వయా ఢిల్లీ నుంచి ఖమ్మం

ABN , First Publish Date - 2020-04-01T15:59:47+05:30 IST

మత ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లిన వారి నుంచి కరోనా అనుమానాలు రావటంతో ఖమ్మం జిల్లా ఒక్కసారిగా...

వయా ఢిల్లీ నుంచి ఖమ్మం

ఇప్పటికే 10 మందికి పరీక్షలు


ఖమ్మం: మత ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లిన వారి నుంచి కరోనా అనుమానాలు రావటంతో ఖమ్మం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే మూడు రోజుల క్రితం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా నెగెటివ్‌గా వచ్చింది. శనివారం మరో 9మందిని జిల్లా ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్‌ వార్డుకు తరలించి నమూనాలను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారికి కరోనా నెగెటివ్‌ రిపోర్టు అందాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా వీరిని జిల్లా ఆసుపత్రిలోని కరోనా ఐసోలేషన్‌ వార్డులోనే వైద్యసేవలు అందిస్తున్నారు. వీరి కుటుంబాలను కూడా క్వారంటైన్‌లో ఉంచారు.


హైదరాబాద్‌ జాబితాతో ఖమ్మంలో కలవరం..

ఢిల్లీ వెళ్లిన బృందంలో మరో 17మంది ఖమ్మం జిల్లా వాసులు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సోమవారం అధికారిక సమాచారం అందింది. ఢిల్లీ వెళ్లిన ముస్లింల పేర్లు వారి ఫోన్‌ నంబర్లు ఉన్నాయి. వీటిపై ఇటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆటు పోలీసుశాఖ వారు వివరాలు సేకరించారు. జాబితాలోని ఫోన్‌ నంబర్లుకు వారీగా కాల్‌ చేసి వివరాలు సేకరించారు. తాము హైదరాబాద్‌లో ఉంటున్నామని సమాధానం చెప్పటంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జాబితాలోని 17మంది లో ఇప్పటికే కొంతమంది గాంధీ ఆస్పత్రి, చెక్‌పోస్ట్‌ ఆసుపత్రులో కరోనా వైద్య సేవలు పొందుతున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులకు తెలిపారు. సేకరించిన రోగుల వివరాలను జిల్లా అధికారులు హైదరాబాద్‌ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.


పాలేరు ఐసోలేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ కర్ణన్‌ మంగళవారం పరిశీలించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అనుమానితులకు చికిత్స చేసేందుకు పాలేరులో ఓ మెడికల్‌ కళాశాలను ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం వద్ద సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నీ సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించారు.

Updated Date - 2020-04-01T15:59:47+05:30 IST