భద్రత కరువు!

ABN , First Publish Date - 2020-04-04T10:00:12+05:30 IST

రోనా కట్టడికి పాటుపడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కనీస భద్రత కరువైంది. కనీస అవసరాలైన మాస్క్‌లు, గ్లౌజులను కూడా ప్రభుత్వం సమకూర్చడం లేదు.

భద్రత కరువు!

మాస్కులు, శానిటైజర్ల కొరత

జిల్లా వ్యాప్తంగా అరకొరగా సరఫరా

ఆందోళనలో వైద్యులు, వైద్య సిబ్బంది


ఆంధ్రజ్యోతి (న్యూస్‌ నెట్‌వర్క్‌), ఏప్రిల్‌ 3: కరోనా కట్టడికి పాటుపడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కనీస భద్రత కరువైంది. కనీస అవసరాలైన మాస్క్‌లు, గ్లౌజులను కూడా ప్రభుత్వం సమకూర్చడం లేదు. జిల్లాలోని పలు పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, తమకు ఏదైనా జరిగితే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం, నంద్యాల, ఆళ్లగడ్ల నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉంది. 


మాస్కుల కొరత

నంద్యాల: నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాస్కుల కొరత తీవ్రంగా ఏర్పడింది. కరోనా అనుమానితులు పరీక్షల నిమిత్తం ఆసుపత్రులకు వస్తున్నారు. వీరికి వైద్యం చేసేవారికి ఎన్‌-95 మాస్కులు లేవు. నంద్యాల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది 300 మంది వరకూ ఉన్నారు. జిల్లా ఆస్పత్రితోపాటు శాంతిరామ్‌ వైద్య కళాశాలలో కరోనా ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. సీనియర్‌, స్పెషలిస్టు వైద్యులను,  నర్సులకు షిఫ్ట్‌ల వారిగా ఐసోలేషన్‌ వార్డులో విధులు కేటాయించారు. వీరికి మాత్రమే ఎన్‌-95 మాస్క్‌లను అందజేశారు.


మిగిలిన వారికి సర్జికల్‌ మాస్క్‌లను మాత్రమే ఇస్తున్నారు. నంద్యాల ఏరియా ఆసుపత్రులతో పాటు పీహెచ్‌సీలకు  మాస్కులను మంజూరు చేయలేదు. మాస్కులు, గ్లౌజుల కొరతపై ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న మాస్క్‌లు 10 రోజులకు సరిపడతాయని తెలిపారు. మరో 50 వేల మాస్క్‌లు కావాలని కలెక్టర్‌, డీఎంహెచ్‌వోకి ఇండెంట్‌ పెట్టామని తెలిపారు. సెంట్రల్‌ గోడౌన్‌కు స్టాక్‌ వచ్చినందున తమ ఇండెంట్‌ గురించి మరోసారి కలెక్టర్‌ను సంప్రదిస్తామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఆసుపత్రులకు మాస్కులు వస్తాయని తెలిపారు.


జిల్లా అంతటా కొరత

ఎమ్మిగనూరు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో ఆరుగురు వైద్యులు, పది మంది నర్సులు సహా మొత్తం 55 మంది పనిచేస్తున్నారు. 2 వేల మాస్కులు, శానిటైజర్లు కావాలని ప్రతిపాదనలు పంపారు. కానీ 100 మాస్కులను మాత్రమే ఇచ్చారు. దీంతో వైద్య సిబ్బంది  బయట కొని తెచ్చుకుంటున్నారు. 


గోనెగండ్ల పీహెచ్‌సీకి రెండు వేల మాస్కులు, శానిటైజర్‌లు కావాలని ప్రతిపాదనలు పంపారు. మూడు దఫాలుగా 300 మాస్కులు, 48 శానిటైజర్లు మంజూరు చేశారు. నందవరం పీహేచ్‌సీకి 500 మాస్కులు, 200 శానిటైజర్లు కావాలని ప్రతిపాదనలు పంపితే కేవలం 100 మాస్కులు, 20 శానిటైజర్లు మంజూరు చేశారు. 


ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె పీహెచ్‌సీకి మాస్కులు, శానిటైజర్లు కావాలని ప్రతిపాదనలు పంపినా అధికారులు స్పందించలేదు. మంత్రాలయం మండలం కలుదేవకుంట పీహెచ్‌సీకి తగినన్ని మాస్కులు, శానిటైజర్లు, బ్లౌజులు ఇవ్వలేదని వైద్య సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 


పెద్దకడుబూరు పీహెచ్‌సీకి 200 మాస్కులు, శానిటైజర్లు కావాలని ప్రతిపాదనలు పంపగా కేవలం 50 మాస్కులు, 50 శానిటైజర్లు వచ్చాయి. కోసిగి పీహెచ్‌సీకి వెయ్యి మాస్కులు, శానిటైజర్లు కావాలని ప్రతిపాదనలు పంపితే 200 మాస్కులు, 48 శానిటైజర్లు మాత్రమే ఇచ్చారు.


కౌతాళం, బదినేహాల్‌ పీహెచ్‌సీలకు 500 మాస్కులు, శానిటైజర్లు కావాలని ప్రతిపాదనలు పంపితే రెండు పీహెచ్‌సీలకు కలిపి 100 మాస్కులు ఇచ్చారు. శానిటైజర్లు ఇవ్వలేదు. 


ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 20 పీహెచ్‌సీలు, పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటరుకు శానిటైజర్లు, మాస్క్‌లను అధికారులు సరఫరా చేయలేదు. వైద్యులు. సిబ్బంది బయట కొని వినియోగిస్తున్నారు. 


డోన్‌ ప్రాంతంలో వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఎన్‌ 95 మాస్కులు, బ్లౌజ్‌లు, వ్యక్తిగత రక్షణ కిట్లు అందజేయలేదు. ఒక్కో ఏఎన్‌ఎంకి ఒక శానిటైజర్‌ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.


నందికొట్కూరు రూరల్‌: బ్రాహ్మణకొట్కూరు పీహెచ్‌సీలో సేఫ్టీ డ్రస్సులు, మాస్కులు, శానిటైజర్ల కొరత అధికంగా వుంది. సిబ్బంది మాస్కులు, శానిటైజర్లు కూడా తగినన్ని లేవని పీహెచ్‌సీ డాక్టర్‌ సురేష్‌బాబు తెలిపారు. పీహెచ్‌సీ పరిధిలో ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్ళివచ్చిన వారు నలుగురు ఉన్నారు. వారిని పరీక్షల కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని డాక్టర్‌ తెలిపారు. జిల్లా అఽధికారులు స్పందించి మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని కోరారు.

Updated Date - 2020-04-04T10:00:12+05:30 IST