టెస్ట్‌ ఇచ్చిన 13 రోజులకు నెగటివ్‌ మెసేజ్‌.. మళ్లీ ఒకరోజులోనే..

ABN , First Publish Date - 2020-08-03T14:03:37+05:30 IST

తిరుపతి నగరం టౌన్‌క్లబ్‌ ప్రాంతానికి చెందిన తండ్రీకొడుకులు..

టెస్ట్‌ ఇచ్చిన 13 రోజులకు నెగటివ్‌ మెసేజ్‌.. మళ్లీ ఒకరోజులోనే..

తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరం టౌన్‌క్లబ్‌ ప్రాంతానికి చెందిన తండ్రీకొడుకులు జూలై 13న కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. 17వ తేది కుమారుడుకి నెగెటివ్‌ వచ్చింది. 18న తండ్రి (73)కి పాజిటివ్‌ రావడంతో రుయా కొవిడ్‌ సెంటర్‌కు అక్కడనుంచి పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 20వతేది ఆయన చనిపోయారు. కాగా, ఆయన కుటుంబంలోని ఐదుగురు 19వ తేది శ్వాబ్‌ ఇచ్చి హోమ్‌ క్వారంటైన్‌లో ఉండిపోయారు. పది రోజులు దాటిపోయినా వీరి రిపోర్టు రాలేదు. అనేకమంది సిఫార్సుతో 30వ తేది అందరికీ నెగెటివ్‌ అని అనధికారికంగా తెలిసింది. 31న వారి సెల్‌ఫోన్లకు నెగెటివ్‌ రిపోర్ట్‌ మెసేజ్‌ వచ్చింది. పెద్దదిక్కు కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ అందరికీ నెగెటివ్‌ రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆగస్టు 1న మరో షాక్‌ ఎదురైంది. కుటుంబ సభ్యుల్లో ఓ యువకుడికి పాజిటివ్‌ వచ్చిందని అర్బన్‌ తహసీల్దారు కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది.


దీంతో ఒక్కసారిగా అందరూ కంగుతిన్నారు. తమకు నెగెటివ్‌ అని మెసేజ్‌ కూడా వచ్చిందని, ఇంతలో పాజిటివ్‌ రావడమేంటని సిబ్బందిని నిలదీశారు. తమకొచ్చిన పాజిటివ్‌ జాబితాలో మీ అబ్బాయి పేరుందని, ఇప్పుడు మీరు ఎక్కడున్నారో కనుక్కుంటున్నామని సిబ్బంది బదులిచ్చారు. శాంపిల్‌ ఇచ్చిన 12 రోజుల తర్వాత నెగెటివ్‌ మెసేజ్‌, ఆ తర్వాత పాజిటివ్‌ అని ఫోన్‌లో ఆరాతీయడంపై కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. హోం క్వారంటైన్‌లో ఉంటామని సిబ్బందికి తేల్చిచెప్పేశారు. 


కొసమెరుపు ఏంటంటే.. సదరు కుటుంబ సభ్యుడు స్థానిక  అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధి రోజువారీ కార్యక్రమాలను మీడియాకు సమాచారమిచ్చే వ్యక్తి. వీరికే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల అగచాట్లు ఏస్థాయిలో ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. 


15 రోజుల తర్వాత ‘పాజిటివ్‌’ అంటే ఏం లాభం? 

ఇలాంటివి జిల్లా వ్యాప్తంగా అనేకం కనిపిస్తున్నాయి. 17వ తేది చేసిన టెస్టుల ఫలితాలు దాదాపు 50 మందికి పైగా 31వతేది పాజిటివ్‌ అని వచ్చాయి. అంతలోపు వీళ్లు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటే సరి. బయట తిరిగేసి ఉంటే వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశం లేకపోలేదు. శాంపిల్‌ ఇచ్చిన 5 రోజుల తర్వాత కూడా రిపోర్ట్‌ రాకపోతే దాదాపుగా నెగెటివ్‌ వచ్చినట్టేనని కొవిడ్‌ అధికారులు చెబుతున్నారు. శాంపిల్‌ లోడ్‌ పెరిగిపోవడం వల్ల డేటా ఎంట్రీలో ఆలస్యం జరగుతోందంటున్నారు.


ఆ లెక్కన 15 రోజుల తర్వాత పాజిటివ్‌ అని రిపోర్ట్‌ ఇవ్వడమేంటో అర్థంకాని పరిస్థితి. పాజిటివ్‌ వచ్చి ఐసొలేషన్‌లో ఉంచినా 10 రోజుల్లోపే ఎలాంటి నిర్ధారణ చేయకుండా డిశ్చార్జ్‌ చేస్తున్నారు. ఇక 15 రోజుల తర్వాత పాజిటివ్‌ రిపోర్ట్‌ ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండకపోగా వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా జరిగే అవకాశముంది. ఇకనైనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే టెస్టుల ఫలితాలు ఇవ్వడంలో జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. లేకుంటే శ్రమంతా వృథానే అవుతుంది. 


Updated Date - 2020-08-03T14:03:37+05:30 IST