కరోనా కాలంలో ఓట్ల వేట!

ABN , First Publish Date - 2020-04-03T16:21:39+05:30 IST

ఇది చాలా కష్టకాలం. కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో..

కరోనా కాలంలో ఓట్ల వేట!

వైసీపీ నేతల కక్కుర్తి రాజకీయం

రేషన్‌ సరకుల పంపిణీలో వారే!... పింఛన్ల పంపిణీలోనూ వారే!!

నిన్నటివరకూ డిపోల వద్ద హడావిడి

ఇప్పుడు ఇంటింటికీ తిరిగి ప్రచారం

రేపటి నుంచి రూ.1000పంపిణీకి రెడీ

చోద్యంచూస్తున్న అధికారులు

మందీమార్బలంతో తిరుగుతుండడంతో ‘భౌతిక దూరం’

నిబంధనకు కూడా విఘాతం

పోలీసులకు ఈ అతి కనిపించట్లేదా?


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): ఇది చాలా కష్టకాలం. కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో పేదలకు ఉపాధి లేకుండా పోయింది. వారికి సాయం చేయడానికి ఎవరు ముందుకువచ్చినా అభినందించాల్సిందే. కానీ అధికార పార్టీ నాయకులు ‘అత్త సొమ్ము అల్లుడు దానం’ చేసిన చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్‌ సరకులను... వీరే సొంతంగా ఇస్తున్నట్టు డిపోల దగ్గర హంగామా చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితి ఇప్పుడే కనపడుతోంది. 


రేషన్‌ సరకుల పంపిణీ బాధ్యత డీలర్లు, వలంటీర్లది. ఇంతకు ముందు డీలర్లు ఏ సమస్య లేకుండా సరకులు పంపిణీ చేసేవారు. వలంటీర్ల వ్యవస్థ వచ్చిన తరువాత కూడా సమస్య ఏర్పడలేదు. ఇప్పుడు పంచాయతీ, మండల/జిల్లా పరిషత్‌, జీవీఎంసీ ఎన్నికలు రావడంతో నామినేషన్లు వేసిన అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారం కోసం ఈ విధంగానే వ్యవహరిస్తున్నారు. డిపోల దగ్గర సరకులు పంపిణీ చేస్తూ హడావిడి చేస్తున్నారు. తాజాగా బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ మొదలైంది. వీటిని వలంటీర్లు ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వాలి. ఇక్కడ కూడా వైసీపీ నాయకులే ముందుంటున్నారు. తమ జేబులో డబ్బులు ఇస్తున్నట్టు వలంటీర్ల దగ్గర లాక్కొని మరీ లబ్ధిదారులకు ఇస్తున్నారు.


వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు అయితే ఓకే. కానీ వారింకా ఎన్నిక కాలేదు. ఎన్నికల్లో పోటీకి మాత్రమే దిగారు. అవి వాయిదా పడ్డాయి. ఈలోగా కరోనా రావడంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ తమ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. అన్ని ప్రాంతాల్లోను ఇదే జరుగుతోంది. కొద్దిమంది మాత్రమే సొంత డబ్బుతో పేదలకు సాయం చేస్తుండగా, ఎక్కువ మంది ప్రభుత్వ పథకాలనే సొంతంలా ఉపయోగించుకుంటున్నారు.


భౌతిక దూరం ఏదీ?

భౌతిక దూరం పాటిస్తేనే కరోనా నుంచి తప్పించుకోగలమని వైద్యులు, అధికారులు నెత్తీనోరూ కొట్టుకొని చెబుతున్నారు. కానీ వైసీపీ నాయకులు ఆ మాటలను గాలికి వదిలేసి ప్రచారం కోసం పాకులాడుతూ వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. నగరంలో 144 సెక్షన్‌ అమలులో ఉంది. ఇద్దరు కలిసి వెళితే అడ్డుకుంటున్న పోలీసులు అధికార పార్టీ వారిని మాత్రం వీధుల్లోకి వెళ్లకుండా ఆపలేకపోతున్నారు.


అధికార పార్టీ తొత్తులుగా అధికారులు

అటు రెవెన్యూ, ఇటు జీవీఎంసీ, మరోవైపు పోలీసు సిబ్బంది అంతా అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. సామాన్య ప్రజలకు మాత్రమే కరోనా నిబంధనలు వర్తిస్తాయని, వైసీపీ నాయకులకు వర్తించవన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే అలుసుతో అధికార పార్టీ అభ్యర్థులు (నామినేషన్‌ వేసినవారు) ఈ కరోనా కాలాన్ని ప్రచారానికి బాగా వాడేసుకోవాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. రేషన్‌ సరకుల పంపిణీలో అధికార పార్టీ నాయకుల ప్రమేయం వుండకూడదనే విషయం రెవెన్యూ అధికారులకు తెలియదా? వారిని డిపోల దగ్గరకు ఎందుకు అనుమతిస్తున్నారు?...ఇక పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కనపెట్టి వైసీపీ నాయకులు అంతా తామై వ్యవ హరిస్తుంటే జీవీఎంసీ అధికారులు  కూడా నోరెత్తడం లేదు.


మంత్రితో సహా గల్లీ నాయకులంతా గుంపులు గుంపులుగా తిరుగుతుంటే... భౌతిక దూరం పాటించాలని పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా మొత్తం తిరుగుతున్నారు. రైతుబజార్లను సందర్శిస్తున్నారు. ఇద్దరు ముగ్గురితో ముగించాల్సిన పర్యటనలకు స్థానిక నాయకులు జత కలవడంతో జాతరగా మారుతోంది. మొన్నటికి మొన్న వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ కోటవీధిలో తన మందీమార్బలంతో హడావిడి చేశారు. వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ తన దానగుణాన్ని చాటుకోవడానికి ఏకంగా నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనానే స్వయంగా గురువారం ఆహ్వానించి పేదలకు నిత్యవసరాలు పంపిణీ చేశారు.


ఇకనైనా ఈ ఆపత్కాల్కాన్ని రాజకీయ ప్రచారాలకు వాడుకోకుండా రాజకీయ నాయకులు, వారికి అండగా నిలవకుండా అధికారులు సంయమనం పాటించాల్సి ఉంది. అందరికీ ఒకే రూలు అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. అధికారిక సమావేశాల్లో ప్రజాప్రతినిధులు కానివారిని నిరోధించాల్సిన అవసరమూ ఉంది..

Updated Date - 2020-04-03T16:21:39+05:30 IST