అధికారం మాదే.. మేమిచ్చేది ఇంతే!

ABN , First Publish Date - 2020-06-03T10:53:09+05:30 IST

కరోనా కట్టడి కోసం కేంద్రం లాక్‌డౌన్..

అధికారం మాదే.. మేమిచ్చేది ఇంతే!

రేషన్‌ డీలర్ల ఇష్టారాజ్యం

బ్లాక్‌ మార్కెట్‌కు కందిపప్పు

కిలో రూ. 60కు విక్రయం 

ప్రశ్నించిన కార్డుదారులతో వాగ్వాదం 

పట్టించుకోని  అధికారులు 


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా ఇస్తున్న సరుకుల్లో డీలర్లు చేతివాటం చూపుతున్నారు.  అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అంతా మా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బియ్యం మాత్రమే ఇచ్చి కందిపప్పును దర్జాగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. ప్రశ్నించిన కార్డుదారులతో వాగ్వాదానికి  దిగుతున్నారు. ‘మా పార్టీ అధికారంలో ఉంది. మమ్మల్నేం చేయలేరు. ఇచ్చింది తీసుకెళ్లండి’ అని కరాఖండిగా చెప్తున్నారు. 


కరోనా కట్టడి కోసం కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రెండు విడతలు రేషన్‌ ఇస్తోంది. బియ్యంతోపాటు ఒక దఫా కందిపప్పు, మరోసారి శనగలు ఉచితంగా పంపిణీ చేస్తోంది. పంచదారకు మాత్రం రూ. 10 వసూలు చేస్తోంది. ఇప్పటి వరకూ నాలుగు విడతల రేషన్‌ పంపిణీ పూర్తికాగా గతనెల 29 నుంచి ఐదో విడత జరుగుతోంది. దీన్ని రేషన్‌ డీలర్లు ఆదాయమార్గంగా మార్చుకున్నారు. 


బయోమెట్రిక్‌ విధానంలో మోసం

రేషన్‌ సరుకుల పంపిణీలో బయోమెట్రిక్‌ విధానం అమలులోకి వచ్చిన తర్వాత కార్డుదారుడు వేలిముద్రలు తప్పని సరిగా వేయాలి. కార్డుదారుడు ఏఏ వస్తువులు తీసుకుంటున్నారో నమోదు చేసి అందుకు సంబంధించిన బిల్లు ఇవ్వాలి. కానీ డీలర్లు కార్డుదారుడు బయోమెట్రిక్‌ తీసుకున్న వెంటనే బియ్యం, కంది పప్పు తీసుకున్నట్లు నమోదు చేస్తున్నారు. బియ్యం మాత్రమే ఇచ్చి కందిపప్పు లేవని సమాధానం చెప్తున్నారు. బిల్లు ఇవ్వక పోవడంతో ఎక్కువ మందికి ఈవిషయం తెలియడం లేదు. కార్డుదారులు ఎవరైనా ప్రశ్నిస్తే వివాదాలకు దిగుతున్నారు. 


కందిపప్పు పక్కదారి 

రేషన్‌ కందిపప్పును డీలర్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అక్కడ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ. 90 పలుకుతోంది. ఈ నేపథ్యంలో డీలర్లు వ్యాపారులకు కిలో రూ. 50 నుంచి రూ. 60కు విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కో డీలరు వేలల్లో అక్రమంగా ఆర్జిస్తున్నారు. 


కార్డుదారులతో వాగ్వాదం 

కందిపప్పు విషయమై అనేక దుకాణాల వద్ద డీలర్లు, కార్డుదారుల మధ్య వాగ్వివాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న కందిపప్పు మాకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన వారి పట్ల డీలర్లు దురుసుగా వ్యవహరిస్తున్నారు. ‘మేము అధికార పార్టీకి చెందిన వాళ్లం. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇచ్చినవి తీసుకెళ్లండి. లేకపోతే మీకు చేతనైంది చేసుకోండి’ అని కరాఖండిగా చెప్తున్నారు. దీంతో కార్డుదారులు చేసేది ఏమీ లేక వెనుదిరుగుతున్నారు. ఈనేపథ్యంలో పట్టించుకోవాల్సిన పౌరసరఫరాల అధికారులు ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. కార్డు దారుల నుంచి ఫిర్యాదులు అందితే ఒకట్రెండు దుకాణాలను తనిఖీ చేసి మమ అనిపిస్తున్నారు. 

Updated Date - 2020-06-03T10:53:09+05:30 IST