భయపడలేదు...వైద్యుల సూచనలు పాటించాం

ABN , First Publish Date - 2020-08-09T08:36:02+05:30 IST

కరోనా వైరస్‌ సోకితే భయపడకండి... డాక్టర్ల సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉండి ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ...

భయపడలేదు...వైద్యుల సూచనలు పాటించాం

  • కరోనాను జయించిన కుటుంబాలు 

రాజేంద్రనగర్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ సోకితే భయపడకండి... డాక్టర్ల సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉండి ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, డాక్టర్లు చెప్పే మందులు వేసుకుంటే కరోనా నుంచి బయటపడవచ్చని కొందరు సూచిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులందరికీ కరోనా వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడ్డవారి అనుభవాలు....


11మందికి పాజిటివ్‌ వచ్చినా కోలుకున్నాం : సూర్యం

కరోనా వస్తే డాక్టర్లు చెప్పే సూచనలు పాటిస్తూ, మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకుంటే అది మనల్ని ఏమి చేయదని రాజేంద్రనగర్‌ సర్కిల్‌ లక్ష్మీగూడకు చెందిన ఉపాధ్యాయుడు సూర్యం (పేరుమార్చాం) తెలిపారు. జూలై 11న జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించుకున్నానని, జ్వరం తగ్గినా జలుబు ఉండటంతో జూలై 17న మైలార్‌దేవుపల్లి అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. అయినా భయపడకుండా తన భార్య (36), కుమార్తెలు (14),(13), కుమారుడు (8)కి పరీక్షలు చేయించగా వారికి కూడా పాజిటివ్‌ వచ్చిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత అత్తమ్మ (55), బావమరిది (34), బావమరిది భార్య (27), ఆమె 11నెలల పాప, వరుసకు సోదరుడు (49), అతడి భార్య (44)కు కూడా పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. తమ కుటుంబంలో ఒకరైన ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న ఓ వైద్యురాలు, అత్తాపూర్‌కు చెందిన డాక్టర్‌ జగన్‌మోహన్‌ సూచనల మేరకు మందులు వాడామన్నారు. స్థానిక అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో ఇచ్చిన మందులు వేసుకుని, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకున్నామని ఆయన చెప్పారు. తమ అన్నయ్య సహకారంతో పల్స్‌ ఆక్సీమీటర్‌ను తెప్పించుకుని ప్రతిరోజు ఆక్సిజన్‌ లెవల్స్‌ పరీక్షించుకునేవారమని ఆయన తెలిపారు. దీంతో 15 రోజులలో తమ కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ సాధారణ స్థితికి వచ్చామన్నారు. కరోనా వస్తే భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే నయమవుతుందని ఆయన పేర్కొన్నారు.


ఒకే ఇంట్లో ఐదుగురికి...

లక్ష్మీగూడకు చెందిన ఒక ఇంట్లో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినా డాక్టర్ల సూచన మేరకు  మందులు వేసుకుని, ఆవిరి పట్టడం, మల్టీ విటమిన్‌ మాత్రలు వేసుకుని, సరైన పౌష్టికాహారం తీసుకోవడంతో ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా ఉన్నారు.


వంద మందిలో ఇద్దరు ఆసుపత్రిలో చేరుతున్నారు

పాజిటివ్‌ వచ్చిన వారిలో చాలామంది ఇంటి దగ్గరే ఉండి కోలుకుంటున్నారు. ఇంట్లో ఉండి డాక్టర్ల సూచన మేరకు మందులు వేసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడంతో త్వరగా కోలుకుంటున్నారు. వందలో ఇద్దరు మాత్రమే ఆసుపత్రులలో చేరుతున్నారు. 

- డాక్టర్‌ సృజన, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, రంగారెడ్డి జిల్లా 


పౌష్టికాహారం తీసుకున్నాం : శివుడు

హైదర్‌గూడకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుటుంబంలో 11మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే ప్రస్తుతం అందరికీ నయమైందని ఆయన చెప్పారు. హైదర్‌గూడలో ఉండే శివుడు (పేరు మార్చాం) తల్లి (84)కి జూలై రెండో వారంలో అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ఆయన సోదరుడి కుమారుడు ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. పరీక్షలు చేయిస్తే పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఇంట్లో ఉన్న తల్లి (84)తో పాటు శివుడి ఇద్దరి సోదరులు(60), (53), ఇద్దరు వదినలు, వారి పిల్లలు మొత్తం 11మందికి పాజిటివ్‌ వచ్చింది. తాము భయపడకుండా ఇంట్లోనే ఉంటూ వైద్యులు చెప్పినట్లు మాత్రలు వేసుకోవడంతో అందరికీ త్వరగా నయమైందని ఆయన చెప్పారు. రోజుకు నాలుగుసార్లు ఆవిరి పడుతూ, డ్రై ఫ్రూట్స్‌, పండ్లు ఎక్కువగా తీసుకున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-08-09T08:36:02+05:30 IST