Abn logo
Sep 26 2021 @ 02:20AM

నిర్లక్ష్యం వద్దు!

కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉంది 

రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టలేదు 

రోజూ వెయ్యికి పైగా కేసులు, కనీసం 5 మరణాలు

 

(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రానికి కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. వైరస్‌ మరోసారి విజృంభించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేరళలో కొవిడ్‌ తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా విరుచుకుపడటాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో 2నెలలుగా రోజూ దాదాపు 20వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి ప్రమాదం ఏపీకి కూడా పొంచి ఉందని, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మరోసారి కొవిడ్‌ విధ్వసం తప్పదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో నిత్యం వెయ్యికి పైగా కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. 


మళ్లీ అవే తప్పులు 

రాష్ట్రంలో కరోనా అదుపులోకి రాకపోయినా ప్రజల్లో నిర్లక్ష్యం మాత్రం అంతులేని స్థాయిలో పెరిగిపోతోంది. ఫస్ట్‌ వేవ్‌ తర్వాత చేసిన తప్పులే ఇప్పుడూ చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం అనే జబ్బు కరోనా కంటే అత్యంత ప్రమాదకరంగా మారింది. 50శాతం మందికిపైగా మాస్క్‌ను పక్కన పడేశారు. శానిటైజర్‌ను వాడటం మానేశారు. భౌతిక దూరాన్ని గాలికి వదిలేశారు. బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రమాదానికి దగ్గరగా ఉన్నామని తెలిసినా రక్షణ కవచాలను పక్కన పెట్టేస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే రాష్ట్రంలో 20లక్షల కేసులు నమోదవడానికి, 14వేల మంది మరణించడానికి కారణమైంది. ఇప్పటికీ రోజుకు ఐదుగురికి తక్కువ కాకుండా కరోనాకు బలవుతూనే ఉన్నారు. అయినా ప్రజల్లో మార్పు మాత్రం రావడం లేదు. ఇంతే నిర్లక్ష్యంతో ఉంటే సెకండ్‌ వేవ్‌కు మించిన స్థాయిలో థర్డ్‌ వేవ్‌ను చూడాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


సీజనల్‌ జ్వరాలతో జాగ్రత్త 

రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వీటి బారిన పడినవారికి సాధారణంగా జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొవిడ్‌కు కూడా ఇవే లక్షణాలు ఉన్నా ప్రతి జ్వరాన్ని కరోనాగా పరిగణించలేం. అలాగని నిర్లక్ష్యం వహించడానికి లేదు. లక్షణాలు ఉన్నవారు సీజనల్‌ వ్యాధులకు సంబంధించిన రక్త పరీక్షలతపాటు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు కూడా చేరుంచుకోవాలి. దీనివల్ల వ్యాధిని త్వరగా గుర్తించే అవకాశం ఉంటుంది. చాలామంది కరోనా లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొవిడ్‌ను ముందే గుర్తిస్తే వెంటనే చికిత్స ప్రారంభించి ప్రాణాపాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని చెబుతున్నారు. 


పండుగలు, వేడుకల్లో అప్రమత్తం 

రాబోయే 6 నుంచి 8 వారాల్లో తగిన జాగ్రత్తలతో వ్యవహరిస్తే కొవిడ్‌ ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉంది. పండుగలు, వేడుకల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏమా త్రం అజాగ్రత్తగా ఉన్నా కేసులు పెరిగిపోయి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. కొవిడ్‌ ప్రభావం తీవ్రస్థాయిలో లేకుండా సులువుగా బయటపడాలంటే వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిందేనని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చంటున్నారు. అలాగే టీకా వేయించుకున్న తర్వాత నిర్లక్ష్యం కూడా పనికిరాదని, మాస్క్‌, శానిటైజర్‌ వాడకంతో పాటు భౌతిక దూరం నిబంధన కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. 


మాస్క్‌, భౌతిక దూరం మస్ట్‌

రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటికీ తగ్గుముఖం పట్టలేదు. థర్డ్‌ వేవ్‌ ప్రమాదం లేదని కూడా చెప్పలేం. మనల్ని మనం కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి. మాస్క్‌, శానిటైజర్‌ వాడాలి. భౌతిక దూరం నిబంధన తప్పనిసరిగా పాటించాలి. కొవిడ్‌కు అధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. వ్యాధిని వెంటనే గుర్తిస్తే రెండు, మూడు రోజుల్లోనే వైరస్‌ నుంచి సులువుగా బయటపడవచ్చు. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ప్రాణా ల మీదకు వస్తుంది. సీజనల్‌ వ్యాధులు సోకినవారు కూడా కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. 

డాక్టర్‌ పద్మ మొవ్వ, ఎండీ, సెంటినీ హాస్పిటల్స్‌క్రైమ్ మరిన్ని...