Abn logo
Jun 6 2021 @ 13:18PM

కరోనా వేళ... ఇమ్యూనిటీ పెంచేద్దామిలా..

పిల్లలకు కరోనా రాదు, వచ్చినా పెద్ద ప్రమాదమేమీ లేదు... మొన్నటి వరకు ఈ అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ ఆ అభిప్రాయాన్ని తప్పని నిరూపించింది. నెలల వయసున్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కరోనా కాటేస్తోంది. ఈ ప్రమాద సమయంలో భవిష్యత్‌ తరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కరోనా సోకినా, దాని బారి నుంచి పిల్లలు బయట పడాలంటే రోగనిరోధక శక్తి అత్యవసరం. వారికి రోజూ బలవర్ధకమైన, ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని అందించేలా చూడడం ఇప్పుడు మనందరి కర్తవ్యం...


జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏ వయసు వారి మీదైనా దాడి చేసే మనసులేని మహమ్మారి కరోనా. ఫస్ట్‌ వేవ్‌ సమయంలో ప్రతీ వందమందిలో ఒక చిన్నారికి మాత్రమే కరోనా బయటపడింది. కానీ సెకండ్‌ వేవ్‌లో మాత్రం ప్రతీ వంద మందిలో 20 మంది పిల్లలకు కరోనా వస్తున్నట్టు తేలింది. అంటే పిల్లల్లో పాజిటివ్‌ కేసులు ఇరవై రెట్లు పెరిగాయి. నిజానికి గత ఏడాది కూడా పిల్లలకు కరోనా సోకింది. కానీ పెద్దగా లక్షణాలు బయటపడలేదు. పిల్లలపై ప్రభావం చూపలేకపోయింది. కానీ సెకండ్‌ వేవ్‌లో కరోనా కొత్త రూపు (మ్యుటేషన్‌) దాల్చి పిల్లలపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. అందుకే పెద్దవాళ్లు తీసుకున్న జాగ్రత్తలన్నీ పిల్లల విషయంలో కూడా తీసుకోవడం అత్యవసరం. 


 పిల్లల్లో లక్షణాలు

పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఈ వైరస్‌ లక్షణాలు కాస్త భిన్నంగానే ఉన్నట్టు హార్వర్డ్‌ హెల్త్‌లో ప్రచురించిన ఓ కథనం చెబుతోంది. కొత్తలో పిల్లల్లో లక్షణాలు కూడా బయటపడలేదు. ఇప్పుడు మాత్రం దాదాపు పెద్దవాళ్లలో కనిపించే లక్షణాలే కనిపిస్తున్నాయి. జ్వరం, ఆహారం తీసుకోకపోవడం, వాంతులు, విరేచనాలు, పొడి దగ్గు, గొంతునొప్పి, పెదాలు పగలడం, ముక్కు దిబ్బడ వంటివి నాలుగు రోజులకు మించి కొనసాగితే కచ్చితంగా కరోనా పరీక్ష చేయించాలి. ఇలాంటి ఏదో ఒక అనారోగ్యం ద్వారానే కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. తేలికగా తీసుకుంటే మాత్రం ఆక్సిజన్‌ స్థాయి పడిపోయే పరిస్థితి దాపురిస్తోంది. ముఖ్యంగా పిల్లల్లో న్యూమోనియాకు దారితీస్తుంది. ఏమాత్రం తేడా ఉన్నా అప్రమత్తం కావాలి. 


విటమిన్‌ డి కోసం...

పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి విటమిన్‌ డి అవసరం. శరీరంలోకి చేరిన వైరస్‌ల పనిపట్టే రక్షణ కణాల పనితీరును విటమిన్‌ డి మెరుగుపరుస్తుంది. ఈ విటమిన్‌ తగ్గితే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కనుక విటమిన్‌ డి పిల్లలకు తగినంత చేరేలా చూసుకోవాలి. దీనికి వైద్యుడి సలహాతో విటమిన్‌ డి సిరప్‌లు, క్యాప్సూల్స్‌ వాడాలి. ఉదయంపూట పిల్లల శరీరానికి ఎండ తగిలేలా చూడాలి. అలాగే సాల్మన్‌, టూనా వంటి చేపల్లో విటమిన్‌ డి లభిస్తుంది. పుట్టగొడుగులు, గుడ్డులోని పచ్చ సొనలో కూడా విటమిన్‌ డి దొరుకుతుంది. కనుక పిల్లలకు ఈ ఆహారం తరచూ అందేలా చూడాలి. 


పండ్లే ఔషధం

పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నారులకు రోగనిరోధక శక్తి కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే అయిదేళ్ల వయసు వరకు వారు తరచూ వైరస్‌, ఇనెఫెక్షన్ల బారిన పడుతుంటారు. కాబట్టి వారికి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఇవ్వడం అత్యవసరం. అందులో మోదటిస్థానం తాజా పండ్లదే. జంక్‌ ఫుడ్‌ మాయలో పడి పండ్లను తినడం తగ్గించేస్తున్నారు నేటి తరం. కానీ ప్రతి పండులోనూ ప్రత్యేక పోషక లక్షణాలు ఉంటాయి. అరటి, బొప్పాయి, ఆపిల్‌, పుచ్చకాయ, ద్రాక్ష, బెర్రీలు, నారింజ ఇలా ఆయా సీజన్‌లో దొరికే ప్రతి పండును పిల్లలకు తినిపించాలి. జ్యూసులుగా మార్చేకన్నా పండే తినడం మంచిది. జ్యూసులుగా మార్చే ప్రక్రియలో అందులో విటమిన్లు, ఖనిజాలు, లవణాలను కోల్పోవాల్సి రావచ్చు. కరోనా సోకిన పిల్లలకూ పండ్లే ఉత్తమ ఔషధం. 


డ్రైప్రూట్స్‌ - నట్స్‌

ఆప్రికాట్‌, ఖర్జూరాలు, కిస్మిస్‌ వంటి డ్రైఫ్రూట్స్‌, జీడిపప్పు, బాదం,పిస్తా వంటి నట్స్‌ పిల్లలకు రోజు పెట్టడం చాలా మంచిది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్‌ వీటి ద్వారా శరీరంలోకి చేరుతుంది. నోట్లో పళ్లు వచ్చి, నమల గలిగే పిల్లలందరికీ వీటిని పెట్ట్టొచ్చు. రెండేళ్ల వయసు నుంచే వీటిని రోజుకు ఒకట్రెండు తినిపిస్తే వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరేళ్ల వయసు దాటిన పిల్లలకు ఈ కరోనా వేళ రోజుకు నాలుగు బాదం గింజలు, నాలుగు జీడిపప్పులు, రెండు ఖర్జూరం, నాలుగు కిస్మిస్‌ లు ఉదయం పూట తినడం అలవాటుగా మార్చాలి. కరోనా బారిన పడిన పిల్లలకు వీటిని పెడిత్లే త్వరగా కోలుకుంటారు కూడా. 


మాంసాహారం అవసరమే

చిన్న పిల్లలకు మాంసాహారం పెట్టేందుకు ఇష్టపడరు. నిజానికి ఏడాదిన్నర వయసుకే పిల్లలకు మాంసాహారం పరిచయం చేయొచ్చు. మెత్తగా ఉడికించి, చిన్న ముక్కలుగా చేసి పెట్టొచ్చు. గుడ్డు కూడా తినిపించొచ్చు. చిన్న వయసు నుంచి మాంసాహారం తినడం వల్ల ప్రోటీన్స్‌ అధికంగా అందుతాయి. అయిదేళ్ల లోపు పిల్లలకు మాంసాహారం పరిమితంగా పెట్టాలి. ఇందులో విటమిన్‌ బి, ఐరన్‌ కూడా ఉంటుంది. పిల్లలకు రోజూ ఒక పూట యాభై గ్రాములకు మించకుండా మాంసాహారం తినిపించడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా పెడితే మాత్రం మలబద్ధకం సమస్య రావొచ్చు. కేవలం చికెన్‌ మాత్రమే కాదు చేపలు, రొయ్యలు, గుడ్డు లాంటివి పెట్టడం వల్ల వారికి పలు పోషకాలు అందే అవకాశం ఉంది. 


యాంటీబాడీస్‌ కోసం...

ఆరోగ్యకరమైన జీవనానికి ‘బ్యాలెన్స్‌ డ్‌ డైట్‌’ చాలా అవసరం. ఇక కోవిడ్‌ లాంటి వాటిని ఎదుర్కోవాలంటే ఆహారంపై మరింత శ్రద్ధ వహించాలి. కోవిడ్‌ వైరస్‌ను ఎదర్కోవడానికి యాంటీబాడీస్‌ అవసరం. శరీరంలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందడానికి ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారం అవసరం. పప్పు దినుసులు, చేపలు, చికెన్‌, మటన్‌ వంటి వాటిల్లో ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. పాలుగు, పెరుగు, గుడ్లలో కూడా ఉంటాయివి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే కోవిడ్‌ సోకిన వారు అధిక ప్రొటీన్లు తీసుకోవాలి. కనుక పిల్లలకూ రోజూ  అలాంటి ఆహారం పెట్టాలి. దీని వల్ల చిన్నప్పట్నుంచే వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీస్‌ వారిలో వృద్ధి చెందుతాయి. తద్వారా రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. 


సమతులాహారంతోనే పరిష్కారం

బ్యాలెన్స్‌ డ్‌ ఫుడ్‌... అంటే రోజులో పిల్లలు తినే ఆహారం సమతులంగా ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలు, పప్పు ధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, ఎండు ఫలాలు, గుడ్లు, మాంసాహారం ఇలా అన్నీ కలిపితేనే అది సమతులాహారం అవుతుంది. వీటన్నంటినీ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచే ప్రోటీన్లు, జింక్‌, ఐరన్‌, విటమిన్లు, ఖనిజాలు, కాపర్‌, సెలీనియం, ఫైటో న్యూట్రియెంట్స్‌, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు పిల్లల శరీరానికి అందుతాయి. కాబట్టి పిల్లలు తినే ఆహారంలో ఇవన్నీ ఉండేట్టు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.