నేడు కరోనా టీకా

ABN , First Publish Date - 2021-01-16T04:49:37+05:30 IST

కరోనాకు టీకా ఎప్పుడు వస్తుందా.. టీకా ఎప్పుడు వేస్తారా..? అంటూ ఎదురు చూసిన జిల్లా వాసుల కల నెరవేరుతోంది.

నేడు కరోనా టీకా

10 నెలలుగా ఎదురుచూపు

ఇప్పటికే 63,814 మందికి కొవిడ్‌ వైరస్‌

587 మంది మృత్యువాత

టీకా రాకతో జిల్లావాసుల్లో ఉత్సాహం

26 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ 

రోజుకు 100 మందికి చొప్పున..

జీజీహెచ్‌లో లాంఛనంగా ప్రారంభం


నెల్లూరు(వైద్యం) జనవరి 15 : కరోనాకు టీకా ఎప్పుడు వస్తుందా.. టీకా ఎప్పుడు వేస్తారా..? అంటూ ఎదురు చూసిన జిల్లా వాసుల కల నెరవేరుతోంది.  శనివారం కరోనా టీకాను జిల్లా వ్యాప్తంగా వేయనున్నారు. 26 ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ టీకాను ఎంపిక చేసిన వారికి వేయనున్నారు.  ప్రధాని మోదీ ఉదయం 10.30 గంటలకు లాంఛనంగా టీకా వేయడాన్ని ప్రారంభిస్తారు. దీనికి అనుగుణంగా జిల్లాలోని నిర్ణయించిన ఆరోగ్య కేంద్రాల్లో  టీకాను వేస్తారు. గత ఏడాది కరోనా ప్రభావం జిల్లాపై ఎక్కువగానే ఉండింది దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 63,814 మంది కరోనా పాజిటివ్‌కు గురయ్యారు.  కరోనా వైరస్‌ 587 మందిని బలి తీసుకుంది. గత ఏడాది మార్చి 9వ తేదీన జిల్లాలో తొలి కరోనా కేసు నమోదయింది. ఇది రాష్ట్రంలోనే తొలి కేసుగా గుర్తింపు పొందింది. వ్యాధి తీవ్రత జూలైలో 8,200గా ఉండగా, ఆగస్టులో 24,177 మంది, సెప్టెంబరులో 18,234, అక్టోబరులో 9,689 మంది కరోనా కాటుకు గురయ్యారు. ఈ పరిస్ధితిలో కరోనా టీకా కోసం ఎదురు చూస్తున్న జిల్లా ప్రజల ఆశలకు శనివారం నెరవేరనున్నాయి. మొదటి విడత 29,301 మందికి టీకా వేస్తారు. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేస్తుండ గా, రెండో విడత పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీ, పోలీసులకు టీకా వేస్తారు. మూడో విడత జిల్లా ప్రజలకు టీకా వేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈ నేపఽథ్యంలో టీకా పట్ల జిల్లా వాసుల్లోనూ ఉత్సాహం నెలకొంది. 


 26 కేంద్రాల్లో ఏర్పాట్లు 


జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో కరోనా టీకా వేసేందుకు అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. గత బుధవారం జిల్లాకు కొవిషీల్డ్‌ వాక్సిన్‌ 38,500 డోసుల కరోనా టీకా రాగా, అదే రోజు సాయంత్రం జిల్లాలో కరోనా టీకా వేసే అన్ని ఆరోగ్య కేంద్రాల కు తరలించారు. ఆయా కేంద్రాలలో టీకా వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో కరోనా టీకా వేసే కేంద్రాలను పరిశీలిస్తే.. నెల్లూరులోని జీజీహెచ్‌, జనార్దన్‌రెడ్డి కాలనీలోని (పట్టణ ఆరోగ్య కేంద్రం), కోటమిట్ట, యూకో నగర్‌ (పట్టణ ఆరోగ్య కేంద్రం) ఉన్నాయి. కావలిలోని (ఏరియా ఆసుపత్రి), కోవూరుపల్లి (ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం), విడవలూరు (పీహెచ్‌సీ), అల్లూరు (సీహెచ్‌సీ), కోవూరు (సీహెచ్‌సీ), సూళ్లూరుపేట (సీహెచ్‌సీ), నాయుడుపేట (సీహెచ్‌సీ), డీవీ సత్రం (పీహెచ్‌సీ), వెంకటగిరి (సీహెచ్‌సీ), రాపూరు (సీహెచ్‌సీ), డక్కిలి (పీహెచ్‌సీ), కోట (సీహెచ్‌సీ), గునపాటిపాళెం (పీహెచ్‌సీ), చిట్టేడు (పీహెచ్‌సీ), వెంకటాచలం (సీహెచ్‌సీ), ఉదయగిరి (సీహెచ్‌సీ), నర్రవాడ (పీహెచ్‌సీ), ఆత్మకూరు (జిల్లా ఆసుపత్రి), సంగం (పీహెచ్‌సీ), సౌత్‌మోపూరు (పీహెచ్‌సీ), పొదలకూరు (సీహెచ్‌సీ), కలువాయి (పీహెచ్‌సీ)లలో కరోనా వ్యాక్సిన్‌ను వేయనున్నారు. 


రోజుకు 100 మంది చొప్పున..


 జిల్లా వ్యాప్తంగా మొదటి విడత కింద 29.301 మందికి టీకా వేయాలని అధికారులు నిర్ణయించారు. వీరంతా ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మొదటిగా ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు, సిబ్బందితోపాటు ఐసీడీఎస్‌ సిబ్బందికి కూడా  టీకా వేస్తారు. ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 100 మందికి వంతున జిల్లాలోని 26 కేంద్రాలలో మొత్తం 2600 మందికి టీకా వేస్తారు. టీకాకు ఎంపిక చేసిన వారి సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌ కూడా పంపారు.  జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో 11 కేంద్రాల్లో లాంఛనంగా టీకా కార్యక్రమం 10.30 గంటలకు ప్రారంభ మవుతుండగా, మిగిలిన వాటిలో యఽథావిధిగా 9 గంటలకే  టీకా వేయటం ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 


టీకా వేసేదెలాగంటే..


18 ఏళ్ల పైబడిన వారికే టీకా వేయాలని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. గర్బిణులకు, చిన్నారులకు టీకా వేయరు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి  కూడా వేయరు. మొదట రిజిస్ట్రేషన్‌ చేయించకున్న వారి పేర్లను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తారు. ఇందుకోసం ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు  ఉంటారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్ధితిని పరిశీలిస్తారు. టీకా గురించి వివరించిన తర్వాత 0.50 మిల్లీలీటర్ల టీకా వేస్తారు. ఆ తర్వాత అరగంట వరకు వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక గదిలో వారిని ఉంచుతారు. వారికి ఏమైనా అరోగ్య సమస్యలు ఎదురయితే వెంటనే వైద్య సేవలు అందిస్తారు. ఇందుకోసం వైద్యుల పర్యవేక్షణలో ఒక్కో కేంద్రంలో మహిళా పోలీసు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్‌ఎం లేదా స్టాఫ్‌ నర్సు, అంగన్‌వాడీ, ఆశావ ర్కర్లు అందుబాటులో ఉండి టీకా వేస్తారు. మొదటి డోసు టీకా వేయించుకున్న వారికి కొవిషీల్డ్‌ రకం టీకాను 14వ రోజుల తర్వాత రెండో డోస్‌ వేస్తారు. 


నేడు జీజీహెచ్‌లో ప్రారంభం


 నెల్లూరు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కలెక్టర్‌ చక్రధర్‌బాబుతోపాటు ప్రజా ప్రతినిధులు కరోనా టీకాను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇందుకు అన్ని ఏర్పాట్లను  చేశారు. ప్రత్యేకంగా టీకా వల్ల ఎలాంటి అరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే వైద్య చికిత్సలు అందించేందుకు 50 మంది వైద్య బృందం అందుబాటులో ఉంటారు. కేవలం ఈ కేంద్రంలోనే కాకుండా మిగిలిన కేంద్రాల్లో కూడా తీవ్ర అరోగ్య సమస్యలు ఎదురయితే బాధితులను జీజీహెచ్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యబృందం  సిద్ధంగా ఉంది. 


అన్ని సిద్ధం చేశాం 


శనివారం కరోనా టీకా వేసేందుకు అన్ని సిద్ధంగా ఉన్నాయి. వైద్యులు పర్యవేక్షణలో టీకా వేస్తారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యులు, సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

- డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో



 పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్‌


నెల్లూరు(హరనాథపురం), జనవరి 15 : జిల్లాలో శనివారం నుంచి జరుగనున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు చెప్పారు. శుక్రవారం కలెక్టర్‌ బంగ్లాలో ఈ వ్యాక్సినేషన్‌పై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణం గా  వాక్సినేషన్‌ జరుగుతుందన్నారు. 26 కేంద్రాల్లో ఈ కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా  ప్రధాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ లైవ్‌ కార్యక్రమాన్ని ప్రతి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌  కేంద్రంలో ఏర్పాటు  చేయాలన్నారు.  వ్యాక్సినేషన్‌ వేసేవారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారాన్ని  అందించాలన్నారు. ఎంత మందికి ఏయే రోజు వ్యాక్సినేషన్‌ ఎక్కడెక్కడ వేసేది వివరాలు తెలపాలన్నారు.   సమీక్షలో డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి, ఏసీఎస్‌ఆర్‌ సూపరిం టెండెంట్‌ నిర్మల, డాక్టర్‌ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T04:49:37+05:30 IST