మాస్క్‌ మస్కా!

ABN , First Publish Date - 2020-04-04T09:01:40+05:30 IST

ప్రాణాలకు తెగించి కరోనా బాధితుల ప్రాణం నిలిపే వైద్యసిబ్బంది రక్షణకు సాధారణ మాస్కులు కూడా లేవు..

మాస్క్‌ మస్కా!

రాజకీయ నేతలకు, ఉన్నతాధికారులకు ఎన్‌95 మాస్కులు 

ప్రాణదాతలకు సాధారణ మాస్కులు?

పీపీఈలు, ఇతర రక్షణ పరికరాలకు కొరతే 

ఇలాగేనా కరోనాతో యుద్ధం!


ప్రాణాలకు తెగించి కరోనా బాధితుల ప్రాణం నిలిపే వైద్యసిబ్బంది రక్షణకు సాధారణ మాస్కులు కూడా లేవు.. పర్యవేక్షించే ఉన్నతాధికారులకు, ఏ అవసరం లేని రాజకీయ నాయకులకు మాత్రం నాణ్యతతో కూడిన ఎన్‌95 మాస్కులు.. కరోనాను నియంత్రించేదిలాగేనా? 


విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా మహమ్మారి కోరలు చాచి తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రోగులకు, అనుమానితులకు వైద్య సేవలందిస్తూ, బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అహరహరం శ్రమిస్తున్నారు వైద్యులు, వైద్యసిబ్బంది. అయితే వీరి రక్షణకు అవసరమైన నాణ్యమైన ఎన్‌95 మాస్కులు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ)ను అవసరమైనన్ని అందుబాటులో ఉంచడంలో జిల్లా యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. అదే సమయంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, సందర్శకులు, స్నేహితులకు మాత్రం నాణ్యమైన ఎన్‌95 మాస్కులు అందుబాటులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు వచ్చిన నాణ్యమైన ఎన్‌95 మాస్కులను వైద్యులు, వైద్య సిబ్బందికి ఇవ్వకుండా కొంతమంది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు అందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


 విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, గన్నవరంలోని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రులను పూర్తిస్థాయి కోవిడ్‌ ఆసుపత్రులుగా ప్రభుత్వం మార్చింది. పాజిటివ్‌ రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. అనుమానితులను ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లలోను, విదేశాల నుంచి జిల్లాకు వచ్చినవారందరిని గృహనిర్బంధంలోనూ ఉంచి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి పరిశీలిస్తున్నారు. కోవిడ్‌ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు, వైద్యసిబ్బంది, ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు, పారిఽశుధ్య సిబ్బంది పాజిటివ్‌ రోగులకు సేవలందిస్తుండగా.. అనుమానితులకు ప్రభుత్వ పారామెడికల్‌ సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు వాలంటీర్లు సేవలందిస్తున్నారు.


వీరితోపాటు ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కోసం నాణ్యమైన ఫేస్‌మాస్కులు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌, చేతులకు గ్లౌజులు, పరిశుభ్రతకు శానిటైజర్లు పరికరాలను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వైద్యులు, వైద్యసిబ్బందికి నాణ్యత లేని సాధారణ సర్జికల్‌ మాస్కులు, డిస్పోజబుల్‌ గ్లౌజులు ఇస్తూ, వారిని ఆపదలోకి నెట్టేస్తోందన్న విమర్శ వైద్యవర్గాల నుంచే వినిపిస్తోంది. 


కోవిడ్‌ ఆసుపత్రిలోనూ ఇదీ పరిస్థితి 

విజయవాడ కోవిడ్‌ ఆసుపత్రి (ప్రభుత్వ ఆసుపత్రి)లో వైద్యులకు కూడా అవసరమైనన్ని పీపీఈలు అందుబాటులో లేవు. దీంతో ఉదయం రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లే వైద్యులు పీపీఈలను ధరిస్తే.. ఇక ఆ రోజంతా అదే పీపీఈలో ఉండాలని, పదేపదే మార్చడానికి వీల్లేదంటూ ఉన్నతాధికారులు ఆంక్షలు విధించినట్లు చెబుతున్నారు. రోజంతా పీపీఈలోనే ఉండి విధులు నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని వైద్యులు వాపోతున్నారు. ప్రత్యేక ఐసీయూలు, ఐసోలేషన్‌ వార్డుల్లో పనిచేస్తున్న నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లు, పారిశుధ్య కార్మికులకు సాధారణ సర్జికల్‌ మాస్కులనే సరఫరా చేస్తుండటంతో వారంతా పాజిటివ్‌ రోగుల దగ్గరకు వెళ్లి సేవలు అందించేందుకు జంకుతున్నారు.


దీంతో చికిత్స పొందుతున్న పాజిటివ్‌ రోగులకు సెలైన్లు మార్చాలన్నా.. షుగరు, బీపీలు పరీక్షించాలన్నా నాలుగో తరగతి ఉద్యోగులైన ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలతోనే చేయిస్తున్నారు. పాజిటివ్‌ రోగుల మంచాల దగ్గర పేరుకుపోతున్న బయో మెడికల్‌ వేస్ట్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వార్డులను శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇక జిల్లాలో ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలతోపాటు క్వారంటైన్‌ సెంటర్లు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు, వాలంటీర్లకు ఫేస్‌మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు కూడా ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్నారు. గట్టిగా అడిగితే ఉన్నతాధికారుల నుంచి బెదిరింపులు వస్తుండటంతో చేసేదేమీ లేక భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. 


ఎన్‌95 మాస్కులు ఏమైనట్టు? 

కరోనా రోగులకు వైద్యసేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి ఇచ్చేందుకు ఎన్‌95 మాస్కులను సేకరించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖాఽధికారులకు సరఫరా చేసే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎంఐడీసీ)కు అప్పగించింది. ఆ సంస్థ అధికారులు ఇటీవల జిల్లాకు దాదాపు 5వేల ఎన్‌95 మాస్కులను సరఫరా చేసినప్పటికీ.. అత్యధికంగా రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు, వీఐపీలకు అనధికారికంగా అందజేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని వైద్యుల, సిబ్బంది రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యవర్గాలు కోరుతున్నాయి. 


Updated Date - 2020-04-04T09:01:40+05:30 IST