కరోనా వ్యాక్సినే గేమ్‌ చేంజర్‌

ABN , First Publish Date - 2020-06-24T07:54:43+05:30 IST

ఒకప్పుడు కొన్ని కోట్ల మంది ప్రాణాలను బలిగొన్న మశూచి.. ఇప్పుడు మచ్చుకైనా లేదు! కాళ్లలోని సత్తువ లాగేసి జీవితాంతం నరకం చూపే పోలియో..

కరోనా వ్యాక్సినే  గేమ్‌ చేంజర్‌

ఇప్పటికే ఉన్న మందులు దివ్యౌషధాలు కావు

రెమ్డెసివిర్‌, ఫావిపిరావిర్‌ ప్రభావం కొంతే

అద్భుత ఔషధాలుగా ప్రచారమవుతున్న

మందులపై వైద్యనిపుణుల అభిప్రాయం


ఒకప్పుడు కొన్ని కోట్ల మంది ప్రాణాలను బలిగొన్న మశూచి.. ఇప్పుడు మచ్చుకైనా లేదు! కాళ్లలోని సత్తువ లాగేసి జీవితాంతం నరకం చూపే పోలియో.. మన దేశంలో ఎప్పుడో పోయింది! కొన్ని దేశాల్లో అక్కడక్కడా ఒకటి రెండు కేసులు తప్ప దాని ఉనికే లేదు!! సమర్థమైన వ్యాక్సిన్లతోనే ఆ మహమ్మారుల నివారణ సాధ్యమైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లో విధ్వంసం సృష్టిస్తున్న కరోనాకూ వ్యాక్సిన్‌ కనుగొంటేనే దాని ఆట కడుతుంది! కరోనాపై పోరులో సిసలైన గేమ్‌ చేంజర్‌ అదే! అంతే తప్ప.. కొద్దిరోజులుగా ‘కరోనాకు మందు’ పేరుతో ప్రచారంలోకి వస్తున్న ఔషధాలన్నీ ప్రయోగాత్మకంగా ఇస్తున్నవే తప్ప అవే దివ్యౌషధాలు కావు. గేమ్‌ చేంజర్లు అంతకన్నా కావు!! ఇది వైద్యులు చెబుతున్న మాట.ఫాబి ఫ్లూ, కొవిఫర్‌, సిప్రెమి.. కరోనాకు మందు వచ్చేసిందన్న స్థాయిలో నాలుగైదు రోజులుగా జరుగుతున్న ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తున్న ఔషధాల పేర్లు ఇవి. వీటిలో ఫాబి ఫ్లూ ఔషధాన్ని గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ తయారుచేసింది.


కరోనా సోకినవారిలో కొద్దిపాటి లక్షణాలున్నవారి నుంచి తీవ్ర లక్షణాలున్నవారికి వాడే మందు ఇది. ఇక, రెమ్డెసివిర్‌ మందు జనరిక్‌ వెర్షన్ల తయారీకి హెటెరో, సిప్లా సంస్థలకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించింది. హెటెరో సంస్థ కొవిఫర్‌ పేరుతో, సిప్లా సంస్థ సిప్రెమి పేరుతో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తేనున్నాయి. అయితే.. ఇవన్నీ కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నవారికి ప్రయోగాత్మకంగా వాడే మందులే తప్ప.. మనశరీరంలోని కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే దివ్యౌషధాలు కావని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌-19కు లక్షణాల ఆధారంగా చేస్తున్న చికిత్సే తప్ప.. ఆ వైరస్‌ బారి నుంచి కాపాడే సమర్థమైన చికిత్స, వ్యాక్సిన్‌ ఏదీ అందుబాటులోకి రాలేదని ఎయిమ్స్‌ (ఢిల్లీ)లోని ‘సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ మెడిసిన్‌’ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంజయ్‌ రాయ్‌ స్పష్టం చేశారు. ‘‘ఇదుగో.. కొవిడ్‌-19కు ఇదీ ప్రభావవంతమైన మందు అని చెప్పదగ్గ ఔషధమేదీ ఇప్పటిదాకా లేదు. అలాంటిది వచ్చేదాకా ఏ ఔషధాన్నీ ‘గేమ్‌ చేంజర్‌’గా పేర్కొనరాదు.


ఇప్పుడు అనుమతి ఇచ్చిన మందులు కూడా ఎంతవరకూ ప్రభావవంతమైనవో భవిష్యత్తులో తెలుస్తుంది.’’ అని ఆయన వివరించారు. ఫోర్టిస్‌ ఆస్పత్రి (ఢిల్లీ)లోని పల్మనాలజీ అండ్‌ స్లీప్‌ డిజార్డర్స్‌ విభాగ సంచాలకులు డాక్టర్‌ వికాస్‌ మౌర్యదీ అదే మాట. ‘‘రెమ్డెసివిర్‌, ఫావిపిరావిర్‌ ఔషధాలను ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడేవారికి వినియోగిస్తున్నారు. అవి వైరల్‌ లోడ్‌ను (శరీరంలోని వైరస్‌ సంఖ్యను) తగ్గిస్తాయని గతంలోనే రుజువైంది. ఈ క్రమంలోనే, కొవిడ్‌-19 పేషెంట్లకు వాటితో ఏమైనా ఉపశమనం ఉంటుందేమో కనుక్కొనేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగని వాటిని వినియోగించినవారంతా కోలుకుంటారని కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఇదొక సానుకూల పరిణామం. ఎందుకంటే.. ఏమీ లేని స్థితి కన్నా ఏదో ఒక ఆశ ఉన్న స్థితి నయం కదా. అయితే, ఈ రెండు ఔషధాలపై చేసిన ప్రయోగాలు పరిమితం. కాబట్టి వాటిని గేమ్‌ చేంజర్స్‌ అనకూడదు’’ అని మాక్స్‌ హెల్త్‌ కేర్‌కు చెందిన డాక్టర్‌ రొమ్మెల్‌ టికూ అన్నారు. ‘‘ప్రస్తుతానికి కొవిడ్‌-19కు నిర్ణీత చికిత్స అంటూ ఏమీ లేదు. అలాగని, ఏదో ఒక మందు వచ్చేదాకానో, ప్రయోగాలు పూర్తయ్యేదాకానో ఆగలేం కదా. అలా ఆగితే ఎంతో మంది ప్రాణాలుకోల్పోతారు. అందుకే.. అత్యవసర వినియోగానికి వీటిని అనుమతించారు’’ అని వివరించారు.  


మామూలు చికిత్సతోనే..

నిజానికి ఇన్నాళ్లూ ఈ మందులేవీ లేకుండానే చాలామంది కోలుకున్నారు. ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చిన మందులన్నీ లక్షణాలు తీవ్రమైనవారికి తప్ప.. మామూలు పేషెంట్లకు మామూలు చికిత్సతోనే నయమైపోతోంది. జ్వరం వస్తే పారాసిటమాల్‌, గొంతునొప్పి ఉంటే అజిత్రోమైసిన్‌, ఒక కోర్సుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడడం వల్లనే చాలా మందికి నయమైపోయింది. అలా కొన్ని వేల మంది ఇప్పటిదాకా ఇళ్లకు వెళ్లారు. వారి చికిత్సకు రోజుకు రూ.500 లోపు మాత్రమే ఖర్చయ్యేది. ఈ ఔషధాలేవీ రాకముందు చాలా మంది ఆక్సిజన్‌ చికిత్సతో కోలుకున్నారు. వెంటిలేటర్‌ పెట్టేస్థాయికి వెళ్లాక కోలుకున్న వారున్నారు. ఇలాంటివారికి వేల రూపాయలు ఖర్చుచేయాల్సి వచ్చేది. ఇప్పుడు వచ్చిన మందులు కూడా ఇలాంటివారికే తప్ప అతి స్వల్ప లక్షణాలున్నవారికి, అసలు లక్షణాలు లేనివారికి అవసరం లేదు.


-సెంట్రల్‌ డెస్క్‌

రెమ్డెసివిర్‌.. ప్రభావం ఎంత?

అమెరికా, యూరప్‌ దేశాలు, ఆసియా దేశాల్లోని 60 చోట్ల 1063 మంది రోగులపై రెమ్డెసివిర్‌తో ఏసీటీటీ-1 ప్రయోగాలు చేశారు. కరోనా బారిన పడి ఆక్సిజన్‌ అవసరమైన వారిని, మెకానికల్‌ వెంటిలేటర్‌పై ఉన్నవారిని ఇందుకు ఎంచుకున్నారు. వారిలో కొందరికి రెమ్డెసివిర్‌ను, మరికొందరికి ప్లాసిబో మాత్రలను (ఉత్తుత్తి మాత్రలు) ఇచ్చారు. రెమ్డెసివిర్‌ చికిత్స అందుకున్నవారిలో మరణాల రేటు 7.1%, ప్లాసిబో వాడినవారిలో మరణాల రేటు 11.9% గా ఉంది.


అసలు గేమ్‌ చేంజర్‌.. డెక్సామెథసోన్‌!

ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రికి చెందిన ప్రముఖ ఊపిరితిత్తుల సర్జన్‌ డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ తెలిపిన ప్రకారం.. ఇప్పటిదాకా కొవిడ్‌-19 పేషెంట్లకు  వాడిన మందుల్లో అత్యంత ప్రభావవంతమైనది డెక్సామెథసోన్‌. ‘గేమ్‌ చేంజర్‌’ అనే మాట వాడాలంటే.. ప్రస్తుతానికి ఈ ఔషధానికే వాడాలని ఆయన చెబుతున్నారు. తీవ్ర లక్షణాలతో బాధపడుతున్నవారికి ఈ మందు బాగా పనిచేస్తోందని, వారికి వేగంగా ఉపశమనం లభిస్తోందని ఆయన వివరించారు. ‘‘కరోనా మరణాలను ఈ మందు బాగా తగ్గిస్తోంది. పైగా చౌకగా దొరుకుతుంది’’ అని అరవింద్‌ కుమార్‌ తెలిపారు. మనదగ్గర కూడా తొలి నుంచీ ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.


ఫాబి ఫ్లూ ప్రభావం ఎంత?

గ్లెన్‌మార్క్‌ సంస్థ ఫాబి ఫ్లూ ప్రభావంపై మనదేశంలోనే 11 చోట్ల ప్రయోగాలు చేసింది. స్వల్ప లక్షణాలున్న 60 మందికి, కొద్దిపాటి లక్షణాలున్న 90 మందికి ఈ ఔషధాన్ని ఇచ్చి చూసింది. వారిలో 80 శాతానికిపైగా ఈ చికిత్స ఫలించినట్లు తేలింది.


ఔషధాలు.. అసలు ఉపయోగాలు!

జ్వరాన్ని పారాసిటమాల్‌ తగ్గించినట్టు.. మలేరియాను క్లోరోక్విన్‌ తగ్గించినట్టు.. కొవిడ్‌-19కు కచ్చితంగా ఇదీ మందు అని ఇప్పటిదాకా లేదు. ప్రస్తుతం వాడుతున్న మందులన్నీ ఇప్పటికే ఇతర వ్యాధులకు వాడుతున్నవి. వాటినే ప్రయోగాత్మకంగా కరోనా పేషెంట్లకూ ఇస్తున్నారు. అలా వాడుతున్న మందుల అసలు ఉపయోగాలేంటంటే..


రెమ్డెసివిర్‌: ఎబోలా వైర్‌సను ఎదుర్కోవడానికి 2014లో రెమ్డెసివిర్‌ను తయారుచేశారు. 


ఫావిపిరావిర్‌: ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలను నయం చేయడానికి.. జపాన్‌కు చెందిన ఫ్యుజి ఫిల్మ్‌ టొయామా కెమికల్‌ లిమిటెడ్‌ దీన్ని తయారుచేసింది. శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌ పెరిగిపోవడాన్ని (వైరల్‌ రెప్లికేషన్‌) అడ్డుకునే ఔషధమిది. 


టోసిలిజుమాబ్‌: ఇది రోగనిరోధక శక్తిని అణచివేసే మందు. ఆటో ఇమ్యూన్‌ వ్యాధి అయిన రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ పేషెంట్లకు వాడుతారు. దీని ఖర్చు చాలా ఎక్కువ. ఒక్కో డోసు రూ.40 వేల నుంచి రూ.60 వేల దాకా ఉంటుంది. కరోనా రోగుల్లో వెంటిలేటర్‌ అవసరం రాకుండా దీన్ని ముందుజాగ్రత్తగా వాడుతున్నారు. దీన్ని తొలుత ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో 52 ఏళ్ల పేషెంట్‌కు వాడారు. కానీ, అప్పటికే ఆయన పరిస్థితి విషయమించడంతో ఉపయోగం లేకపోయింది. శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్న రోగులకు దీన్ని ఇవ్వగా.. 95 శాతానికి పైగా సానుకూల ఫలితాలు వచ్చాయి. 


హైడ్రాక్సీ క్లోరోక్విన్‌: ఇది మలేరియాను తగ్గించే మందు. దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దీన్ని వాడుతున్నారు. ఖర్చు చాలా తక్కువ.


ఏ మందు ఖరీదు ఎంత?


సిప్రెమి-సిప్లా

రెమ్డెసివిర్‌ జనరిక్‌ వర్షన్‌ తయారీకి అనుమతి పొందిన హెటెరో సంస్థ దాన్ని 100 మిల్లీగ్రాముల ఇంజెక్షన్‌ (ఇంట్రావీనస్‌) రూపంలో అందుబాటులోకి తేనుంది. ఆ డోసు ధర రూ.5000 నుంచి రూ.6000 దాకా ఉండొచ్చని హెటెరో గ్రూపు సంస్థల ఎండీ వంశీకృష్ణ తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ సిఫారసుల మేరకు.. కరోనా పేషెంట్లకు మొదటి రోజు 200 మిల్లీగ్రాముల ఇంజెక్షన్‌ ఇవ్వాలి. అంటే, మొదటిరోజు ఇంజెక్షన్లకే రూ.10 వేల నుంచి 12 వేల ఖర్చవుతుంది. ఆ తర్వాత రోజుకు 100 మిల్లీగ్రాముల ఐవీ చొప్పున ఐదురోజులు ఇవ్వాలి. అంటే మరో రూ.25 వేల నుంచి రూ.30 వేలు. అంతా కలిపితే రూ.35 వేల నుంచి రూ.42 వేలు ఖర్చవుతుంది.


ఫాబి ఫ్లూ- గ్లెన్‌ ఫార్మా

గ్లెన్‌మార్క్‌ ఫార్మా విడుదల చేసిన ఫావిపిరావిర్‌ టాబ్లెట్లు ఒక్క స్ట్రిప్‌లో 34 ఉంటాయి. వాటి గరిష్ఠ చిల్లర ధర రూ.3500. అంటే ఒక్కో టాబ్లెట్‌కూ రూ.103. మొదటి రోజు 9 మాత్రలు వేసుకోవాలి. అంటే.. రూ.927. ఆ తర్వాత రోజు నుంచి 14 రోజులపాటు రోజుకు 4 మాత్రల చొప్పున వాడాలి. అంటే.. మొత్తం రూ.6,695. 


కొవిఫర్‌- హెటెరో

కొవిఫర్‌ 5 రోజుల కోర్సుకు లేదా ఆరు ఇంజెక్షన్లకు రూ.30 వేల లోపే ఖర్చయ్యేలా చూస్తామని హెటెరో సంస్థ పేర్కొంది.

Updated Date - 2020-06-24T07:54:43+05:30 IST