ఉమ్మడిఖమ్మంలో 237మందికి కరోనా

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 237మంది కరోనా బారినపడినట్టు నిర్ధారణైంది

ఉమ్మడిఖమ్మంలో 237మందికి కరోనా

రామాలయ ఉద్యోగులను వెంటాడుతున్న వైరస్‌

కరోనా బారిన ఎన్డీ రాష్ట్ర నేత.. పరిస్థితి విషమం


కొత్తగూడెం కలెక్టరేట్‌/ ఖమ్మం సంక్షేమవిభాగం/ భద్రాచలం/ ఇల్లెందుటౌన్‌, సెప్టెంబర్‌ 18: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 237మంది కరోనా బారినపడినట్టు నిర్ధారణైంది. భద్రాద్రి కొత్తగూడెంలో 153మందికి, ఖమ్మం జిల్లాలో 84మందికి లక్షణాలున్నట్టు అధికారులు నిర్ధారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం 1381 మందికి పరీక్షలు నిర్వహించగా 153 మందికి పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే ఖమ్మం జిల్లాలో 84మంది కొవిడ్‌ బారిన పడ్డారని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తమ బులిటెన్‌లో పేర్కొన్నారు. 


రామాలయంలో మరో ఇద్దరికి పాజిటివ్‌

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ వైదిక, పరిపాలన సిబ్బందిని కరోనావైరస్‌ వెంటాడుతోంది. ఇప్పటికే పది మందికి పైగా కొవిడ్‌ బారిన పడగా తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణైంది. వీరిలో ఒక వైదిక సిబ్బంది ఉన్నారు. 


ఎన్డీ రాష్ట్ర నేతకు లక్షణాలు.. పరిస్థితి విషమం

న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం రాష్ట్ర సీనియర్‌ నేత.. సుమారు 60సంవత్సరాల వయసున్న ఎస్‌కే ముఖ్తార్‌పాషా కరోనా బారిన పడ్డారు. ఏపీలోని గుంటూరులో జరుగుతున్న పార్టీ సమావేశాలకు పదిహేను రోజుల క్రితం వెళ్లిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో అక్కడి ఎన్డీ నాయకులు ఆయన్ను విజయవాడ ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు నిర్వహించిన అక్కడి వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అప్పటి నుంచి సుమారు 10రోజుల పాటు అక్కడే వైద్యం పొందిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మూడు రోజుల క్రితం గుంటూరు వైద్యశాలకు తరలించారని ఎన్డీ వర్గాలు తెలిపాయి. అయితే గతంలోనే పలు అనారోగ్యసమస్యలతో ముఖ్తార్‌పాషా భాదపడుతున్నారు. 


Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST