ఎమ్మెల్యే ఏలూరికి కరోనా

ABN , First Publish Date - 2020-10-20T07:54:52+05:30 IST

జిల్లాలో మరోసారి రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు కరోనాకు గురై కోలుకోగా ప్రస్తుతం తెలుగుదేశంలో కొందరు ప్రముఖులు కరోనా బాధితులుగా మారారు.

ఎమ్మెల్యే ఏలూరికి కరోనా

పోతులకు అస్వస్థత 

దామచర్ల పూర్ణచంద్రరావుకి కరోనా 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలో మరోసారి రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు కరోనాకు గురై కోలుకోగా ప్రస్తుతం తెలుగుదేశంలో కొందరు ప్రముఖులు కరోనా బాధితులుగా మారారు. తాజాగా పర్చూరు ఎమ్మెల్యే, బాపట్ల లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావుకి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అలాగే టీడీపీ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావుకి కరోనా సోకింది. కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు స్వల్ప అస్వస్థతతో వైద్యశాలలో చేరారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సాధారణ  వైద్య పరీక్షలు చేయించుకోగా సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


అయితే ఎలాంటి సమస్యలు లేకపోవటంతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండవచ్చని డాక్టర్లు సూచించారు. హైదరాబాద్‌లోని నివాసంలో హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స ప్రారంభమైంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని, ఆందోళనపడాల్సిన అవసరం లేదని ఏలూరి ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులలో మరెవరికీ కరోనా సోకలేదని సమాచారం. జిల్లాలో రాజకీయంగా పేరొందిన, టీడీపీకి చెందిన దామచర్ల కుటుంబ సభ్యుల్లో కొందరు కరోనా బారినపడ్డారు. సెంట్రల్‌ బ్యాంకు మాజీ డైరెక్టర్‌ అయిన పూర్ణచంద్రరావు కరోనాకి గురికాగా ఒంగోలులో చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని స్టార్‌ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.


ఆయన ఆరోగ్యంపై ఆందోళనపడాల్సిన అవసరం లేదని కుమారుడు సత్య సోమవారం ప్రకటించారు. ఆ కుటుంబంలో మరో ఒకరిద్దరికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ  అయినట్లు సమాచారం. కాగా కందుకూరు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామికవేత్త పోతుల రామారావు కూడా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం బయలుదేరి హైదరాబాద్‌ వెళ్లి బంజారాహిల్స్‌ ప్రాంతంలోని కేర్‌ వైద్యశాలలో చేరారు. వైరల్‌ ఫీవర్‌కి ఆయన గురయ్యారని, సాధారణ  చికిత్సతో కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. 


Updated Date - 2020-10-20T07:54:52+05:30 IST