిరిగొచ్చాం
  • ఇప్పటికీ నీరసంగానే ఉంటోంది


హైదరాబాద్/కుత్బుల్లాపూర్‌ : నా పేరు నూనె శ్రీనివాస్‌ (36), సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాను. ఇటీవల నా భార్య రాజ్యలక్ష్మి (35)కి, అనంతరం నాకు కొవిడ్‌-19 సోకింది. దీంతో మొదట్లో తీవ్ర మానసిన ఒత్తిడికి లోనయ్యాం. వైరస్‌ తీవ్రత ఎక్కువ గా ఉండడంతో వైద్యులు నాకు నయం అవుతుం దో, లేదో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. భగవంతుడి దయ, స్నేహితుల సహకారంతో మనోధైర్యాన్ని కూడగట్టుకుని కరోనాపై పోరాడి గెలిచాం. 


ఆ అనుభవాలు వారి మాటల్లోనే...

ఏప్రిల్‌ 14 : నా భార్యకు తీవ్ర జ్వరం (102) వచ్చింది. సాధారణ జ్వరం అనుకుని డోలో 650 వేసుకున్నారు. 

ఏప్రిల్‌ 15 : జ్వరం తగ్గుతూ, పెరుగుతూ ఉంది. దగ్గు ప్రారంభమైంది. దీంతో మాత్రలను క్రమం తప్పకుండా వాడారు. రెండో రోజు నాకు కూడా జ్వరం వచ్చింది. నేను కూడా మాత్రలు వేసుకున్నాను. 

ఏప్రిల్‌ 16 : పరిస్థితి అలాగే కొనసాగుతూ ఆహారం తినబుద్ధేసేది కాదు. దీంతో కరోనా సోకిందనే అనుమానంతో పరీక్షలు చేయించుకుంటే ఇద్దరికీ పాజిటివ్‌ వచ్చింది. మా అమ్మాయికి పరీక్ష చేయిస్తే నెగెటివ్‌ వచ్చింది. లక్షణాలు ఉండడం వల్ల వైద్యుల సూచనల మేరకు మందులు వేసుకోమన్నాం.

ఏప్రిల్‌ 17 : నా భార్యకు అధికంగా వాంతులు అయ్యాయి. ఇద్దరం కూడా రోజులో 15 గంటలు నిద్రకే పరిమితమయ్యాం. ఆహారం సహించేది కాదు. ఓపిక నశించిపోయింది. అంతా అయోమయం, అగమ్యగోచరంగా మారింది. 

ఏప్రిల్‌ 18 : వాసన, రుచి కోల్పోయాం. మంచినీళ్లు కూడా చేదుగా అనిపించేవి.  నేను కేవలం రెండు అడుగులు వేస్తే దానికి సరిపడా ఊపిరి తీసుకోవడానికి సుమారు 5 నిమిషాల సమయం పట్టేది. 10 మీటర్ల దూరం నడిచేందుకు కనీసం అరగంట సమయం తీసుకోవల్సి వచ్చేది. నా భార్యకు కళ్లు పూర్తిగా ఎరుపు రంగులోకి వచ్చాయి. 22వ తేదీ వరకూ ఇదే పరిస్థితి ఉంది. ఆరోగ్యం మరింత క్షీణించేది. ఇదే విషయాన్ని స్నేహితులకు చెప్పాను. వారు వెంటనే వచ్చి అదే రోజు షాపూర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 

ఏప్రిల్‌ 23 : ఆస్పత్రిలో చేరాము. అప్పటికే మా ఇద్దరి శాచురేషన్‌ లెవెల్స్‌ (రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి) 80 నుంచి 85 మధ్యలో ఉంది. ఆస్పత్రి బయట నుంచి లోపలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. భయం వల్ల తీవ్ర ఉక్కబోతతో చమటలు కారుతూనే ఉన్నాయి. ఇలా 6 రోజుల వరకు ఆస్పత్రిలో కృత్రిమ ఆక్సిజన్‌తోనే ఇద్దరం కూడా చికిత్స పొందాం. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ అవడంతో ఇద్దరికీ చెరో 6 డోసులు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఇచ్చారు. చికిత్స సమయంలో బెడ్‌పై పక్కకు తిరిగి పడుకున్నా ఊపిరి ఆడేదికాదు. చికిత్సతో పాటు వైద్యులు, స్నేహితులు చేసిన సూచనల మేరకు మనోధైర్యాన్ని కూడగట్టుకొని భయాన్ని పోగొట్టుకోవడంతో కేవలం 6 రోజుల్లోనే ఆస్పత్రి నుంచి బయటపడగలిగాం. ఏప్రిల్‌ 28న డిశ్చార్జి అయ్యాం.


25 కేజీల పుచ్చకాయలు తిన్నాం..

వైరస్‌ వల్ల ఆస్పత్రిలో ఇచ్చిన ఆహారం రుచించేది కాదు. బయటి నుంచి నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు తెప్పించుకుని పెట్టుకునే వాళ్లం. ఆకలి వేసినప్పుడల్లా పుచ్చకాయ ముక్కలు తినడంతో కొంత రుచి తెలవడంతో పాటు కడుపు నిండేది. ఆస్పత్రిలో ఉన్న 6 రోజుల్లో సుమారు 20 నుంచి 25 కేజీల పుచ్చకాయలు తిన్నామంటే మా చికిత్సలో వాటి పాత్ర అర్థం చేసుకోవచ్చు. 


తమ్ముడి మరణంతో..

నేను, నా భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రమాదవశాత్తు తమకు ఏమైనా అయితే కూతురు (14), కొడుకు (3) పరిస్థితి ఏంటనే ఆలోచనలు మమ్మల్ని వేధించేవి. అదే సమయంలో మా తమ్ముడు (పెద్దనాన్న కుమారుడు) (30) కొవిడ్‌-19తో మరణించాడనే వార్తతో గుండె దడ పెరిగింది. శరీరమంతా చమటలు పట్టి దుస్తులు తడిసి ముద్దయిపోయాయి. నెమ్మదిగా కోలుకొని మాకేమీ కాదులే అని సర్ది చెప్పుకున్నాం. ఆ భగవంతుడి దయ, వైద్యుల చికిత్సతో మహమ్మారి నుంచి బయటపడ్డాం. వైద్యానికి మా ఇద్దరికీ కలిసి ఇప్పటి వరకు రూ. 7 లక్షలు ఖర్చయ్యాయి. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ సాధారణ జీవితం గడుపుతున్నందుకు ఆనందంగా ఉంది.


నా భార్య విషయంలో భయం వేసేది..

నా భార్యకు 2005లో టీబీ రావడంతో ఊపిరితిత్తులు అప్పట్లో కొద్దిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వైరస్‌ సోకి మళ్లీ ఊపిరితిత్తులపై ప్రభావం చూపడం వల్ల చాలా భయం వేసింది. తెమడతో కూడిన దగ్గు వస్తుండడంతో నా భార్య కోలుకోవడానికి నాకంటే చాలా సమయం పట్టింది. మంచినీటి రుచి తెలిసేందుకు కనీసం 20 రోజులు పట్టింది. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చి 13 రోజులు అయినా కూడా వైద్యుల సూచనతో ఆక్సిజన్‌ సిలిండర్‌ను ఏర్పాటు చేసుకుని రోజూ మూడు పూటలా ఒక్కో గంట చొప్పున ఆమెకు ఆక్సిజన్‌ను అందిస్తున్నాం. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. మందులు వాడడం వల్ల నీరసం ఎక్కువగా వస్తోంది. పౌష్ఠికాహారం తీసుకుని, వ్యాయామం, సరిపడ నిద్ర ఉంటే నీరసం తగ్గిపోతుందని వైద్యులు సూచించారు.

Updated Date - 2021-05-15T07:00:06+05:30 IST