కరోనా వేళ.. ఆర్టీసీ విలవిల

ABN , First Publish Date - 2021-05-07T06:03:32+05:30 IST

కరోనా మహ మ్మారి దెబ్బకు ఆర్టీసీ విలవిలలాడుతోంది. అసలే వేసవి కాలంలో అంతంత మాత్రంగా ఆదాయం వచ్చే ఆర్టీసీని వైరస్‌ కోలుకోలేని దెబ్బతీస్తోంది. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థపై సెకండ్‌వేవ్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రయాణికులు లేక నిత్యం పదుల సంఖ్యలో సర్వీసులు డిపోలకే పరిమితమవుతున్నాయి.

కరోనా వేళ.. ఆర్టీసీ విలవిల

కొవిడ్‌ దెబ్బకు సగానికి పడిపోయిన సంస్థ ఆదాయం

హోం ఐసోలేషన్‌లో వంద మందికి పైగా కండక్టర్లు, డ్రైవర్లు

మహారాష్ట్ర రూట్లలో అంతంత మాత్రంగానే సర్వీసులు

ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే బస్సు సర్వీసుల నిలిపివేత

బస్సంటేనే భయపడుతున్న జిల్లాలోని ప్రయాణికులు

ఆదిలాబాద్‌, మే6 (ఆంధ్రజ్యోతి): కరోనా మహ మ్మారి దెబ్బకు ఆర్టీసీ విలవిలలాడుతోంది. అసలే వేసవి కాలంలో అంతంత మాత్రంగా ఆదాయం వచ్చే ఆర్టీసీని వైరస్‌ కోలుకోలేని దెబ్బతీస్తోంది. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థపై సెకండ్‌వేవ్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రయాణికులు లేక నిత్యం పదుల సంఖ్యలో సర్వీసులు డిపోలకే పరిమితమవుతున్నాయి. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ అధికారులు అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజల ఆదరణ లేక పోవడంతో ఆదాయం భారీగా పడిపోతోంది. కరోనా పరిస్థితులతో ప్రయాణికులు బసెక్కేందుకు భయపడిపోతున్నారు.సుదూర ప్రాంతాలకైతే సొంతంగా వాహనాలను అద్దెకు తీసుకొని మరీ వెళ్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు భయటకు రాకపోవడంతో ప్రయాణ ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి. కరోనా పరిస్థితులకు ముందు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు రూ.75లక్షల నుంచి 85లక్షల వరకు ఆదాయం వచ్చేది. కాని ప్రస్థుతం రూ.30లక్షలకు మించి ఆదాయం రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. సగానికి సగం ఆదాయం పడిపోవడంతో సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుతోంది. మరికొన్నాళ్ల పాటు ఇవే పరిస్థితులు ఉంటే ఆర్టీసీకి భారీ నష్టం కలిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఏపీకి బస్సు సర్వీసుల రద్దు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ఉధృతి తీవ్రం కావడంతో అక్కడి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు విధించింది. దీంతో జిల్లా నుంచి నిత్యం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే బస్సు సర్వీసులన్నింటినీ రద్దు చేశారు. రెండు రోజులుగా 14 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రధానంగా గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కనిగిరి, పాలమూర్‌, కర్నూల్‌ పట్టణాలకు సర్వీసులను పూర్తిగా నిలిపి వేశారు. ఎప్పుడు ప్రారంభమయ్యేది వైరస్‌ తీవ్రతను బట్టి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి జిల్లాకు వచ్చి నివాసం ఉంటున్న వలస కూలీలు, ఇతర వ్యాపారస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. అత్యవసర సమయంలో ఇంటికి  వెళ్లే పరిస్థితులు లేవని వాపోతున్నారు. సుదూర ప్రయాణం చేసే వీలులేక రాకపోకలను వాయిదా వేసుకుంటున్నారు.

మహారాష్ట్ర రూట్లలో అదే పరిస్థితి..

జిల్లాకు పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనావై రస్‌ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రజలు మహారాష్ట్రకు వెళ్లేందుకు ఆసక్తిని చూపడం లేదు. అత్యవసరమైతే తప్ప మిగతా పనులను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో భారీగా ఆదాయం పడిపోవడంతో సర్వీ సులను రద్దు చేస్తున్నారు. గతంలో జిల్లా నుంచి మహారాష్ట్రకు 70 సర్వీసులన నడిపిన ఆర్టీసీ అధికారులు ప్రస్తుతం 30 సర్వీసుల వరకే ప్రధాన రూట్లలో నడుపుతున్నారు. పాండ్రకవడ, కిన్వట్‌, ఆకోల, నాందెడ్‌, నాగ్‌పూర్‌, చంద్రాపూర్‌, ఇస్లాంపూర్‌ రూట్లలో బస్సు సర్వీసులను భారీగా తగ్గించారు. మొదట అన్ని రూట్లలో సర్వీసులను ప్రారంభించిన ఆర్టీసీ అధికారులు కరోనా తీవ్రత పెరిగే కొద్ది ఆదరణ కోల్పోవడంతో సర్వీసులను నిలిపివేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభావంతోనే జిల్లాలో ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయన్న ప్రచారం జరగడంతో మహారాష్ట్ర రూట్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు భయపడుతున్నారు. దీంతో ఖాళీగానే సర్వీసులను నడుపలేక ర ద్దు చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

కరోనా బారిన పడుతున్న సిబ్బంది..

అసలే భయం భయంగానే విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది కరోనా బారిన పడుతూ ఇంటికే పరిమితమవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా వంద మంది డ్రైవర్స్‌, కండక్టర్లు వైరస్‌ బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు అదృష్టవశాత్తు కరోనా మరణాలు లేక పోయిన తరచూ వైరస్‌ బారిన పడి విధులకు దూరమవుతున్నారు. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రుల్లో చేరి లక్షల రూపాయ లు ఖర్చు చేసుకుంటున్నారు. సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆరోగ్య సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక వైద్యులను నియమించి ఫోన్‌ వీడియో కాల్‌ ద్వారా సిబ్బంది యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. త్వరగా కోలుకునే విధంగా వైద్య సహాయాన్ని అందిస్తున్న సిబ్బం ది కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. 

అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం..

- విజయ్‌కుమార్‌ (రీజనల్‌ మేనేజర్‌, ఆదిలాబాద్‌)

కరోనా పరిస్థితుల దృష్ట్యా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతీ బస్సును శానిటేషన్‌ చేసిన తర్వాతనే బయటకు పంపుతున్నాం. కరోనాతో భారీగా ఆదాయం పడిపోతున్నా సేవ దృక్పథంతో బస్సులను నడపాల్సి వస్తోంది. సిబ్బంది కరోనా బారిన పడుతున్న వెంటనే కోలుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలకు బస్సుసర్వీసులను నిలిపి వేస్తున్నాం. ప్ర యాణికుల రద్దీ లేక పోవడంతో మరిన్ని రూట్లలో సర్వీసులను రద్దు చేయాల్సి వస్తోంది. ప్రయాణికులు  తప్పని సరిగా మాస్కు ధరించి ప్రయాణం చేయాలి. 

Updated Date - 2021-05-07T06:03:32+05:30 IST